BRAHMAMUDI TODAY జూలై 10 ఎపిసోడ్: కన్నింగ్ సుభాష్ మరో అబద్దం! ధనుంజయ్‌కి ఘోర అవమానం.. కీలక మలుపు

Brahmamudi 2024 july 10 Episode: కనకం నేటి కథనంలో రెచ్చిపోయింది. ధనుంజయ్‌కి చుక్కలు చూపించింది. ఈ క్రమంలోనే నేటి కథనం ఆసక్తికరంగా సాగింది. దుగ్గిరాలా ఇంట ఆనందం పొంగిపోతుంటే.. కనకం ఇంట ఆక్రోషం తాండవం ఆడింది. ఆదిపరాశక్తిలా మారిన కనకం.. ధనుంజయ్‌ ఆట కట్టించింది. అప్పూ గుండెల్లో మరో చిచ్చుకు కారణం అయ్యింది ఆ సంఘటన. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)

Brahmamudi 2024 july 10 Episode: కవి బాధపడేది అనామిక కోసం కాదు.. అప్పూ కోసం అని.. కవి మనసులో ఉన్న మాట అందరి ముందు బయటపెట్టి.. రుద్రాణి చిచ్చు రేపింది. ఈ క్రమంలోనే కవి కూడా.. ‘అవును.. అప్పూ గురించే ఆలోచిస్తున్నా.. ఆలోచిస్తే తప్పేంటీ? నా కారణంగానే అప్పూ జీవితం నాశనం అయిపోయింది. తన జీవితం బాగుపడేంత వరకూ ఇలా ఆలోచిస్తూనే ఉంటాను. ఎవరు ఏం చేస్తారో చూస్తాను.. అనామిక నాకు దూరం కావడానికి అప్పూనే కారణం అని నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దు. మాట్లాడితే నేను ఊరుకోను’ అంటూ తల్లిని ఉద్దేశించి రెచ్చిపోతాడు కవి. ఇక కావ్య.. తర్వాత కవి దగ్గరకు వెళ్లి.. ‘అప్పూ గురించి బాధపడొద్దు.. అది త్వరగానే కోలుకుంటుంది. మీరు మాత్రం రాత మీద దృష్టి పెట్టండి కవిగారు’ అని చెబుతుంది. ఇక తర్వాత కావ్య.. రాజ్ దగ్గరకు వస్తుంది. కవి జీవితం గురించి.. కవి మనసు గురించి.. మాట్లాడుకుంటూ కావ్య, రాజ్ ఇద్దరూ బాధపడుతూ ఉండగా.. రాజ్ ఫోన్‌లో రిమైండర్ అలారం మోగుతుంది. అది చూసి.. ‘రేపు అమ్మా నాన్నల పెళ్లి రోజు కదా.. అవును నా ఫోన్‌లో ఈ రిమైండర్ ఎవరు పెట్టారు?’ అనుకుంటాడు. ‘నేనే పెట్టాను’ అంటుంది కావ్య. ‘థాంక్స్’ అని.. వెంటనే రాజ్ బయటికి వెళ్తాడు. తల్లికోసం ఒక చీర తీసుకొచ్చి.. దాచిపెడతాడు. ఇక ఆ రాత్రి.. కనకం, కృష్ణమూర్తి నిద్రపోకుండా ఆలోచిస్తుంటారు. చుట్టుపక్కల అమ్మలక్కల మాటలు తలుచుకుని అల్లాడిపోతారు. అప్పూ పెళ్లికి ఓకే అన్న కృష్ణమూర్తి..

‘ఇన్ని పుకార్లు వచ్చాకా అప్పూకి ఇక పెళ్లేం అవుతుంది?’ అని పక్కింటి ఆమె.. అప్పూని అవమానించిన మాటే పదేపదే గుర్తొస్తుంది కనకం, కృష్ణమూర్తులకు. దాంతో కనకం భర్త కృష్ణమూర్తితో.. ‘ఏమండీ.. మనం అప్పూకి పెళ్లి చేసేద్దాం.. శర్మగారికి కాల్ చేసి.. సంబంధం చూడమని చెప్పండి’ అంటుంది. మొదట కృష్ణమూర్తి ఒప్పుకోడు. ‘అప్పూ పోలీస్ అవ్వాలని కలలు కంటోంది కదా కనకం.. ఇప్పుడు మనం పెళ్లి చేసేస్తే దాని కలలన్నీ ఏం కావాలి?’ అంటాడు. అయితే కనకం.. ‘ఇప్పుడు మనం దానికి పెళ్లి చేయకపోతే.. దాని జీవితం ఏం అయిపోవాలో ఆలోచించండి’ అనడంతో.. కృష్ణమూర్తి కూడా కనకం మాటకే తలవంచుతాడు. ‘సరే అయితే రేపు శర్మకు కాల్ చేసి.. చెబుతాను’ అంటాడు. సరే అంటుంది కనకం.

టామ్ అండ్ జెర్రీల రచ్చ..

మరునాడు ఉదయాన్నే సుభాష్‌ని పిలుస్తారు కావ్య, రాజ్ ఇద్దరూ గది బయటికి. పెళ్లి రోజు శుభాకాంక్షలు డాడ్ అంటూ విష్ చేసి.. ‘అమ్మకు మీ ప్రేమను తెలిపేలా ఈ గిఫ్ట్ ఇచ్చి విష్ చేయండి’ అని చెబుతాడు సుభాష్‌కి రాజ్. ఇక అప్పుడు కూడా కావ్య, రాజ్‌లు తమ తమ గొప్పల్ని చెప్పుకుంటూ టామ్ అండ్ జర్రీల్లా వాదించుకుంటూ ఉంటారు సుభాష్. ‘గిఫ్ట్ తెచ్చింది నేను’ అంటే.. ‘పెళ్లి రోజు అని రిమైండర్ పెట్టి గుర్తు చేసింది నేను’ అని.. నేను గొప్ప అంటే నేను గొప్ప అని రెచ్చిపోతారు కావ్య రాజ్‌లు. ‘మీరు ఇలానే కొట్టుకుంటూ ఉంటారా.. ఆపండి ఇంక.. నేను వెళ్తాను’ అంటూ సుభాష్ గదిలోకి వెళ్లిపోతాడు నవ్వుతూ. ఇక అతడు వెళ్లాక కూడా కావ్య, రాజ్ వాదించుకోవడం ఆపరు.

ఏంటి గండు పిల్లులు మారిది?

గత ఎపిసోడ్‌లో ‘ఐ లవ్యూ కళావతీ’ అంటూ కళావతిని ఎత్తుకుని తిప్పేసినట్లు కలగన్న రాజ్.. తర్వాత తన ప్రేమ గురించి నోరు తెరిచి కళావతికి చెప్పలేదు కానీ.. టామ్ అండ్ జెర్రీల్లా కావ్య మీద విరుచుకుని పడుతూనే ఉంటాడు వీలు చిక్కినప్పుడల్లా. అది గమనించిన ఇందిరా దేవి.. ‘ఏంటి మీరిద్దరూ రెండు గండు పిల్లులు కొట్టుకుంటున్నట్లు కొట్టుకుంటున్నారు? ఇంక మారరా? నాకు మనవడ్ని ఇవ్వరా?’ అంటూ తిట్టిపోస్తుంది. ‘ఆ విషయం మీ మనవడ్ని అడగండి అమ్మమ్మా’ అని కావ్య వెళ్లిపోతుంది. వెంటనే రాజ్.. ‘చూశామా నాన్నమ్మా.. ఎలా తిప్పుకుంటూ వెళ్లిపోతుందో?’ అంటాడు.

నాన్నమ్మకు మాటిచ్చిన రాజ్.. ఇకనైనా చెబుతాడా?

‘వెళ్తే బతిమలాడరా.. ఏ భర్త అయినా భార్య విషయంలో కాస్త ఇగో తగ్గించుకుని బతకాలి’ అంటుంది ఇందిరా దేవి. ‘అంటే తాతయ్య కూడా నిన్ను అలానే..’ అంటాడు రాజ్. ‘అవును.. మీ తాతయ్యే కాదు.. ఏ భర్త అయిన అంతే.. ఇగో తగ్గించుకుని ఉండాలి భార్య దగ్గర.. ఇదిగో నీలా ఇగో లేదు అనుకోవడం కూడా ఒకరకమైన ఇగోనే.. ముందు దాన్ని తగ్గించుకోరా’ అని సలహా ఇస్తుంది ఇందిరా దేవి. దాంతో రాజ్ తన నాన్నమ్మతో.. ‘సరే నాన్నమ్మా.. ఈ రోజే నా మనసులో మాట తనకు చెబుతాను సరేనా’ అంటూ మాటిస్తాడు రాజ్. ‘అది నా మనవడంటే.. ఆల్ ది బెస్ట్‌రా మనవడా?’ అనేసి చేయి అందించి ఇందిరా దేవి వెళ్లిపోతుంది. రాజ్ అక్కడే.. సుభాష్ రూమ్ బయట.. సుభాష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.

అబద్ధాల సుభాష్ దొంగ నాటకం..

అపర్ణా దేవి వాష్ రూమ్‌లోంచి వచ్చేసరికి.. సుభాష్.. రాజ్ కొనితెచ్చిన చీర చేత్తో పట్టుకుని.. నిలబడతాడు. అది చూసి అపర్ణా దేవి కోపంగా నిలబడుతుంది. ‘ఈ రోజు మన పెళ్లి రోజు కదా అని.. నాకు తెలుసు నీకు నా మీద కోపం ఉందని. నేను ఏం ఇచ్చినా తీసుకోవని. కానీ నువ్వు కోపంగా ఉన్నావని భర్తగా చెయ్యాల్సింది చేయకపోతే.. అది కూడా తప్పే అవుతుంది కదా? (అబ్బా ఛా అనిపిస్తుంటుంది చూసేవారికి) నీ విషయంలో నేను తప్పు చేశాను. నువ్వు నా మీద కోపంగా ఉన్నావ్. కానీ నా విషయంలో నువ్వు ఏ తప్పు చెయ్యలేదు.. అలాంటప్పుడు నా ప్రేమను నేను చూపించాలి కదా?

పట్టలేని ఆనందంలో అపర్ణా దేవి కన్నింగ్ మొగుడు..

నేను భర్తగా ఓడిపోయి ఉండొచ్చు.. కానీ ఇన్నేళ్లుగా ఎన్నో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి.. భార్యగా గెలిచావ్.. అందుకే ఈ బహుమతిని ఇస్తున్నా.. నా జీవితంలోకి వచ్చి నాకు ఇంత ఆనందాన్ని అందించావ్.. పెళ్లి రోజు శుభాకాంక్షలు అపర్ణా’ అంటూ చీరను అందిస్తాడు సుభాష్. అందుకుంటుంది అపర్ణ. అంతా బాగానే ఉంది కానీ.. అతడి కొనని గిఫ్ట్‌కి.. అంత ఎమోషనల్ మాటలకు.. ఏ మాత్రం సింక్ కాలేదు. సుభాష్‌లో మరోసారి కన్నింగ్ తీరు స్పష్టమవుతుంది. ఇక అపర్ణాదేవి తీసుకోవడంతో.. సుభాష్ సంబరంగా బయటికి వెళ్లి.. అక్కడే నిలబడి ఉన్న రాజ్ దగ్గరకు పరుగు వెళ్లి.. ‘రాజ్.. నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అంటాడు కొడుకుని హత్తుకుని. (నిజానికి అపర్ణా దేవి బహుమతి అందుకుంది అంటే.. రాజ్ తెచ్చి ఉంటాడని ఊహించి ఉండొచ్చు. కచ్చితంగా తర్వాతైనా సుభాష్‌కి జలక్ ఇస్తుంది కాబోలు).

ది గ్రేట్ ధనుంజయ్ ఎంట్రీ..

‘ఈ రోజు నువ్వు ఆ బహుమతి తీసుకొచ్చి నాకు ఎంత మేలు చేశావో నీకు కూడా తెలియదురా రాజ్’ అంటూ తన సంతోషాన్ని రాజ్‌తో పంచుకుంటాడు సుభాష్. ‘అదేంటి డాడ్.. అంత ఎమోషనల్ అవుతున్నారు? అంతా ఓకేనా?’ అంటాడు రాజ్ తండ్రితో. ‘ఈ రోజు వరకూ ఎక్కడో చిన్న అనుమానంరా.. ఈ రోజు అది తీరిపోయింది. నేను చాలా సంతోషంగా ఉన్నానురా’ అంటాడు సుభాష్. ‘అయితే ఫ్యామిలీ మొత్తం కలిసి సెలెబ్రేట్ చేసుకుందాం డాడ్ రాత్రికి’ అంటాడు రాజ్. సరే అనేసి.. లోపలికి వెళ్లిపోతాడు సుభాష్. ఇక సీన్ కట్ చేస్తే.. కనకం, కృష్ణమూర్తి బాధగా కూర్చుని ఉంటారు. ఇంతలో ధనుంజయ్ అనే సారా వ్యాపారి.. పెళ్లిళ్ల పేరయ్య అయిన శర్మ గారితో కలిసి అక్కడికి వస్తాడు. ఎవరొచ్చారా? అని అప్పూ గుమ్మం దగ్గరకు వచ్చి పక్కగా నిలబడి.. అంతా చూస్తూ ఉంటుంది.

అంతా వింటున్న అప్పూ..

‘నమస్కారం’ అంటాడు ధనుంజయ్. అతడు ఊరిలో మనిషే కావడంతో కనకం, కృష్ణమూర్తి అతడ్ని గుర్తుపడతారు. ‘నేను ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఏంటి శర్మగారు చెప్పలేదా?’ అంటాడు నవ్వుతూ. వెంటనే శర్మ.. ‘అదేనమ్మా.. ఉదయాన్నే కృష్ణమూర్తిగారు.. మీ అమ్మాయికి సంబంధాలు కావాలని కాల్ చేశారు కదా.. అందుకే తీసుకొచ్చాను’ అంటాడు. ఇక కనకం రెచ్చిపోతుంది. ‘వీడా.. వీడు ఇద్దరు పిల్లలు పుట్టాక భార్యను చంపేసి.. జైలుకి వెళ్లి వచ్చాడు కదా?’ అంటుంది కోపంగా. ‘అయితే ఏంటీ.. సారా వ్యాపారంలో బాగానే సంపాదించాను.. డబ్బు ఉంటే మీ ఆడపిల్లల్ని ఇచ్చి పెళ్లి చేస్తారట కదా? ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు?’ అంటాడు ధనుంజయ్ పొగరుగా.

కనకం ఉగ్రరూపం.. ధనుంజయ్ చెంప పగలగొట్టిన కనకం..

కనకం ఊరుకోదు. ‘మాటలు జాగ్రత్త’ అంటుంది. ‘అదేంటమ్మా.. నీ కూతురు ఎవడితోనో తిరిగి లాడ్జ్‌లో దొరికింది. అలాంటి అమ్మాయికి నాలాంటోడు కాక.. ఎలాంటోడు వస్తాడు?’ అంటూ వాగుతాడు ధనుంజయ్. అయితే కనకం వాడి చెంప పగలగొట్టి.. ‘నా కూతురు నిప్పురా.. నడవరా బయటికి’ అంటూ కాలర్ పట్టుకుని.. బయటికి గెంటేస్తుంది. (నిజానికి వాడి ముందు కనకం ఎలకపిల్లలా ఉంటుంది.. కానీ కనకం మాస్ వార్నింగ్‌తో వాడ్ని ఏకేస్తుంది) ‘నన్ను చంపదెబ్బ కొట్టారు. అయినా ఫర్వాలేదు. మనసు మార్చుకుంటే కబురు పంపండి’ అంటాడు ధనుంజయ్ గుమ్మంలో నిలబడి. పోరా అంటూ కర్ర వెతుకుతుంది కనకం. దాంతో వాడు వెళ్లిపోతాడు. వెంటనే శర్మతో.. ‘మంచి సంబంధం చూడమంటే ఇదేం సంబంధం అండీ?’ అంటాడు కృష్ణమూర్తి కోపంగా.

పంతులు సలహా..!

‘నాదో సలహా.. ఇలాంటి సంబంధాలు కాక మరెంలాంటివి వస్తాయండీ? పెళ్లిళ్ల పేరయ్యాలా కాకుండా మీ మనిషిగా ఓ మాట చెబుతాను. ఇన్ని గొడవలు జరిగిన తర్వాత కూడా బయట సంబంధం తీసుకుని రావడం అంత మంచిది కాదమ్మా.. తెలిసో తెలియకో అమ్మాయి .. అబ్బాయితో తిరిగింది. దాన్ని సమాజం తప్పుగా చూసింది. దాన్ని సరిదిద్దాలనుకుంటే ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడమే మంచిది’ అంటాడు పంతులు. ‘పంతులు గారు మీ పని సంబంధాలు చూడటం.. సలహా ఇవ్వడం కాదు. ఎవరితో పెళ్లి చేస్తే నా కూతురు సంతోషంగా ఉంటుందో నాకు తెలుసు.. మీరు మేము చెప్పింది చేయండి చాలు’ అంటుంది కనకం.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-10T04:04:09Z dg43tfdfdgfd