సినిమా తారల వ్యక్తిగత వ్యవహారాలు జనాలకు ఎప్పుడూ ఆసక్తికరమే. ఫిలిం సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి చాలా మంది ఆరా తీస్తుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందాక సినీ తారల వ్యక్తిగత విషయాల గురించి ఆరా తీయడం, చర్చించడం మరీ ఎక్కువైపోయింది. దానికి మరింత ఆజ్యం పోస్తూ.. ఊహాగానాలకు ఊతమిస్తూ ఉంటుంది కొంత మంది సెలబ్రిటీల వ్యవహార శైలి. ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela), ఆమె భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య (Chaitanya JV) వ్యవహార శైలి అలాగే ఉంది.
నిహారిక, చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. మెగా ఫ్యామిలీలో అందరినీ ఫాలో అవుతున్న చైతన్య.. నిహారికను మాత్రం అన్‌ఫాలో చేయడం ఆశ్చర్యకరం. అంతేకాదు, తమ పెళ్లి ఫొటోలను సైతం చైతన్య ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేశారు. నిహారికతో దిగిన ఒక్క ఫొటో కూడా ఇప్పుడు చైతన్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో లేదు. దీంతో నిహారిక, చైతన్య విడాకులు తీసుకోతున్నారనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి.
నిజానికి నిహారిక, చైతన్యలది ప్రేమ వివాహం. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. జంట చూడముచ్చటగా ఉందని అప్పట్లో వీరిపై ప్రశంసల జల్లు కురిసింది. మెగా ఫ్యామిలీలోనే చూడచక్కనైన జంట అని అంతా అన్నారు. చైతన్యను అయితే మెగా అభిమానులు ‘బావ బావ’ అంటూ మోసేశారు. కానీ, ఇప్పుడు ఈ జంట విడిపోతోంది అనే వార్తలు విని వారంతా ఆందోళన చెందుతున్నారు.
వాస్తవానికి వీరికి పెళ్లయిన ఏడాదిన్నరకే విడాకుల రూమర్లు ఊపందుకున్నాయి. కానీ, కిందటేడాది మార్చిలో నిహారికను ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చైతన్య ఒక పోస్ట్ చేశారు. దీంతో వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని.. బాగానే ఉన్నారని ఒక క్లారిటీ వచ్చింది. కానీ, ఇప్పుడు మరోసారి విడాకుల వార్తలు ఊపందుకున్నాయి. నిహారిక గత కొద్ది నెలలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా లేరు. ఆమె చివరిగా గతేడాది డిసెంబర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇక చైతన్య ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక ఫొటోను పోస్ట్ చేశారు. అయితే, ఆ ఫొటోకి ఇప్పుడు చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. బ్రేకప్ అట కదా, విడాకులు తీసుకుంటున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వార్తలపై మెగా డాటర్, అల్లుడు ఎలా స్పందిస్తారో చూడాలి.
2023-03-19T12:29:06Z dg43tfdfdgfd