నల్లబెల్లి, మార్చి 18: పుట్టుకతోనే విధివంచనకు గురైన ఓ చిన్నారికి చూపును ప్రసాదించేందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జడ్పీ ఫ్లోర్‌లీడర్ స్వప్న దంపతులు ముందుకొచ్చారు. బాలిక ఆరోగ్యానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని నందిగామ గ్రామానికి చెందిన కొమ్ము బాలరాజు 9 నెలల కుమార్తె పుట్టుకతోనే రెటీనా సమస్యతో బాధపడుతున్నది. బాలికకు కంటి ఆపరేషన్ చేస్తే గుండెపై భారం పడుతుందని వైద్యాధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా పెద్ది దంపతులు తెలుసుకున్నారు. స్పందించిన వారు చిన్నారి ఆరోగ్య సమస్యలు కుదుటపడే వరకూ మొత్తం ఖర్చు తామే భరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించిన రూ. 5 లక్షల విలువైన చెక్కును శనివారం నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని వారు అన్నారు. ఈ సందర్భంగా పెద్ది దంపతులకు బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధరరెడ్డి, ఎంపీపీలు కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్ పాలెపు రాజేశ్వర్‌రావుతోపాటు సాంబమూర్తి, రమేశ్ పాల్గొన్నారు.
చెన్నారావుపేట: గ్రామాల్లో దశల వారీగా అంతర్గత సీసీరోడ్లను నిర్మిస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. జోజిపేట నారాయనతండాలో జరిగిన పునీత జోజప్ప దేవాలయ సిల్వర్ జూబ్లీ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవుడి ఆశీస్సులతో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఫాదర్స్‌ను ఆయన ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పత్తి నాయక్, వైస్ ఎంపీపీ, బీఆర్‌ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, సర్పంచ్ కుండె మల్లయ్య, జోజిపేట సర్పంచ్ విజయ, జడ్పీ కో ఆప్షన్ రఫీ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, మాజీ ఎంపీపీ జక్క అశోక్, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, యువ నాయకులు కృష్ణచైతన్య, మహేందర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, వార్డు మెంబర్లు సతీశ్, ఉపేందర్, గట్ల రాంబాబు పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్: ముత్తోజిపేట 10వ వార్డులో సీసీరోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ వార్డు సభ్యురాలు చెట్టి శ్రీదేవి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 10వ వార్డు బీసీకాలనీ, ఇందిరమ్మ కాలనీ-1, 2ల్లో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఆమె కోరింది. స్పందించిన పెద్ది నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకుడు చెట్టి రమేశ్ పాల్గొన్నారు.
నల్లబెల్లి: ప్రతి ఒక్కరి జీవితంలో చిన్ననాటి స్మృతులు మరువలేనివని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. శనివారం మండలకేంద్రానికి వచ్చిన పెద్దికి 365 జాతీయ రహదారిపై శనిగరం గ్రామానికి చెందిన పలువురు చిన్ననాటి స్నేహితులైన గీత కార్మికులు ఎమ్మెల్యే కంటపడ్డారు. దీంతో ఆయన ఆనందానికి హద్దు లేకుండాపోయాయి. వెంటనే కాన్వాయ్ దిగి మిత్రుల వద్దకు వెళ్లి సుమారు గంటసేపు వారితో గడిపారు. ఈ సందర్భంగా కుటుంబ పరిస్థితులు, గత స్మృతులను నెమరువేసుకొని ఉల్లాసంగా గడిపారు. ఎప్పుడూ బిజీ షెడ్యూల్‌లో ఉండే ఎమ్మెల్యే తోటి మిత్రుల కోసం సమయం వెచ్చించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీపీలు బానోత్ సారంగపాణి, కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, బీఆర్‌ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, నాయకులు పాలెపు రాజేశ్వర్‌రావు, వక్కల చంద్రమౌళి, సర్పంచ్ నునావత్ వెంకన్ననాయక్ పాల్గొన్నారు.
2023-03-18T21:50:08Z dg43tfdfdgfd