తెలుగు రాముడికి నూరేండ్లు

నేడు ఎన్టీఆర్‌ శత జయంతి

రాముడూ ఆయనే! రావణుడూ ఆయనే!.. కృష్ణుడూ అతనే! దుర్యోధనుడూ అతనే!!ఆ నటసార్వభౌముడు వేషం కడితే.. పాత్రలకు కొత్త ఆవేశం వస్తుంది. సరికొత్త ఆహార్యాన్ని సంతరించుకుంటాయి. విశేష హావభావాలు ప్రకటిస్తాయి. వెరసి దశాబ్దాలు గడిచినా ఆయన ధరించిన పాత్రలు కండ్లముందు కదలాడుతుంటాయి.ఆయన పలికిన సంభాషణలు చెవుల్లో మార్మోగుతుంటాయి. వెండితెర వేల్పుగా, తెలుగువారి కృష్ణుడిగా ఎల్లలులేని కీర్తిగడించిన మహనీయుడు నందమూరి తారకరామారావు. పురాణ పురుషుడిగా ఆయన ఖ్యాతి అఖండం.ఇక జానపదాలు, చారిత్రకాలు, సాంఘికాలు.. ఇలా జానర్‌ ఏదైనా ఆయన నటనకు సలామ్‌లు చేయాల్సిందే! ఆ మహానటుడి శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ నటనా వైదుష్యాన్ని గుర్తు చేసుకుందాం..

‘రామచంద్రా.. అదిగో మీ వంశగర్భ సూర్యభగవానుడు.. నమస్కారం చేయమ’ని చెబుతాడు బ్రహ్మర్షి వశిష్ఠుడు. కెమెరా రాముడి పాత్ర మీద ఫోకస్‌ అవుతుంది. అచ్చంగా శ్రీరాముడే ప్రత్యక్షమయ్యాడేమో అనిపిస్తుంది. అక్కడ ఉన్నది ఎవరు మరి? ఎన్టీఆర్‌! ‘లవకుశ’లో సీతావియోగ బాధను ఆయన ప్రదర్శించిన తీరు అద్భుతం.

ప్రియదర్శిని పేటికలో శకుని మామ పాచికలకు రమ్మని హెచ్చరిస్తుంటే.. ముసిముసి నవ్వులు రువ్వుతూ ‘ఊరికే కనిపించరు కదా అన్నయ్యా! మహానుభావులు’ అంటూ శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్‌ పలికించిన హావభావాలను చూసి అసలు కృష్ణుడు కూడా ముచ్చటపడ్డాడేమో!

‘నరుల వల్లా.. వానరుల వల్లా.. దానవులకెన్నడూ ప్రమాదం లేదు స్వామీ! అసురుల పెంపు సహించలేని యక్ష.. కిన్నెర.. కింపురుష..’ అని రావణ పాత్రలోని ఎన్టీఆర్‌ చెబుతూపోతుంటే.. అసలు లంకేశ్వరుడు కూడా తనకన్నా దర్పం ప్రదర్శిస్తున్న తీరును చూసి ఈర్ష్యపడి ఉండొచ్చు!!

‘ఆచార్య దేవా! ఏమంటివి.. ఏమంటివి.. జాతి నెపమున సూతసుతునకిందు నిలువ అర్హత లేదందువా.. ఎంత మాట? ఎంత మాట?’ దుర్యోధనుడిగా ఎన్టీఆర్‌ ఈ మాటలు అంటుంటే అసలు సుయోధనుడు ఈ నటుడెవరో తనకన్నా మానధనుడు అని భావించి ఉంటాడు!!

ఒకటేమిటీ.. ఆయన పట్టిన ప్రతి పాత్రా బంగారమే! పలికిన ప్రతి మాటా ఆణిముత్యమే!! ‘సాహసం శాయరా డింభక.. రాకుమారి నీ వశమవుతుందిరా!’ అని నేపాల మాంత్రికుడు పిలిస్తే.. ‘ప్రేమ కోసం వలలో పడిన’ తోట రాముడి అమాయకత్వం ఎన్టీఆర్‌ కండ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. ‘షావుకారు’లో ‘ఏమననే చిన్నారి ఏమననే.. వన్నెల సిగపువ్వా కనుసన్నలలో భావమేమి..’ అని ఘంటసాల మాస్టారు నేపథ్యంగా ఆలపించిన గీతానికి యంగ్‌ ఎన్టీఆర్‌ లీలగా చూపించిన విలాస భావాలు ఎంత కులాసాగా ఉంటాయో ఎలా మర్చిపోగలం. ‘నీకు తెలియదోయ్‌.. మన ఐడియా పారింది.. ఆడాళ్ల సంగతి మనకు బాగా తెలుసు! వాళ్లు ఔనంటే కాదు.. కాదంటే ఔను!!’ మిస్సమ్మలో ఎమ్టీ రావుగా రామారావు చెప్పిన డైలాగ్‌ ఆడవాళ్ల మాటలకు అర్థాలనే మార్చేశాయి. ‘గుండమ్మ కథ’లో గంటన్నను ఈ ఆజానుబాహుడు ఎత్తి పడేసిన తీరు గుర్తుందిగా! పాత్ర ఏదైనా ఆయన ఒప్పుకొనే వరకే. ఒక్కసారి ఓకే చెప్పిన తర్వాత అందులోకి పరకాయ ప్రవేశం చేసేస్తారు. షూటింగ్‌ గ్యాప్‌లో డజన్ల కొద్దీ మిర్చీలు లాగేసినట్టుగా.. యాక్షన్‌ అనగానే సీన్‌ను మొత్తం తన అధీనంలోకి తెచ్చేసుకుంటాడు. సీన్‌లో మరెవరు ఉన్నా కనిపిస్తే ఒట్టు! ‘పాండవ వనవాసం’లో భీమసేనుడిగా ‘కురువృద్ధుల్‌ గురువృద్ధ బాంధవుల్‌..’ అని గద ఎత్తి ఊగిపోతున్న ఎన్టీఆర్‌ను చూసి ప్రేక్షకులు కూడా పూనకం వచ్చినట్టు ఊగిపోయారు.

‘చిరంజీవులు’లో ‘కనుపాప కరవైన కనులెందుకు..’ అని అంధుడిగా ఆయన నటన చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘గుడిగంటలు’ చిత్రంలో చక్రాల కుర్చీలో కూర్చుని కండ్లను చక్రాల్లా తిప్పుతూ, మానసికంగా క్షోభిస్తూ, ఎదుటి వారిని క్షోభపెడుతూ సతమతమయ్యే పాత్రను ఎంత అవలీలగా పోషించారో మాటల్లో వర్ణించలేం! ఆయన నట జీవితంలో 300కు పైగా చిత్రాలు. మొదటి చిత్రం పక్కన పెడితే అన్నిట్లో ఆయనే హీరో! బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజుల్లో స్క్రీన్‌ మీద వెండికొండలా కనిపించేవాడు. కలర్‌ సినిమాలు వచ్చాక పసిమి వన్నెలో మిసమిసలాడేవాడు! ముఖంలో వర్చస్సు, కోటేరు ముక్కు, నవ్వులొలికే పెదాలు, గంభీరమైన మాటలు ఇవి మాత్రమే కాదు.. ఆయన వీపులో ఎడమవైపు ఉన్న పుట్టమచ్చ కూడా ప్రత్యేకమే! ముఖ్యంగా పౌరాణికాల్లో ఎన్టీఆర్‌ ఎప్పుడెప్పుడు వెనక్కి తిరుగుతాడా.. ఆ పుట్టుమచ్చ ఇంకెప్పడు కంట పడుతుందా అని ఎదుచూసే వాళ్లు ప్రేక్షకులు. పైగా, అక్కడ పుట్టుమచ్చ ఉండటం వల్లే ఎన్టీఆర్‌కు అదృష్టం పట్టుకుందని కథలు కథలుగా చెప్పుకొనేవారు. కానీ, అసలు అదృష్టమంతా మనది, మన తెలుగువాళ్లది. ఆరడుగుల అందం మన దగ్గర పుట్టడం, ఆయనకు నటనపై ఆసక్తి కలగడం, సినిమాల్లోకి రావడం, పౌరాణిక పాత్రలు ధరించడం, చారిత్రక కథాంశాలు ఎంచుకోవడం, మరపురాని చిత్రాల్లో నటించడం ముమ్మాటికీ మన అదృష్టం! విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా తరతరాలుగా జేజేలు అందుకుంటున్న నందమూరి తారకరామారావు.. అభిమానులకు మాత్రం ఎప్పటికీ ఎన్టీవోడే! ఆయన పోషించిన ప్రతి పాత్రా ఈనాటి నటులకు ఓ పాఠ్యాంశమే.

‘మళ్లీ ఎప్పుడు పుడతారు ఎన్టీఆర్‌!’

2023-05-27T21:26:44Z dg43tfdfdgfd