VIRAL NEWS | తెల్లారితే పెళ్లి.. రాత్రంతా నడిచి వధువు గ్రామానికి చేరిన వరుడు..!

భువనేశ్వర్‌: పెళ్లంటే.. సందళ్లు, పందిళ్లు, తప్పెట్లు, తాళాలేగాక విందులు, వినోదాలు, హంగులు, ఆర్భాటాలు, ఊరేగింపులు ఇలా ఎన్నో ఉంటాయి. పెళ్లి కొడుకును లగ్గం మీదికి తీసుకొచ్చేందుకు అత్తగారింటి నుంచి ఒకరోజు ముందే కొందరు మనుషులను, వాహనాన్ని పంపిస్తారు. ఆ వాహనంలో పెళ్లి కొడుకు దర్జాగా అత్తగారి గ్రామానికి చేరుకుని, అక్కడి నుంచి పెళ్లి వేదికపైకి వెళ్తాడు. కానీ ఒడిశాలో ఓ పెళ్లి కొడుకుకు మాత్రం ఆ మురిపెం లేకుండా పోయింది. పైగా తెల్లారితే పెళ్లి పెట్టుకుని పెళ్లికొడుకు రాత్రంతా నడవాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. రాయగడ జిల్లా కళ్యాణ్‌సింగ్‌పూర్‌ బ్లాక్‌ పరిధిలోని సునఖండి పంచాయతీకి చెందిన వరుడికి, దిబలపాడు గ్రామానికి చెందిన వధువుకు మధ్య వివాహం కుదిరింది. శుక్రవారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లు స్ట్రైక్‌కు దిగడంతో పెళ్లికొడుకు కోసం వాహనం పంపడం కుదరలేదు. అటు పెళ్లి కొడుకే వాహనం మాట్లాడుకుని వద్దామన్నా వీలు కాలేదు. దాంతో చేసేది లేక పెళ్లి కొడుకు, ఆయన కుటుంబసభ్యులు కాలినడకన పెళ్లి కూతురు గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది.

పెళ్లి కొడుకు గ్రామానికి, పెళ్లి కూతురు గ్రామానికి మధ్య 28 కిలోమీటర్ల దూరం ఉండటంతో.. పెళ్లి కొడుకు, తన బంధుగణం గురువారం రాత్రే బయలుదేరారు. రాత్రంతా నడిచి శుక్రవారం ఉదయానికి పెళ్లి కుమార్తె గ్రామానికి చేరుకున్నారు. దాంతో ఇవాళ ఉదయం అనుకున్న ముహూర్తానికే వారి వివాహం జరిగింది. కానీ డ్రైవర్లు సమ్మె విరమిస్తారేమోనన్న ఆశతో పెళ్లికొడుకు, ఆయన బంధువులు ఇంకా పెళ్లి కుమార్తె ఇంట్లోనే వేచి చూస్తున్నారు. లేదంటే మళ్లీ అందరూ కాళ్లకు పని చెప్పాల్సిందే పాపం..

2023-03-17T15:41:41Z dg43tfdfdgfd