‘నా భార్యను దోమలు కుడుతున్నాయి.. రక్షించాడు’ అంటూ యువకుడు ఫిర్యాదు.. పోలీసులు ఏంచేశారంటే?

ఆస్పత్రిలో ప్రసవానికి చేరిన తన భార్యను దోమలు కుడుతున్నాయని, వాటి బారి నుంచి రక్షించాలని కోరుతూ ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ట్విట్టర్‌లో అతడు చేసిన విన్నపానికి పోలీసులు సానుకూలంగా స్పందించి, వెంటనే మస్కిటో కిల్లర్‌ను తెచ్చి ఇచ్చారు. విచిత్రమైన ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..చందౌసీలోని రాజ్ మొహల్లాకు చెందిన అసద్‌ఖాన్ అనే యువకుడి భార్య గర్భవతి కావడంతో ఆమెకు గత ఆదివారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ప్రసవం కోసం ఆమెను ఓ ప్రయివేట్ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. అక్కడ ఆమె ఓ ఆడబిడ్డను ప్రసవించింది. అయితే, ఆస్పత్రి పరిసరాలు అశుభ్రంగా ఉండటంతో దోమలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.

అసద్ భార్య, నవజాత శిశువుపై దాడిచేసి తీవ్రంగా కుట్టాయి. దీంతో ఆ చిన్నారి గుక్కపట్టి ఏడవడం ప్రారంభించింది. భార్య, కుమార్తె బాధను చూసి తట్టుకోలేకపోయిన అసద్‌ఖాన్ మస్కిట్ కిల్లర్ కోసం పరుగులు తీశాడు. అర్ధరాత్రి కావడం వల్ల దుకాణాలన్నీ మూసేయడం వల్ల మస్కిటో కిల్లర్ లభించలేదు. ఏం చేయాలో తెలియక చివరకు యూపీ పోలీసులకు ట్విట్టర్‌లో విన్నపం చేశాడు. ‘చందౌసీలోని హరిప్రకాశ్ నర్సింగ్ హోమ్‌లో నా భార్య బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ నొప్పులతో విలవిలలాడుతుండగా పెద్ద సంఖ్యలో దోమలు కుట్టి నా భార్య, కూతురు ఇబ్బంది పడుతున్నారు.. దయచేసి మార్కిట్ కాయిల్ తక్షణమే కావాలి’ అంటూ డయల్ 112 ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేయడంతో పోలీసులు మానవతా దృక్పథంతో స్పందించారు.

ప్రధాన కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు సూచనలతో నిమిషాల్లోనే ఆసుపత్రికి వచ్చి మరీ అసద్‌ఖాన్‌కు మస్కిటో కిల్లర్‌ను పోలీసులు అందజేశారు. తన ట్వీట్‌కు సానుకూలంగా స్పందించి, మస్కిటో కిల్లర్ అందజేసిన పోలీసులకు అసద్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.‘‘మాఫియా నుంచి మస్కిటో వరకు దేన్నైనా ఎదుర్కొంటాం’’ అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దోమలు దండయాత్ర చేయడంతో తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో మస్కిటో కిల్లర్ కోసం పరుగెత్తాను.. అప్పటికే దుకాణాలు మూసి ఉండటంతో ఈ సమయంలో పోలీసులను తప్ప మరెవరి సహాయం కోసం నేను ఆలోచించలేకపోయానని అసద్ వ్యాఖ్యానించారు.

Read More Latest National News And Telugu News

2023-03-23T05:00:34Z dg43tfdfdgfd