టీఎఫ్‌సీసీ సౌత్‌ నంది పురస్కారాలు

తెలంగాణ ప్రభుత్వం సహకారంతో మే నెలలో దుబాయ్‌లో టీఎఫ్‌సీసీ (తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌) నంది అవార్డ్స్‌ సౌత్‌ ఇండియా వేడుకల్ని నిర్వహించబోతున్నామని తెలిపారు టీఎఫ్‌సీసీ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌ . సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిసి ఈ విషయం గురించి చర్చించామన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రభుత్వం, ఎఫ్‌డీసీ ఎప్పుడూ చిత్ర పరిశ్రమకు వెన్నుదన్నుగా ఉంటాయి. రాబోయే కాలంలో టీఎఫ్‌సీసీకి మా పూర్తి సహకారం ఉంటుంది’ అన్నారు. రామకృష్ణగౌడ్‌ మాట్లాడుతూ ‘ఈ అవార్డు వేడుకల్ని దుబాయ్‌లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నాం. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సీనియర్‌ నటులు శివాజీ రాజాను కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించాలని కోరాం. వారు తమ సహకారం ఉంటుందని భరోసానిచ్చారు’ అని పేర్కొన్నారు.

2023-03-17T23:19:09Z dg43tfdfdgfd