FITCOP | బిర్యానీకి బై బై.. మిల్లెట్‌ ఫుడ్‌కే జై.. బందోబస్తు సిబ్బందికి చిరుధాన్యాల ఆహారం

FitCop | సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : బందోబస్తు విధులలో నిత్యం బిజీగా ఉండే పోలీస్‌ సిబ్బందికి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంతోషమైన జీవనం సాగిస్తామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సిబ్బందిలో అవగాహన తెస్తున్నారు. వ్యాయామం, పౌష్టికాహారంపై దృష్టి పెట్టాలని సిబ్బందితోపాటు వారి కుటుంబసభ్యులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగానే బందోబస్తులో ఉండే సిబ్బందికి చిరుధాన్యాలతో కూడిన భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో బందోబస్తులో ఉండేవారికి ఎక్కువగా బిర్యానీలు, అన్నం, టిఫిన్లు ఏర్పాటు చేసేవారు. ఈ ఆహారం కంటే చిరుధాన్యాల ఆహారంతో ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండడమే కాకుండా, విధి నిర్వహణలో చురుకుగా ఉంటారని భావిస్తూ వారికి చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. గతంలో కంటే ఖర్చు 20 శాతం పెరుగుతున్నా, సిబ్బంది ఆరోగ్యమే ప్రధానమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా బందోబస్తు విధులు నిర్వహించిన నగర పోలీస్‌ కమిషనరేట్‌లోని సిబ్బందికి చిరుధాన్యాలతో కూడిన భోజనాలను సరఫరా చేశారు.

ఫిట్‌ కాప్‌తో

నగరంలో ఉన్న పోలీస్‌ సిబ్బందిని ఆరోగ్యంగా ఉంచాలనే లక్ష్యంగా ‘ఫిట్‌కాప్‌’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. అందరి హెల్త్‌ ప్రొఫైల్‌ను భద్రపరుస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, తన సతీమణి లలితా ఆనంద్‌తో కలిసి ఈ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌ ప్రారంభానికి పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. పోలీస్‌ సిబ్బంది విధుల గూర్చి అవగాహన ఉండి, పోలీస్‌ సిబ్బంది ఆరోగ్యం బాగుండడంలో వారి కుటుంబ సభ్యులు కూడా కీలక భూమిక పోషించాలని సీపీ సూచనలు చేశారు. ఒక పక్క వ్యాయామం చేస్తూ.. మరో పక్క పౌష్టికాహారం తినాలని, అందుకు కుటుంబసభ్యుల పూర్తి సహాయ సహాకారాలు ఉండాలన్నారు. ఇందులో భాగంగా సిబ్బంది కూడా చిరుధాన్యాలపై దృష్టి పెట్టి, రోజూ తినే ఆహారంలో వాటిని భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. దీంతో పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా ఖర్చుకు వెనుకాడకుండా ఆరోగ్యంపై దృష్టి పెట్టి చిరుధాన్యాలను మధ్యాహ్నం భోజనాలలో అందిస్తున్నారు. నగర పోలీస్‌ కమిషనరేట్‌ సిబ్బంది ఆరోగ్యం అలవాట్లలో ఫిట్‌కాప్‌తో పెనుమార్పు వచ్చింది. అనారోగ్యానికి గురై దవాఖానలలో ఖర్చు పెట్టడం కంటే, కొద్ది ఖర్చు ఎక్కువైనా చిరుధాన్యాలతో మెరుగైన ఆరోగ్యం ఉంటుందని సిబ్బంది భావిస్తున్నారు.

ఆర్యోగమే వారికి శ్రీరామ రక్ష

మనిషికి ఆరోగ్యమే శ్రీరామ రక్ష. పోలీస్‌ సిబ్బందికి ఇదే విషయాన్ని చెబుతున్నాం. సిబ్బంది కుటుంబసభ్యులకు కూడా అవగాహన కల్పిస్తున్నాం. పౌష్టికాహారం, వ్యాయామం తప్పనిసరి చేయడంలో సూచనలు చేస్తున్నాం. సిబ్బందికి బందోబస్తు సమయంలో చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నాం. చిరుధాన్యాల ఆహారంతో త్వరగా అకలి కాదు. ఎక్కువసేపు చురుకుగా ఉంటారు. నేను స్వయంగా మూడు సంవత్సరాల నుంచి చిరుధాన్యాల ఆహారం తింటూ ఆరోగ్యంగా ఉన్నాను. నగర సిబ్బంది కూడా ఆరోగ్యంగా ఉండేందుకు నిరంతరం ప్రోత్సహిస్తున్నాం.

సీవీ ఆనంద్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌

2023-03-18T19:14:56Z dg43tfdfdgfd