ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై కుక్కల దాడి

ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై కుక్కల దాడి

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. తాజాగా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 45వ డివిజన్ లో ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కేశవ రెడ్డి కమిటీ హల్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. బాలుడి అరుపులకు ఇంట్లో నుంచి తల్లిదండ్రులు పరుగెత్తుకుంటూ బయటకు వచ్చారు. అప్పటికే వీధి కుక్కలు బాలుడిని పీక్కుతినడానికి ప్రయత్నించడంతో స్థానికులు గమనించి..వాటిని తరిమికొట్టడంతో పారిపోయాయి. కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడిని కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. 

కొంతకాలంగా గ్రేటర్ హైదరాబాద్ లో వీధి కుక్కలు  మనుషులు కనిపిస్తే వెంట పడి కరిచేస్తు్న్నాయి. పిల్లలు,పెద్దలు అని తేడా లేదు. రాత్రి, పగలు అని తేడా లేదు. బయట మనిషి కనిపిస్తే చాలు కరిచిపడేస్తున్నాయి. కుక్కలు పగబట్టినట్లే ప్రవర్తిస్తున్నాయి.  స్కూల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లే చిన్నారులు మొదలుకుని మహిళలు, వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు.  ఒంటరిగా కనిపిస్తే చాలు గుంపులుగా వెంటపడి కురుస్తున్నాయి. 

వీధుల వెంబడి గుంపులు గుంపులుగా తిరుగుతూ దడ పుట్టిస్తున్నాయి. రాత్రి సమయాల్లో వాహనదారులను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిత్యం జిల్లాలో ఏదో ఒకచోట జనాలు కుక్క కాటుకు గురవుతున్నారు. గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​కు రోజూ పదుల సంఖ్యలో కుక్క కాటు బాధితులు వస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ ఈ బాధితులు కనిపిస్తున్నారు. రోజురోజుకు వీధి కుక్కల బెడద తీవ్ర రూపం దాల్చుతోంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదు.

©️ VIL Media Pvt Ltd.

2023-03-23T03:46:06Z dg43tfdfdgfd