చట్నీ పాత్రలో ఎలుక

  • సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూలో ఘటన.. వైరల్‌గా మారిన వీడియో
  • తరగతి గదులు బహిష్కరించి విద్యార్థుల ఆందోళన
  • కళాశాలను సందర్శించిన అదనపు కలెక్టర్‌ మాధురి
  • కేర్‌ టేకర్ల తొలిగింపునకు ఆదేశాలు
  • నాణ్యమైన ఆహారం అందడం లేదంటూ విద్యార్థుల గగ్గోలు

చౌటకూర్‌, జూలై 9: సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల మరోసారి వార్తల్లోకెక్కింది.బాలుర హాస్టల్‌లోని మెస్‌లో ఉన్న పల్లి చట్నీ పాత్రలో ఎలుక చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ అధికారుల బృందంతో పాటు జిల్లా అధికారులు రంగప్రవేశం చేశారు. సోమవారం సాయంత్రం పల్లీ చట్నీ పాత్రలో ఎలుక సంచరించడాన్ని అక్కడున్నవారు వీడియో తీశారు. మంగళవారం ఉదయమే ఈ వీడియోను పలు గ్రూపుల్లోకి షేర్‌ చేశారు. దీంతో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ మాధురి హుటాహుటినా కళాశాలకు వచ్చి విచారణ చేపట్టారు. జరిగిన సంఘటన విషయమై విద్యార్థినీ, విద్యార్థులతో వేర్వేరుగా మాట్లాడారు. కొంతకాలంగా తమకు నాణ్యతలేని ఆహారాన్ని వడ్డిస్తున్నారని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం కావడం లేదని విద్యార్థులు ఆరోపించారు. సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌, ఎంటెక్‌, బీఫార్మసీ, ఎంఫార్మసీ విభాగాలకు సంబంధించి సుమా రు 1400 మంది విద్యార్థినీ, విద్యార్థులు వేర్వేరుగా హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలతోనూ అడిషనల్‌ కలెక్టర్‌ మాధురి మాట్లాడారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ రెక్టార్‌ విజయ్‌కుమార్‌రెడ్డి, సీఈ వెంకటేశ్వర్‌రెడ్డి, ఇతర అధికారుల బృందం కళాశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించింది.

జరిగిన తప్పిదాలపై విచారణ చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మెస్‌ కాంట్రాక్టర్‌ను తొలిగిస్తున్నట్లు అక్కడే ప్రకటించారు. విద్యార్థులతో కళాశాలలో ప్రత్యేకంగా అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమకు అధ్వానమైన భోజనాన్ని అందిస్తున్నారంటూ జేఎన్‌టీయూ రెక్టార్‌ విజయ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఒక్కోసారి భోజనం సరిగ్గా లేకపోవడంతో పస్తులు ఉంటున్నామని, బయట నుంచి పార్సిల్‌ తెప్పించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మెస్‌లు శుభ్రంగా లేనందున ఎలుకలు, బల్లులు, ఈగలు సంచరిస్తున్నాయని గగ్గోలు పెట్టారు. ఇందుకు కారణమైన ఆరుగురు కేర్‌టేకర్లకు మెమోలు ఇవ్వాలని కళాశాల ప్రిన్సిపాల్‌ నరసింహను ఆదేశించారు. ఈ సంఘటన నేపథ్యంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి కళాశాల పరిపాలన భవనం ఎదుట భైఠాయించి, ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్‌ నరసింహ స్పందించారు. సోమవారం ఉద యం వేళ విద్యార్థినీ, విద్యార్థులకు వడ టిఫిన్‌ అందజేశామని, అయితే, పాత్రలను శుభ్రం చేసే ప్రదేశంలో రాత్రి ఎలుక వంట పాత్రలోని చట్నీలో పడిందని ఆయన వివరించారు. బాలికలు, బాలుర వసతి గృహాలకు భోజనం సరఫరా చేస్తున్న మెస్‌ కాంట్రాక్టర్‌ సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన జరిగిందన్నారు. వంట పాత్రలను ఎప్పటికప్పుడూ శుభ్రం చేస్తున్నారని, అనుకోకుండా ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.

మెస్‌ కాంట్రాక్టర్‌పై అడిషనల్‌ కలెక్టర్‌ ఆగ్రహం

జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో వంట పాత్రలోని చట్నీలో ఎలుక పడిందన్న విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి ఈ సంఘటనపై విచారణ జరుపాలంటూ జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) మాధురిని ఆదేశించారు. దీంతో ఆమె హుటాహుటినా కళాశాలకు చేరుకుని హాస్టల్‌లోని మెస్‌లను తనిఖీ చేశారు. తాము విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు ఆమెతో ఏకరువు పెట్టారు. భోజనం సరిగ్గా పెట్టడంలేదంటూ పరిశుభ్రత లోపించిందని తదితర అంశాలపై ఆమెకు ఫిర్యాదు చేశారు.ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ధర్మేందర్‌ పాల స్టోర్‌ రూంలో నిల్వ ఉన్న కూరగాయలు, వంటల్లో ఉపయోగించే మసాలలను పరిశీలించారు. అల్లం డబ్బాలోంచి తీవ్ర దుర్గంధం రావడంతో అక్కడే ఉన్న వంట మనుషులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో ఇలాగే వండుకుని తింటారా అని ప్రశ్నించారు.

జేఎన్‌టీయూ ఘటనపై మంత్రి దామోదర రాజనరసింహ ఆరా..

సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ కళాశాల బాలు ర హాస్టల్‌లో జరిగిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరాతీశారు. విద్యార్థులు టిఫిన్‌లో తినే చట్నీలో ఎలుక పడిందంటూ తీసిన వీడియో వైరల్‌ కావడంతో పాటు పలు టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో స్పందించిన మంత్రి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

2024-07-09T22:20:26Z dg43tfdfdgfd