మంచి నడవడికతో ముందడుగు వేద్దాం

  • రాచకొండ జాయింట్‌ కమిషనర్‌ సత్యనారాయణ
  • పాత నేరస్తులకు కొత్త జీవితం అందించడమే లక్ష్యం
  • ‘మార్పు కోసం ముందడుగు’ పేరిట అవగాహన కార్యక్రమం

జవహర్‌నగర్‌, మార్చి 18 : మనిషిలో దాగిన గొప్ప మనస్సుతోనే సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని, చెడు లక్షణాలను దూరం చేసి మంచి నడవడికతో ముందడుగు వేయాలని రాచకొండ జాయింట్‌ కమిషనర్‌ సత్యనారాయణ అన్నారు. జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దమ్మాయిగూడ సాయిభవానీ ఫంక్షన్‌హాల్‌లో శనివారం డీసీపీ మధుకర్‌స్వామి, అడిషినల్‌ డీసీపీ లక్ష్మి, మల్కాజిగిరి సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు ఆధ్వర్యంలో 9 పోలీస్‌స్టేషన్ల పరిధిలోని నేరస్తులతో ‘మార్పు కోసం ముందడుగు’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నేరస్తులు సన్మార్గంలో నడిస్తేనే జీవితంలో తలెత్తుకుని జీవిస్తారని అన్నారు. దొంగతనం ముద్ర పడిందంటే చెరిగిపోదని… చెడు వ్యసనాలకు గురికావొద్దని… మంచి పనులు చేస్తూ జీవితంలో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. సుమారు 300 మంది పాత నేరస్తులు హాజరయ్యారు. అనంతరం లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ గిరిధర్‌, బండి గణేశ్‌, ఆకెళ్ల రాఘవేంద్ర, ప్రొ.లక్ష్మీకుమారి, రాజ్‌కుమార్‌, రఘునాథ్‌రెడ్డి, లయన్స్‌క్లబ్‌ రీజినల్‌ చైర్‌పర్సన్‌, ఏసీపీ రఘు, ఇన్‌స్పెక్టర్లు సైదులు, వీవీ రెడ్డి, నవీన్‌ రెడ్డి, మల్కాజిగిరి ఎస్‌వోటీ రాములు, ఎస్సైలు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

 

ఆత్మగౌరవంతో జీవించాలి

చాలా మంది ఆర్థిక ఇబ్బందుల కోసం నేరాలు చేసి జైల్లో దుర్భర జీవితం గడుపుతున్నారు. సమాజంలో ఆత్మగౌరవం దక్కెలా జీవనం సాగించాలి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వ గురుకులాల్లో సీట్లు కల్పిస్తాం. 5-10 సంవత్సరాల నుంచి నేర ప్రవృత్తికి పాల్పడకుండా ఉంటే షీట్స్‌ తొలగించేందుకు అధికారులతో మాట్లాడి కృషి చేస్తాం.

డీసీపీ మధుకర్‌స్వామి

మంచి దిశగా అడుగులు వేయాలి

కష్టాన్ని పెట్టుబడిగా మలుచుకుని ముందుకు సాగితే సాధించలేదని ఉండదు. సమాజంలో మంచి చెడులను బేరీజు చేసుకుని మంచి దిశగా అడుగులు వేయాలి. కొన్ని సంఘటనల వల్ల నేరాలకు పాల్పడితే కుటుంబాలు రోడ్డున పడుతాయి. ఆ కన్నీటి గాయాలను తుడవడం ఎవరితరమూ కాదు.

ఆకెళ్ల రాఘవేంద్ర, సివిల్స్‌ శిక్షణ నిపుణుడు

తప్పు తెలుసుకున్నా.. కాలనీ ప్రెసిడెంట్‌నయ్యా..

ఇంట్లో చేసిన చిన్న తప్పుకు తల్లిదండ్రులు మందలించారు. ఊరు నుంచి హైదరాబాద్‌కు వచ్చాను. ఒక స్నేహితుడితో దొంగతనాలకు అలవాటు పడ్డాను. ఓ మర్డర్‌ కేసులో జైలు జీవితం అనుభవించాను. నా భార్య జైలులోనే ప్రసవం అయింది. దీంతో జీవితంలో మరెప్పుడు తప్పుచేయొద్దు అనుకున్నాను. నా తప్పును మన్నించి ఉన్నతాధికారులు కుషాయిగూడలో టీస్టాల్‌ పెట్టించారు. ఇప్పుడు జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లోని ఓ కాలనీకి ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నాను.

మరునేని రాజు, జవహర్‌నగర్‌

మారిపోయా.. గౌరవంగా బతుకుతున్నా..

చెడు వ్యసనాలకు అలవాటు పడి నేరాల బాట పట్టాను. తెలంగాణ ప్రభుత్వం ‘మార్పుతో ముందడుగు’ కార్యక్రమంతో మారిపోయా. ఇప్పుడు డెలివరీ బాయ్‌గా పని చేస్తూ రోజుకు రూ. 1000 సంపాదిస్తున్నాను. కుటుంబం, బంధుమిత్రుల మధ్య గౌరవంతో బతుకుతున్నాను.

– కిరణ్‌, డెలివరీ బాయ్‌, వినాయక్‌నగర్‌

2023-03-18T18:59:56Z dg43tfdfdgfd