హవాలా సొమ్ము మార్పిడి..

  • ఇద్దరు వ్యక్తులు అరెస్ట్‌
  • రూ.17 లక్షలు , 2 సెల్‌ఫోన్లు స్వాధీనం

కాచిగూడ,మార్చి 18: హవాలా సొమ్మును మార్పిడి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ రామలక్ష్మణరాజు కథనం ప్రకారం…. రాజస్తాన్‌కు చెందిన ఓంప్రకాశ్‌ కటారి కుమారుడు హరినారాయణ కటారి(33) వృత్తిరీత్యా వ్యాపారం చేసుకుంటూ బడిచోడిలో నివాసముంటున్నాడు. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరికి చెందిన సూత్రధారుడు వినయ్‌ అనే వ్యక్తి శుక్రవారం హరినారాయణ కటారితో ఫోన్‌లో మాట్లాడి హవాలా డబ్బును షోయల్‌ అలియాస్‌ మాలిక్‌ అనే వ్యక్తితో రూ.17 లక్షలు పంపిస్తున్నానని చెప్పాడు.

కాచిగూడలోని ఆర్టీసీ క్వార్టర్స్‌లో హరినారాయణ కటారి, షోయల్‌ మధ్య రూ.17 లక్షల హవాలా సొమ్ము మార్పిడి జరుగుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై జి.సురేశ్‌కుమార్‌ దాడి చేసి అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి పోలీసులు రూ.17 లక్షలతో పాటు 2సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హవాలా సొమ్మును కోర్టుకు అప్పగించినట్లు కాచిగూడ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.అసలు సూత్రధారుడు వినయ్‌ పరారిలో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.

2023-03-18T19:44:57Z dg43tfdfdgfd