SRISAILAM | యాగ‌శాల ప్ర‌వేశంతో శ్రీ‌శైల ఉగాది మహోత్సవాలు ప్రారంభం!

Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. ఆదివారం ఉదయం ఈవో ఎస్‌ లవన్న దంపతులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చక వేదపండితులతో కలిసి స్వామివారి యాగశాల ప్రవేశం చేయ‌డంతో ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాలు ప్రారంభమైనట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. స్థానాచార్యులు లోక కళ్యాణం కోసం శివసంకల్పాన్ని పఠించిన వేదపండితులు అతివృష్టి అనావృష్టి నివారించబడి పంటలు బాగా పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఋత్వికులు శివసంకల్పాన్ని పఠించారు. గణపతిపూజ అఖండ దీపరాదన, కళశస్థాపన, వేదస్వస్థి, రుత్విగ్వరణం, పుణ్యహ్వచనం, చండీశ్వర పూజ, రుద్రపారాయణం, రుద్ర కళశస్థాపన, కంకణపూజ, కంకణధారణ చేశారు. అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరణార్చన, చండీహోమాలను నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత ప్రదేశంలోని మట్టిని తీసుకుని 9 పాలికలలో వేసి నవధాన్యాలను అంకురారోపింజేసే క్రతువును ఘనంగా చేశారు.

ఆది దంపతుల వైభవం

సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్పమూర్తులను భృంగివాహనంపై అధిష్టింపజేసి విశేష పూజలు నిర్వహించారు. భృంగివాహానాధీశులైన స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం వలన పనులలో ఏకాగ్రత లభించి, సర్వపాపాలు హరించబడుతాయని పురాణాలు చెబుతున్నాయి.

అలంకారంలో భ్రామరీ అమ్మవారు

కన్నడిగుల ఇలవేల్పు, ఇంటి ఆడపడుచు శ్రీభ్రమరాంబ అమ్మవారికి మహాలక్ష్మి అవతారంలో విశేష పూజలు నిర్వహించారు. చతుర్బుజాలు కలిగిన ఈదేవి పై రెండు చేతుల్లో పద్మాలు, కుడివైపు అభయ హస్తం, ఎడమవైపు వరముద్రతో భక్తాధులకు దర్శనమిచ్చింది. ఈ అమ్మవారిని దర్శించడం వలన శత్రుభాధలు నివారించబడి సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. వాహన పూజల అనంతరం స్వామిఅమ్మవార్ల‌ను ఆలయ ప్రధాన రాజగోపురం ద్వారా గంగాధర మండపం మీదుగా నంది మండపం నుండి బయలు వీరభధ్రస్వామి వరకు గ్రామోత్సవం కన్నుల పండవ‌గా సాగింది.

గ్రామోత్సవంలో కోలాటం, జానపద పగటి వేషాలు, బుట్టబొమ్మలు, గొరువ నృత్యం, తప్పెట చిందు, కర్ణాటక జాంజ్‌, కొమ్మువాయిద్యం, జానపదడోలు, నందికోలుసేవ, కంచుడోలు విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఈవో లవన్నతో పాటు ఈఈ రామకృష్ణ, చీఫ్‌ సెక్యురిటీ ఆఫీసర్‌ అయ్యన్న, పీఆర్‌వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్‌కుమార్‌, ఏఈఓలు హరిదాస్‌, ఫణిధర్‌ ప్రసాద్‌, డీఈ నర్సింహరెడ్డి, సూపరింటెండెంట్‌ రవి కుమార్‌, వెంకటేష్‌, మధుసూదన్‌ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

శ్రీశైలంలో త్రయోదశి పూజలు

శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఆదివారం ప్రదోషకాలంలో త్రయోదశి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా చేశామ‌ని ఈవో లవన్న తెలిపారు. లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రదోషకాల సమయంలో నందిమండపంలోని శనగల బసవన్నకు పంచామృతాభిషేకాలు జరిపించి నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించి తీర్థప్రసాదాలు ఇచ్చారు.

బ్రహ్మోత్సల్లో కన్నడ సాంస్కృతిక కార్యక్రమాలు

శ్రీశైల మహాక్షేత్రంలోఉగాది ఉత్సవాల సందర్బంగా భక్తులను అలరించేందుకు కన్నడ భాషలో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఆలయ దక్షిణమాడవీధిలోని నిత్యకళారాధన వేదిక, పుష్కరిణి వద్ద శ్రీశైల జగద్గురు సేవాసమితి ట్రస్ట్‌ వారిచే ప్రవచనం, భక్తసంగీత విభావరి, భజనలు, సంప్రదాయ నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

2023-03-19T15:50:27Z dg43tfdfdgfd