‘కళ్లు మూసుకుంటే నా కొడుకే గుర్తుకొస్తున్నాడు’ – మురుగు కాలువలో పడి చనిపోయిన బాలుడి తల్లిదండ్రుల వేదన

గువాహాటీలోని నూన్మాటీ ప్రాంతంలో శ్యామ్ నగర్ అంతా నిశ్శబ్దం ఆవరించింది.

మానిక్ దాస్ పథ్‌లో కొంతదూరం నడిచిన తర్వాత, ఒక ఇంటి బయట వేసి ఉన్న టెంట్‌లో కొందరు కూర్చుని ఉన్నారు.

మేం ఆ ఇంటి దగ్గరకు వెళ్లినప్పుడు, పెద్ద పెద్ద ఏడుపులు వినిపించాయి.

ఆ ఇల్లు ఎనిమిదేళ్ల అవినాశ్ సర్కార్‌ది. ఆ బాబు జులై 4 రాత్రి తన తండ్రి స్కూటర్‌ పైనుంచి మురుగు కాలువలో పడి కొట్టుకుపోయాడు.

బాబు కోసం మూడు రోజుల పాటు సహాయ బృందాలు వెతికాయి. కానీ, బాబును మాత్రం ప్రాణాలతో తీసుకురాలేకపోయారు.

చివరకు రాజ్‌గఢ్ ప్రాంతంలో అవినాశ్ మృతదేహం దొరికింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 4 కిలోమీటర్ల దూరంలో ఆదివారం(జూన్ 7న) ఉదయం మృతదేహం దొరికింది.

బీబీసీ తెలుగు న్యూస్ వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంకా షాక్‌లోనే అవినాశ్ తండ్రి

లేత ఊదా రంగు టీ-షర్ట్, బ్లాక్ ట్రాక్ ప్యాంట్ వేసుకుని ఇంటి బయట నిల్చున్న ఓ వ్యక్తి ఇంకా షాక్‌లోనే ఉన్నారు.

ఇంట్లో ఏడుస్తున్న మహిళను ఓదార్చేందుకు బయట నుంచే ఏదో ఒకటి చెబుతూ, తను కూడా ఏడుస్తున్నారాయన.

ఆయన చనిపోయిన బాలుడు అవినాశ్ తండ్రి హోరోలాల్ సర్కార్.

తన కొడుకును రక్షించుకునేందుకు వరద నీటితో నిండిన మురుగు కాలువలో రాత్రింబవళ్లు వెతికారు.

హోరోలాల్ కాళ్లు రెండూ తీవ్రంగా గాయపడ్డాయి. మేం దీని గురించి అడిగినప్పుడు, ‘‘మురుగు కాలువలో చాలా గాజు ముక్కలున్నాయి’’ అని కన్నీటితో చెప్పారు.

ఈ ప్రమాదం ఎలా జరిగింది?

‘‘ఆ రోజు రాత్రి 10 గంటలవుతోంది. గ్యారేజ్ మూసివేసి ఇంటికి బయలుదేరాను. నా ఎనిమిదేళ్ల కొడుకు అవినాశ్, 13 ఏళ్ల మేనల్లుడు కూడా నాతో పాటు గ్యారేజ్‌లోనే ఉన్నారు. ముగ్గురం కలిసి గ్యారేజ్ నుంచి బయటకి వచ్చాం. స్కూటర్‌లో అవినాశ్ ముందు సీటులో కూర్చోగా, నా మేనల్లుడు వెనకాల కూర్చున్నాడు. షాపు పక్కన ఫ్లై ఓవర్ పనులు జరుగుతుండటంతో, ఒక రోడ్డు మూసివేశారు. అంతేకాక, చాలా ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. అందుకే, నేను జ్యోతి నగర్ రోడ్డులో ఇంటికి వెళ్లాలనుకున్నా. ఆ సమయంలో వర్షం చిన్నగా పడుతుంది. వీధి లైట్లు వెలగడం లేదు. దీంతో, రోడ్డు సరిగ్గా కనిపించలేదు. జ్యోతి నగర్ చౌక్‌కు దగ్గర్లోకి రాగానే, ఒక్కసారిగా నా స్కూటర్ అదుపు తప్పి కింద పడిపోయింది. స్కూటర్‌పై ముందు నిల్చున్న అవినాశ్ కిందకి పడిపోయాడు. మురుగు కాలువలో నీళ్లు చాలా వేగంగా వెళ్తున్నాయి. అంతా చీకటిగా ఉండటంతో, అవినాశ్‌ నాకు కనిపించలేదు. ఎలాగో అలా పైకి లేచి, మురుగు కాలువలో నా కొడుకు కోసం వెతికాను. కానీ, కనిపించలేదు’’ అని ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తుకు చేసుకున్నారు హోరోలాల్.

ఆ తర్వాత దగ్గర్లో ఉన్న పోలీసు స్టేషన్‌కు కాల్ చేసి, సాయం అడిగారు హోరోలాల్. ఆయన, రెస్క్యూ టీమ్ కలిసి మూడు రోజుల పాటు గౌహతిలోని మురుగు కాలువల్లో తన కొడుకు కోసం వెతికారు.

మూడు రోజులు వేచిచూసినా, చివరకు..

అవినాశ్ తల్లి కృష్ణమణి సర్కార్ తన కొడుకు పేరు తలుచుకుంటూ ఏడుస్తున్నారు. కొడుకు మురుగు కాలువలో కొట్టుకుపోయినప్పటి నుంచి ఆమె ఏడుస్తూనే ఉన్నారు.

‘‘నాతో పాటు మార్కెట్‌కు వచ్చాడు. మొదట నా భర్త గ్యారేజీకి వెళ్లాం. నా మేనల్లుడు షును అక్కడే ఉన్నాడు. అవినాశ్ కూడా వాళ్ల నాన్నతో కలిసి ఇంటికి వస్తా అన్నాడు. అందుకే, అక్కడే విడిచిపెట్టి వచ్చాను. కానీ, అవినాశ్ రాలేదు. ఎందుకు రాలేదు? ప్రతి ఒక్కరు చూస్తుండగానే నా కొడుకు ఎలా మురుగు కాలువలో పడిపోయాడు? నా కొడుకు తిరిగి వస్తాడని నాకనిపించింది. కళ్లు మూసుకుంటే, ధునునే(కొడుకు ముద్దుపేరు) కనిపిస్తున్నాడు’’ అని అవినాశ్ తల్లి కృష్ణమణి కన్నీరు పెట్టుకున్నారు.

‘‘మూడు రోజులు చాలా భారంగా గడిచాయి. నా గుండె అంతా బాధతో బరువెక్కింది. ఒక రోజు తర్వాత, మురుగు కాలువలో నా కొడుకు చెప్పులు దొరికాయి. బతికే ఉన్నాడేమోనని కొంచెం ఆశ కలిగింది. మూడవ రోజు ఉదయం, నా కొడుకు దొరికినట్లు కాల్ వచ్చింది. గువాహాటీ మెడికల్ కాలేజీకి వెళ్లగానే, అంతా అయిపోయింది. నా కొడుకు మృతదేహం చూడాల్సి వచ్చింది. అతను నా కొడుకు అనే నమ్మేందుకు నేనసలు సిద్ధంగా లేను. కొన్ని రోజుల క్రితమే, నా కొడుకు కాలుకు నల్ల దారం కట్టాను. ఆ తాడు అలానే ఉంది’’ అని ఏడ్చుకుంటూ చెప్పారు.

ఈ ప్రమాదానికి బాధ్యులెవరు?

‘‘ఒకవేళ ప్రభుత్వం ఏదైనా పనిచేస్తే, అది సరిగ్గా చేయాలి. మురుగు కాలువలు కట్టిన తర్వాత, వాటిపైన కప్పు వేయాలి. రోడ్డంతా చీకటిగా ఉంది. వీధి లైట్లు ఉండుంటే, అతను పడిపోగానే కనిపించేవాడు. మురుగు కాలువపై ఎలాంటి రైలింగ్, మూత లేదు. ఇప్పుడు నా కొడుకును తిరిగి తీసుకురాలేం. కానీ, భవిష్యత్‌లో మరే బిడ్డ నా కొడుకు లాగా ప్రాణాలు పోగొట్టుకోకూడదంటే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి’’ అని కృష్ణమణి అన్నారు.

కృష్ణమణి ఈ విషయాలు చెబుతున్నప్పుడు, తన రెండేళ్ల చిన్న కొడుకు వాళ్ల అమ్మ మొబైల్‌లో చనిపోయిన తన అన్న ఫోటో చూస్తూ.. ‘భయ్యా-భయ్యా’ అని పిలుస్తున్నాడు.

బాబును వెతికేందుకు 56 గంటలు ఎందుకు పట్టింది?

ప్రమాదం జరిగిన రాత్రే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్‌డీఆర్ఎఫ్) బాబును వెతికే పని మొదలుపెట్టింది.

వరదల వల్ల, మట్టి అంతా మురుగు కాలువలోకి కొట్టుకువచ్చింది. దీంతో, సెర్చ్ ఆపరేషన్‌లో సహాయ బృందానికి పలు ఆటంకాలు ఎదురయ్యాయి.

‘‘ఎస్‌డీఆర్ఎఫ్‌కు చెందిన ఎనిమిది నుంచి తొమ్మిది మంది సభ్యుల బృందం ప్రమాద స్థలానికి వెళ్లి మురుగు కాలువలో పడిపోయిన బాబు కోసం వెతికింది. వర్షాల వల్ల, ఆరు అడుగుల ఎత్తులో మురుగు కాలువ పారింది. వర్షం ఆగినప్పుడు, నీటి ఉద్ధృతి కాస్త తగ్గింది. ప్రమాదం జరిగిన రాత్రి నుంచి ఉదయం వరకు వెతుకుతూనే ఉన్నాం. కానీ, బాబు దొరకలేదు’’ అని అధికారులు చెప్పారు.

ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి రెండు కిలోమీటర్ల కింద వరకు చాలా ప్రాంతాల్లో మురుగు కాలువ కవర్ చేసి లేదని రెస్క్యూ టీమ్ అధికారులు తెలిపారు.

మురుగు కాలువ మూసి ఉన్నా లేదా దగ్గర్లో రైలింగ్ ఉన్నా బాబు బతికే వాడని తండ్రి హోరోలాల్ చెప్పారు.

‘‘నగరంలో కాలువల నెట్‌వర్క్ చాలా సంక్లిష్టంగా ఉంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో లోతు చాలా ఎక్కువగా ఉంది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో కాలువలు నాలుగు అడుగుల లోతులో ఉన్నాయి. మురుగు కాలువ పైకప్పును తీసి వెతుక్కుంటూ మళ్లీ పెట్టేందుకు సమయం పట్టింది. అంతేకాక, చాలా ప్రాంతాల్లో మురుగు కాలువ లోపల బురద మట్టి ఉంది. జేసీబీని వాడుతూ ఈ మట్టిని బయటికి తీశాం’’ అని అధికారులు చెప్పారు.

రెండు రోజులైనా బాబు దొరకకపోయే సరికి, ఎన్‌డీఆర్ఎఫ్‌కు చెందిన బృందం రెండు స్నిఫర్ డాగ్స్‌తో కాలువలోకి దిగింది.

ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, పోలీసులు, గువాహాటీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, స్థానిక యంత్రాంగం అన్ని కలిసి మైనింగ్ మిషన్లతో బాలుడి కోసం వెతికారు.

జులై 7న ఉదయం 9 గంటలకు రాజ్‌గఢ్‌లోని అపూర్వ సింహ పథ్ సమీపంలో ఉన్న కాలువలో బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు.

ఈ ప్రమాదం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శలు రావడంతో, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ స్వయంగా వచ్చి రెస్క్యూ ఆపరేషన్‌ను సమీక్షించారు.

ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యం, మురుగు కాలువలు తెరిచి ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని వచ్చిన విమర్శలపై బీబీసీ అడిగిన ప్రశ్నలకు గువాహాటీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్పందించారు.

నగరంలో ఇలాంటి ఘటనలు జరగకుండా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌తో పాటు సంబంధిత విభాగాలతో కార్పొరేషన్ చర్చలు జరుపుతుందని చెప్పారు. వరదల సమయంలో ప్రభుత్వం జారీ చేసే అలర్ట్‌లను ప్రజలు పాటించాలని సూచించారు.

అవినాశ్ మరణం గువాహాటీలో అంతకుముందు కూడా మేన్‌హోల్స్, ఓపెన్ డ్రైనేజ్‌లలో పడి అనేక మంది చనిపోయిన ఘటనలను గుర్తుచేసింది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-07-10T07:41:50Z dg43tfdfdgfd