హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఇద్దరు డీఈవోలు జాతీయ ఇన్నోవేషన్ అవార్డులకు ఎంపికయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి డీఈవో విజయకుమారి, గతంలో సిరిసిల్ల డీఈవోగా పనిచేసిన రాధాకిషన్ ఈ నెల 23న ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (నీపా) అందజేసే ఈ అవార్డులకు ఇద్దరు తెలంగాణ వారే ఎంపిక కావడం విశేషం. కొవిడ్, లాక్డౌన్ సమయంలో మేడ్చల్ జిల్లా విద్యాశాఖ ‘మేడ్చల్ బడి డాట్ కామ్’ పేరుతో వెబ్సైట్ను ప్రారంభించి, సృజనాత్మక బోధనను చేపట్టింది. ప్రభుత్వ ఉపాధ్యాయులంతా వీడియో పాఠాలను తయారుచేసి వెబ్సైట్లో పొందుపరిచారు. దీని ఫలితంగా డీఈవో విజయకుమారికి ఇన్నోవేషన్ అవార్డు వరించింది. రాజన్న సిరిసిల్ల డీఈవోగా ఉన్న కాలంలో సీఎస్సార్ నిధులతో బడులను అభివృద్ధి చేయడం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనివ్వడంతో రాధాకిషన్ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డుల కోసం జాతీయస్థాయిలో ఎన్నో నామినేషన్లు స్వీకరించినా మన డీఈవోల కృషి అత్యంత ప్రభావితంగా నిలిచింది.
2023-03-18T19:50:01Z dg43tfdfdgfd