మరాఠీ, హిందీ మీడియం స్టూడెంట్లకు తప్పని తిప్పలు

మరాఠీ, హిందీ మీడియం స్టూడెంట్లకు తప్పని తిప్పలు

  • స్టూడెంట్లే క్వశ్చన్లు రాసుకొని, ఆన్సర్లు రాయాల్సిన దుస్థితి 
  • గతేడాది విమర్శలు వచ్చినా.. తీరు మార్చుకోని ఇంటర్ బోర్డు

హైదరాబాద్, వెలుగు: ఎన్ని విమర్శలు వచ్చినా తెలంగాణ ఇంటర్ బోర్డు తీరు మారడం లేదు. పోయినేడాది మరాఠీ, హిందీ తదితర మీడియంలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లను ప్రింట్ చేయకపోవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో వచ్చే ఏడాది నుంచి ఈ తప్పు జరగకుండా చూస్తామని అధికారులు అప్పట్లో ప్రకటించారు. కానీ, ఈ ఏడాది మళ్లీ పాత విధానాన్నే అమలు చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో క్వశ్చన్లను కూడా రాసుకోవాల్సిన దుస్థితి ఆయా మీడియం స్టూడెంట్లకు నెలకొన్నది. రాష్ట్రంలో ఈ నెల15 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంట్లో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూతో పాటు హిందీ, మరాఠీ, కన్నడ మీడియం స్టూడెంట్లు ఉన్నారు. తక్కువ మంది పరీక్షలు రాస్తున్నారనే కారణంతో కొన్నేండ్ల నుంచి మరాఠీ, కన్నడ, హిందీ మీడియం క్వశ్చన్ పేపర్లను ప్రింట్ చేయట్లేదు. దీంతో ఆయా మీడియాల్లో చదివే దాదాపు 300 మంది స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మరాఠీ మీడియం ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని ఆదిలాబాద్ జూనియర్ కాలేజీతో పాటు బేలా, భైంసా కాలేజీల్లో ఉండగా, హిందీ మీడియం హైదరాబాద్​ సిటీలోని హిందీ మహా విద్యాలయతో పాటు మరో కాలేజీలో స్టూడెంట్లున్నారు. కన్నడ మీడియం నగరంలోని ఓ కాలేజీలో కొనసాగుతోంది. 

పరీక్షకు 15 నిమిషాల ముందే హాజరు కావాలె..

బోర్డు అధికారుల నిర్లక్ష్యంతో ప్రశ్నలకు జవాబులు రాయాల్సిన స్టూడెంట్లు.. క్వశ్చన్లు, ఆన్సర్లు రాసుకోవాల్సి వస్తోంది. ఉదయం 9 గంటలకు ప్రారంభయ్యే ఎగ్జామ్​కు15 నిమిషాల ముందు హిందీ, మరాఠీ, కన్నడ మీడియం స్టూడెంట్లకు ఇంగ్లిష్ నుంచి ఆయా లాంగ్వేజీల్లోకి క్వశ్చన్ పేపర్​ ట్రాన్స్ లేట్ చేస్తారు. దీన్ని స్టూడెంట్లు రాసుకొని, పరీక్షలు రాయాలి. ట్రాన్స్​లేషన్​కు ఎక్కువ సమయం పడితే.. చివర్లో ఆ మేరకు అవకాశం ఇస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. చేతిరాతతో రాసుకున్న ప్రశ్నపత్రం అర్థం కాదన్న భావనతో ఇంగ్లిష్ మీడియం క్వశ్చన్ పేపర్ కూడా ఇస్తున్నట్టు పేర్కొంటున్నారు. అయితే, ఇంటికి మాత్రం ఇంగ్లిష్  మీడియం క్వశ్చన్ పేపర్​నే ఇస్తున్నారు. చేతిరాత పేపర్ బయటకు వస్తే, బోర్డు పరువు పోతుందని ఇలా చేస్తున్నారని పేరెంట్స్ చెప్తున్నారు. ఇతర మీడియం స్టూడెంట్ల మాదిరిగానే తామూ ఫీజు కడుతున్నామని, తమకెందుకు ప్రింట్ చేసిన క్వశ్చన్ పేపర్ ఇవ్వడం లేదని స్టూడెంట్లు ప్రశ్నిస్తున్నారు. పోయినేడాది ఈ విషయం మీడియాలో రావడంతో, అప్పటి ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ వచ్చే ఏడాది క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేయిస్తామని చెప్పారు. కానీ, ఆయన రిటైర్ కావడంతో ఆ విషయమే అధికారులు మరిచిపోయారు.

వచ్చే ఏడాది నుంచి ప్రింట్ చేయిస్తం 

మైనర్ మీడియం క్వశ్చన్ పేపర్లు ప్రింట్ చేయని మాట వాస్తవం. తక్కువ మంది ఉండడంతో ఇది జరిగింది. వచ్చే ఏడాది నుంచి క్వశ్చన్ పేపర్లు ప్రింట్ చేసి స్టూడెంట్లకు అందిస్తాం. 

- జయప్రదబాయి, ఇంటర్ బోర్డు సీవోఈ

©️ VIL Media Pvt Ltd.

2023-03-23T02:16:00Z dg43tfdfdgfd