మిహిర్ షా అరెస్ట్... అతడి తల్లి, ఇద్దరు సిస్టర్లు కూడా..

మిహిర్ షా అరెస్ట్... అతడి తల్లి, ఇద్దరు సిస్టర్లు కూడా..

  • హిట్ అండ్ రన్ కేసులో 12కు చేరిన నిందితుల సంఖ్య

ముంబై: ముంబై  బీఎమ్‌‌డబ్ల్యూ  హిట్ అండ్ రన్ కేసులో కీలకపరిణామం చోటుచేసుకుంది. మూడు రోజులుగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, శివసేన(షిండే) పార్టీ నేత రాజేశ్ షా కొడుకు మిహిర్ షా(24)ను ముంబై పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ముంబైకి 65 కి.మీ దూరంలో ఉన్న విరార్‌‌లోని ఓ అపార్ట్‌‌మెంట్‌‌లో మిహిర్ షాతోపాటు అతని తల్లిని, ఇద్దరు సిస్టర్లను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ నుంచి తప్పించేందుకు మిహిర్ షాను అతని కుటుంబసభ్యులే 72 గంటలుగా దాచిపెట్టినట్లు అధికారులు భావిస్తున్నారు. నిందితుడికి సహాయం చేసినందుకు ముగ్గురు మహిళలను కూడా నిందితులుగా చేర్చాలా వద్దా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మొత్తంగా ఈ కేసులో ఇప్పటిదాకా పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం వారందరిని థానే జిల్లాలోని షాహాపూర్ నుంచి ముంబైకి తరలించారు. 

దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. వర్లీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున మిహిర్ మద్యం మత్తులో తన  బీఎమ్‌‌డబ్ల్యూ కారుతో స్కూటర్ ను ఢీకొట్టాడు. దాంతో స్కూటర్​పై వెళ్తున్న ప్రదీప్, అతని భార్య కావేరీ నఖ్వా(45) కింద పడిపోయారు. ప్రదీప్​కు తీవ్ర గాయాలవగా.. కావేరీ నఖ్వాను కారు1.5 కి.మీ. ఈడ్చుకెళ్లింది. దాంతో ఆమె చనిపోయింది.

అనంతరం డెడ్ బాడీని మిహిర్ కారు కింది నుంచి లాగి రోడ్డుపై వదిలేసి.. తన డ్రైవర్‌‌ రాజ్‌‌రిషి బిదావత్​ను డ్రైవర్ సీటులో కూర్చోబెట్టాడు. మరో వెహికల్​లో ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. డ్రైవర్ బిదావత్ కారును మరోసారి వేగంగా మహిళ డెడ్ బాడీపై నుంచి ఎక్కించి రివర్స్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కావేరీ నఖ్వాను బీఎమ్‌‌డబ్ల్యూ కారు 1.5 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లు సీసీఫుటేజీ ఆధారం దొరికిందని పోలీసులు వెల్లడించారు.

సెకన్ ఆగినా ప్రాణం దక్కేది: ప్రదీప్ 

కళ్లముందే భార్య కావేరీ నఖ్వా మృతి చెందడంతో ప్రదీప్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. " కారు మా స్కూటర్​ను ఢీకొట్టింది. కింద పడిపోయిన నా భార్యను ఈడ్చుకెళ్లింది. నేను ఏడుస్తూ.. అరుస్తూ..అర కిలోమీటరు వరకు కారు వెనుక పరిగెత్తాను. కానీ నా భార్య డెడ్ బాడీ కనిపించలేదు. అతను కారు ఒక్క సెకను ఆపినా.. నా భార్య ప్రాణం దక్కేదేమో" అని ప్రదీప్ పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-07-10T03:15:58Z dg43tfdfdgfd