BOY STUCK | బ్రిడ్జి పిల్లర్‌, శ్లాబ్‌ మధ్య చిక్కుకున్న బాలుడు.. రక్షించేందుకు అధికారుల ప్రయత్నాలు

పాట్నా: బ్రిడ్జి పిల్లర్‌, శ్లాబ్‌ మధ్య ఒక బాలుడు చిక్కుకున్నాడు (boy stuck). ఈ విషయం తెలిసిన అధికారులు ఆ బాలుడ్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. బీహార్‌లోని రోహతాస్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖిరియా గ్రామానికి చెందిన 11 ఏళ్ల రంజన్‌ కుమార్‌ అదృశ్యమయ్యాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు రెండు రోజులుగా వెతుకుతున్నారు.

కాగా, నస్రీగంజ్‌ ప్రాంతంలోని సోన్‌ నదిపై ఉన్న బ్రిడ్జి శ్లాబ్‌, పిల్లర్‌ మధ్య ఆ బాలుడు చిక్కుకున్నాడు. అతడి ఏడ్పులు విన్న ఒక మహిళ ఆ బాలుడి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. దీంతో వారితోపాటు స్థానికులు ఆ వంతెన వద్దకు చేరుకున్నారు. పిల్లర్‌, శ్లాబ్‌ మధ్య చిక్కుకున్న రంజన్‌ కుమార్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు.

మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్‌ఎఫ్‌) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బ్రిడ్జి శ్లాబ్‌, పిల్లర్‌ మధ్య ఇరుక్కున్న బాలుడ్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. 16 గంటలకుపైగా శ్రమించినప్పటికీ బాలుడ్ని బయటకు తీయలేకపోయారు. మరోవైపు ఆ బాలుడి నుంచి ఎలాంటి శబ్దాలు రావడం లేదని స్థానికులు తెలిపారు. కాగా, కుమారుడు రంజన్‌ కుమార్‌ మానసిక పరిస్థితి సరిగా లేదని తండ్రి తెలిపాడు.

2023-06-08T11:02:20Z dg43tfdfdgfd