రెండు నిండు ప్రాణాలను బలిగొన్న క్షణికావేశం.. వివరాలిలా..

క్షణికావేశం ఓ రెండు నిండు ప్రాణాలను బలిగొంది. వేరువేరుగా జరిగిన ఈ రెండు సంఘటనలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. ఓ సంఘటనలో కన్నతల్లినే ఓ కొడుకు కసాయిగా మారి కడతేర్చితే, మరో సంఘటనలో కన్నకొడుకునే ఓ తండ్రి కడతేర్చాడు. నిత్యం జరిగే కలహాలు ఒకరి ప్రాణాలను తీస్తే, ఆస్తి పంపకం విషయంలో తలెత్తిన వివాదం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. ఒకే రోజు చోటుచేసుకున్న ఈ రెండు సంఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం లక్ష్మీనగర్ తాందకు చెందిన లావుడ్యా ఇంద్రాబాయి, తారాచంద్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. కానీ ఇద్దరు కూతుళ్లు మాత్రం తల్లిదండ్రులతో ఉంటున్నారు. అయితే తరుచూ ఏదో ఒక విషయంలో గొడవపడుతూ ఉండే వారు. రాత్రి మళ్ళీ గొడవపడగా గమనించిన స్థానికులు నచ్చజెప్పడంతో మిన్నకుండిపోయారు. మరుసటిరోజు మళ్లీ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన చిన్న కుమారుడు రాయబాబు కొడవలితో తల్లిపై దాడి చేశాడు.

దీంతో తీవ్రంగా గాయపడిన ఇంద్రాబాయి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. ఈ విషయం తెలిసిన పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు ప్రారంభించారు. భైంసా అదనపు ఎస్పీ అవినాష్ కుమార్ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ముథోల్ సిఐ మల్లేష్ దర్యాప్తు చేపట్టారు. కాగా ప్రమాదవశాత్తు కొడవలిపై పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనలో దోషుని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని సీఐ మల్లేష్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కన్న కొడుకునే కన్న తండ్రి కడతేర్చిన సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… ఆకెనపెల్లికి చెందిన దేవ మారాలుకు ఇద్దరు కుమారులు. గ్రామంలో వారికున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయంతోపాటు కూలి పనులు చేస్తూ ఉండేవారు.

అయితే పెద్ద కుమారు వినోద్ ఆస్తి పంపకాల విషయమై గత నెలరోజుల నుండి తండ్రితో తరుచూ గొడవపడుతున్నారు. ఈ క్రమంలో మరోసారి తండ్రితో వాగ్వివాదానికి దిగాడు. తరుచూ తనతో గొడవ పడుతున్న కొడుకును క్షణికావేశానికిలోనై పారతో తనయుడిపై విచక్షణా రహితంగా దాడికిపాల్పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తాళ్లగురిజాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

2024-07-10T09:28:50Z dg43tfdfdgfd