జలమండలికి వరల్డ్‌ వాటర్‌ అవార్డు

  • వందశాతం మురుగుశుద్ధి దిశగా హైదరాబాద్‌
  • ప్రశంసించిన కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌

సిటీబ్యూరో, మార్చి 18(నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని హైదరాబాద్‌ వాటర్‌ బోర్డు దక్కించుకున్నది. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్‌ వాటర్‌ డైజెస్ట్‌ 2022-2023 సంవత్సరానికి 65 కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో ప్రభుత్వ రంగ ఉత్తమ ఎస్టీపీ అవార్డుకు ఎంపిక చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో వాటర్‌ బోర్డు డైరెక్టర్‌ శ్రీధర్‌ బాబు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. శనివారం అవార్డును వాటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో ఎండీ దానకిశ్‌ర్‌కు డైరెక్టర్‌ శ్రీధర్‌ బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఎండీ దానకిశోర్‌ మాట్లాడుతూ.. నగరంలో తాగునీటిని అందించడంతోపాటు మురుగు నీటి నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. దీనికి సీఎం కేసీఆర్‌, పురపాలక మంత్రి కేటీఆర్‌ల ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు.

యునెసో, కేంద్ర జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ సత్తా చాటింది. వాటర్‌ డైజెస్ట్‌ మ్యాగజైన్‌ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో నీటి నిర్వహణకు సంబంధించిన పలు ప్రభుత్వ శాఖలు, కార్పొరేట్‌ సంస్థలు పాల్గొన్నాయి. ప్రభుత్వ విభాగంలో హైదరాబాద్‌ వాటర్‌ బోర్డు ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైందన్నారు. దేశంలోనే వంద శాతం మురుగు నీటి శుద్ధి కోసం రూ. 3866 కోట్ల వ్యయంతో నగరంలో 62 ఎస్టీపీలతో సీవరేజ్‌ మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేస్తున్నామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిత్యం 1650 మిలియన్‌ లీటర్ల మురుగు నీరు రోజూ ఉత్పత్తి అవుతుండగా, ఇందులో 772 మిలియన్‌ గ్యాలన్ల మురుగు నీటిని 25 ఎస్టీపీల ద్వారా శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి అవుతుంది.

కేంద్రమంత్రి ప్రశంస

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ చేతుల మీదుగా అవార్డు, ప్రశంసా పత్రాన్ని జలమండలి అధికారులు అందుకున్నారు. దేశంలోనే వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేస్తున్న నగరంగా హైదరాబాద్‌ పయనిస్తోందని కేంద్రమంత్రి కొనియాడారు.

2023-03-18T20:14:54Z dg43tfdfdgfd