Ke Huy Quan | ఆస్కార్ బహుమతి ప్రదాన కార్యక్రమం. విజేతల పేర్లు ప్రకటిస్తున్నారు. అవార్డు అందుకున్నవారు స్పందన తెలుపుతున్నారు. అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. కానీ, ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్న కే హుయ్ మాటలు మాత్రం శ్రోతల గుండెల్ని తడిమాయి. ‘ఓ శరణార్థి శిబిరంలో బతికిన నేను ఆస్కార్ వరకూ రావడం అంటే కలను నిజం చేసుకోవడమే. ఇలాంటివి సినిమాల్లోనే జరుగుతాయి అనుకుంటారు. కానీ నిజ జీవితంలోనూ సాధ్యమే’ అన్నాడు కే హుయ్. మనసులో బలంగా సంకల్పిస్తే సాధ్యం కానిది లేదని ఆ మాటలు నిరూపిస్తాయి. విజయ కాంక్షను రగిలిస్తాయి.
ఐదు దశాబ్దాల క్రితం.. వియత్నాంలో పుట్టాడు కే హుయ్. మొత్తం ఎనిమిదిమంది పిల్లలు. అంతంతమాత్రం ఆదాయం. భారం భారంగా బండిలాగిస్తున్న ఆ కుటుంబంపై యుద్ధమనే పిడుగు పడింది. భవిష్యత్తు ప్రమాదకరంగా మారింది. దాంతో దేశం విడిచి వెళ్లాలనుకుంది ఆ కుటుంబం. కానీ అంతమంది ఒకేచోట తలదాచుకోవడం అంత తేలిక కాదని అర్థమైంది. మనసు రాయి చేసుకుని తలోదారి పట్టారు. చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు.
విడిపోక తప్పని పరిస్థితి. తండ్రి అయిదుగురు పిల్లలతో హాంకాంగ్ బయల్దేరాడు. మిగిలిన ముగ్గురు పిల్లలతో తల్లి మలేషియా ప్రయాణమైంది. తండ్రి వెంట హాంకాంగ్ వెళ్లిన హుయ్, అక్కడ ఏడాదిపాటు శరణార్థుల శిబిరంలో తలదాచుకున్నాడు. దాడులకు భయపడుతూ కాలం గడిపాడు. ఇంతలో శరణార్థుల కోసం అమెరికా తలుపులు తెరుచుకున్నాయి.ఆ కుటుంబమంతా అమెరికా చేరుకుంది. అక్కడే కలుసుకుంది.
హుయ్ కాలిఫోర్నియాలో పెరిగాడు. అక్కడే హాలీవుడ్ ఆకట్టుకుంది. అందులో అవకాశం వస్తే దర్జాగా బతకొచ్చు కదా అనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ఇండియానా జోన్స్ సినిమాలో ఓ చిన్నపాత్ర దక్కింది. కానీ అదేమీ తన కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. 13 ఏండ్లపాటు ప్రాధాన్యంలేని పాత్రలే వచ్చాయి. దాంతో నటనకు ఫుల్ స్టాప్ పెట్టి, ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాడు. కెమెరా వెనక నిలబడి మరో కెరీర్ కోసం ప్రయత్నించాడు. అప్పుడు కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా నిరాశపడలేదు.
ఇరవై ఏండ్లపాటు స్టంట్ కొరియో గ్రాఫర్‌గా చేశాడు తను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. రకరకాల పనులు చేశాడు. కానీ ఎక్కడా స్థిరపడలేదు. ‘ఈ 20 సంవత్సరాలు నా కెరీర్ ఎంత దారుణంగా ఉన్నా, కొనసాగిస్తూనే వచ్చానంటే, అందుకు ముఖ్య కారణం నా భార్యే! నాకంటూ ఓ సమయం వస్తుందని ధైర్యం చెప్పింది. నాలో నిరాశ పెరగకుండా చూసుకుంది’ అంటాడు హుయ్. చివరికి ఆ రోజు రానే వచ్చింది. ‘క్రేజీ రిచ్ ఏషియన్స్’ సినిమాలో హుయ్‌కి మంచి పాత్ర దక్కింది. ఆ వెంటనే ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’లో మరో అవకాశం వచ్చింది. ఆ పాత్రను హుయ్ చేయగలడో లేదో తెలుసుకునేందుకు చాలా పరీక్షలే పెట్టింది చిత్ర బృందం. వాళ్ల నమ్మకం వమ్ము కాలేదు. సినిమాకే ప్రాణంగా నిలిచాడు. ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. 38 ఏండ్ల తర్వాత ఉత్తమ సహాయ నటుడి పాత్రకు ఆస్కార్ స్వీకరించిన ఆసియన్‌గా రికార్డు సృష్టించాడు.
‘కలలే మన ఆయువు. మన కలల్ని మనం నమ్మాల్సిందే. మీ లక్ష్యం గురించి కల కనండి. ఎట్టి పరిస్థితిలోనూ దాన్ని బతికించుకోండి’ అంటూ తన ఆస్కార్ ఉపన్యాసం ముగించాడు కే హుయ్. మనలో ఎప్పుడు నిరాశ కలిగినా.. ఒకసారి కే హుయ్ మాటల్నీ, ఆ మాటల వెనుక ఉన్న అతని ప్రయాణాన్నీ గుర్తుచేసుకోవాలి.
2023-03-19T05:04:45Z dg43tfdfdgfd