ఎన్టీఆర్ కుమారుడిగా జన్మించడం అదృష్టంగా భావిస్తున్నా : బాలకృష్ణ

ఎన్టీఆర్ కుమారుడిగా జన్మించడం  అదృష్టంగా భావిస్తున్నా  : బాలకృష్ణ  

ఎన్టీఆర్ కుమారుడిగా జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నానని  సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు. ఎన్టీఆర్ శత జయంతిని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారని చెప్పారు.   ఎన్టీఆర్ సినిమాలోనే కాకుండా, రాజకీయ రంగంలోను అగ్రగామిగా వెలుగొందారని బాలకృష్ణ  తెలిపారు.  జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్  కీలక పాత్ర పోషించారని చెప్పారు. 

 తెలుగు వారి రుణం తీర్చుకునేందుకు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని బాలకృష్ణ తెలిపారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్న బాలయ్య ..   ఆనాడు ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం  నేడు ఆహార భద్రతగా మారిందని తెలిపారు. మహిళలకు ఆస్థిలో సమాన హక్కును కల్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. కేంద్ర,రాష్ట్ర సంబంధాల కోసం సర్కారియా కమీషన్ ను ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని బాలకృష్ణ  వెల్లడించారు.  

ఎన్టీఆర్ తన పదవిని ప్రజా సేవకు ఉపయోగించారు : దగ్గుబాటి పురంధేశ్వరి 

ఎన్టీఆర్ తన పదవిని ప్రజా సేవకు ఉపయోగించారని మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.  ఎన్టీఆర్ కు సమాజం పట్ల ఉన్న సేవాభావమే మహానాయకుడిగా ఎదిగే విధంగా చేసిందని చెప్పారు.   ఎన్టీఆర్ పాలనా దక్షతను నేటి తరం,రేపటి తరం నాయకులు చూసి నేర్చుకోవాలన్నారు.  ఎన్టీఆర్ పట్ల ప్రజలకు ఆదరణ తగ్గలేదని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయన్నారు.  

ఎన్టీఆర్ పుట్టిన గడ్డ మీద పుట్టే అవకాశం నాకు రావడం గర్వకారణం : రాజేంద్రప్రసాద్ 

ఎన్టీఆర్ పుట్టిన గడ్డ మీద పుట్టే అవకాశం తనకు రావడం గర్వకారణమని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు.  ఎన్టీఆర్ సాధారణ వ్యక్తి కాదన్నారు.  ఎన్టీఆర్ నటుడిగా,రాజకీయ నాయకుడిగా ప్రపంచానికి తన సత్తా చాటారని కొనియాడారు.   రాజకీయాల్లో ఎన్టీఆర్ మార్క్ ను ఎవరు చెరిపివేయలేరన్నారు.  తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ను ప్రజలు గుర్తు ఉంచుకుంటారని తెలిపారు.   ఎన్టీఆర్ తనకు గురువు,దైవంతో సమానమని వెల్లడించారు.  ఎన్టీఆర్ కుల,మతాలకు అతీతంగా పనిచేశారని, సమాజాన్ని ఆయన  దేవాలయంగా చూశారన్నారు.  

ఎన్టీఆర్ ను మించిన హీరో ఎవరు లేరన్న రాజేంద్రప్రసాద్ ..  రాబోయే తరాలకు ఎన్టీఆర్ సందేశాన్ని తీసుకువెళ్లాలని సూచించారు. 

  ©️ VIL Media Pvt Ltd.

2023-05-28T04:15:04Z dg43tfdfdgfd