తెలుగు సినిమా స్థాయిని కాపాడుకోవాలి

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ’దాస్‌ కా ధమ్కీ’. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్‌ నాయికగా నటించింది. ఈ నెల 22న ఈ సినిమా విడుదల కానుంది. శుక్రవారం హైదరాబాద్‌ లో చిత్ర ప్రీ రిలీజ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్‌ మాట్లాడుతూ…”ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్‌ గెల్చుకునేందుకు మా చిత్రబృందం ఎంత కారకులో…యావత్‌ దేశ ప్రేక్షకులు, తెలుగు చిత్ర పరిశ్రమ, నా అభిమానులు అంతే కారణం. ఈ అవార్డ్‌ సాధించిన ఘనతలో మాతో పాటు మీరూ భాగమే. చంద్రబోస్‌, కీరవాణి ఆస్కార్‌ వేదికపై అవార్డ్‌ అందుకోవడం చూసిన సందర్భాన్ని మర్చిపోలేను.

విశ్వక్‌ నటించిన ’ఈ నగరానికి ఏమైంది’ సినిమా నా ఫేవరేట్‌ మూవీ. నటుడిగా విశ్వక్‌ సేన్‌ లో ప్రతిభ, దర్శకుడిగా ఆత్మవిశ్వాసం ఆకట్టుకుంటాయి. ’అశోకవనంలో అర్జున కళ్యాణం’, ’హిట్‌’ సినిమాలు విశ్వక్‌ ను కొత్తగా ఆవిష్కరించాయి. ఇవాళ తెలుగు సినిమా ఉన్నత స్థితిలో ఉంది. దీన్ని మనమంతా కాపాడుకోవాలి. మంచి చిత్రాలు చేయాలనే ఉత్సాహం ఉన్న విశ్వక్‌ లాంటి నటులే తెలుగు సినిమాను మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నా’ అన్నారు. హీరో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ…’కొన్ని నెలల క్రితం ఎన్టీఆర్‌ అన్న ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. బయటకు వస్తున్న సమయంలో ధమ్కీ కార్యక్రమానికి మీరు రావాలని అడిగాను. వస్తానని మాటిచ్చాడు. హీరోగా నాకు అవకాశాలు తగ్గిపోవాలని, నేను కిందపడాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. నీకు నేనున్నా అంటూ అండగా నిలబడేందుకు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ అన్న వచ్చారు. ఆస్కార్‌ గెలిచి ఇవాళ దేశం గర్వించేలా చేశారు. ఎన్టీఆర్‌ రాకతో మా సినిమాకు బ్లాక్‌ బస్టర్‌ మొదలైంది. ఇది నా కెరీర్‌ లో మరో ఇన్నింగ్స్‌ ఇచ్చే సినిమా అవుతుంది’ అన్నారు

2023-03-17T23:19:10Z dg43tfdfdgfd