లేట్ ఫాదర్‌హుడ్: 83 ఏళ్ల వయస్సులో తండ్రి అవుతున్న నటుడు...మగాళ్లు పిల్లల్ని కనేందుకు సరైన వయసేది?

ప్రముఖ హాలీవుడ్ నటుడు అల్ పాసినో 83 ఏళ్ల వయస్సులో తండ్రి కాబోతున్నట్లు ఆయన ప్రతినిధులు ఇటీవలే ప్రకటించారు. 29 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్ నూర్ అల్ఫాల్లాతో అల్ పాసినో బిడ్డను కననున్నట్లు వారు వెల్లడించారు.

దీనికంటే ముందు, గత నెలలో పాసినో సహచరుడు, 79 ఏళ్ల ఆల్బర్ట్ డి నీరో కూడా తాను ఏడోసారి తండ్రిని కాబోతున్నట్లు ధ్రువీకరించారు.

దీంతో ‘‘లేట్ ఫాదర్‌హుడ్’’ క్లబ్‌లోకి ఆల్బర్ట్‌తో పాటు పాసినో కూడా చేరారు.

ఈ ప్రపంచంలో లేటు వయస్సులో తండ్రిగా మారుతున్న వ్యక్తులు కచ్చితంగా వీరిద్దరూ మాత్రమే కాదు. ఇంకా చాలా మంది ఇలాంటి అనుభవాన్ని పొందారు. ఆలస్యంగా తండ్రుల అయిన వారిలో ఇతర నటులు, మ్యూజీషియన్లు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అమెరికా అధ్యక్షులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాలి. అదేంటంటే, కొత్తగా తండ్రులయ్యే వారి సగటు వయస్సు ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్లుగా పెరుగుతోంది.

20 ఏళ్ల క్రితం కొత్తగా తండ్రి అయ్యే పురుషుల సగటు వయస్సు 26 కాగా, ఇప్పుడు అది 29కి చేరింది.

1972-2015 మధ్య ఈ సగటు వయస్సు 3.5 ఏళ్లు పెరిగింది. అమెరికాలో తండ్రుల సగటు వయస్సు 30.9 సంవత్సరాలుగా ఉంది. తమకు బిడ్డ పుట్టినప్పుడు 9 శాతం తండ్రుల వయస్సు కనీసం 40 ఏళ్లుగా ఉంది.

అతిపెద్ద వయస్సులో తండ్రి అయిన వ్యక్తి ఎవరు?

గిన్నిస్ వరల్డ్ రికార్డుల ప్రకారం, ఇప్పటివరకు 92 ఏళ్ల వ్యక్తి అతిపెద్ద వయస్సులో తండ్రి అయిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.

అయితే, అంతకంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తి కూడా తండ్రి అయినట్లు అనధికారిక ప్రకటనలు వచ్చాయి.

అయితే, ఇలా పెద్ద వయస్సులో తండ్రి కావడంలో ప్రమాదాలు ఉంటాయి.

2022 డిసెంబర్‌లో ఉటా యూనివర్సిటీతో పాటు ఇతర ఇన్‌స్టిట్యూట్లకు చెందిన పరిశోధకులు... ‘‘అడ్వాన్స్‌డ్ పేరంటల్ ఏజ్’’ పేరిట గర్భధారణపై దాని ప్రభావాలు, ప్రెగ్నెన్సీ, చిన్నారుల ఆరోగ్యంలో వచ్చే సమస్యలపై ఒక సమగ్ర సమీక్షను ప్రచురించారు.

అయితే, చాలా అధ్యయనాలు తమ అధ్యయనంలో ఫాసినో వయస్సున్న చాలా మంది పురుషులను భాగం చేయలేదు. నలభైల్లో లేదా యాభైలలో ఉన్న పురుషుల స్పెర్మ్ పరిమాణం, సంఖ్య, చలనశీలత, ఉత్పరివర్తనాల నాణ్యత తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే పాసినో వయస్సున్న వారిని తమ అధ్యయనంలో వారు భాగం చేయలేదు.

పెద్ద వయస్సులో పిల్లల్ని కంటే వచ్చే సమస్యలు ఏంటి?

పెద్ద వయస్సులో పిల్లల్ని కనాలనే ఆలోచనలో ఉంటే అది చాలా ఇబ్బందులకు దారి తీస్తుందని పురుషులను వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కొందరిలో సంతానలేమికి దారి తీయొచ్చు. కొందరిలో గర్భం దాల్చాక గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఒక వ్యక్తి లేటు వయస్సులో తండ్రి అయ్యేందుకు ప్రయత్నించినప్పుడు, ఆయన భాగస్వామికి గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలు తెలిపాయి.

ఒకవేళ అంతా సవ్యంగా జరిగి బిడ్డ పుట్టినప్పటికీ, ఆ శిశువు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

1950ల తర్వాత జరిగిన అనేక పరిశోధనలు, పెద్ద వయస్సు తండ్రి వల్ల జన్మించిన శిశువుల్లో అకోండ్రోప్లాసియా అనే జన్యు సంబంధిత వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్లు చూపించాయి. ఇదే కాకుండా ఇతర దుష్ఫలితాలు కూడా వారికి కలిగొచ్చు.

‘‘వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలు పిల్లల్ని కంటే వచ్చే సమస్యలన్నీ, వృద్ధాప్యంలోని పురుషుల వల్ల కూడా కలుగుతాయి. ఈ ప్రభావం కచ్చితంగా పిల్లలపై ఉంటుంది’’ అని ఉటా యూనివర్సిటీ పరిశోధన చెబుతోంది.

వృద్ధాప్యంలో ఉన్న పురుషుల ద్వారా జన్మించిన పిల్లలు చాలా తక్కువ బరువుతో పుట్టినట్లు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. ఇలా జన్మించిన పిల్లలకు మూర్చ వంటి సమస్యలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

అంతేకాకుండా ఇలాంటి పిల్లలకు చిన్న వయస్సులోనే గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితులు పిల్లల్ని ప్రభావితం చేస్తాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నప్పటికీ, ఎందుకు ఇలా జరుగుతుందనే దానిపై స్పష్టత లేదు. తల్లిదండ్రుల జీవన శైలి, పర్యావరణం కూడా వారిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.

‘‘వృద్ధాప్య పురుషుల వల్ల కలిగే పిల్లల్లో జన్యువులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అవి తర్వాతి తరానికి సంక్రమించవచ్చు’’ అని కూడా పరిశోధకులు చెబుతున్నారు.

సంతానం లేకపోతే సాధారణంగా మన సమాజంలో మహిళలపై ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కానీ, ఇటీవలి సంవత్సరాల్లో సంతానలేమికి పురుషులు కూడా కారణం అవుతున్నారు. ఇందులో వారి వయస్సు కూడా ఒక ముఖ్యమైన సమస్యగా ఉంది.

పిల్లలను కనేందుకు సరైన వయస్సు ఏది?

అల్ పాసినో, ఆల్బర్ట్ తరహాలో 80 ఏళ్ల వయస్సులో పిల్లల్ని కనడం సులభం కాదని సెక్సాలజిస్ట్ కామరాజ్ అన్నారు.

‘’70, 80ల వయస్సులోనే కాదు పురుషులు 90 ఏళ్ల వయస్సులో కూడా పిల్లల్ని కనవచ్చు. ఇలాంటి వార్తలు మనం చూస్తుంటాం. 80 ఏళ్ల తర్వాత పిల్లల్ని కన్న ప్రపంచ నాయకులు కూడా ఉన్నారు.

సాధారణంగా పురుషులకు 26 ఏళ్ల వయస్సు నాటికి వీర్య కణాల సంఖ్య గరిష్టంగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి కొద్ది కొద్దిగా ఈ సంఖ్య తగ్గిపోవడం మొదలవుతుంది. 40, 50 ఏళ్ల తర్వాత మరింత ఎక్కువగా ఈ కణాలు తగ్గిపోతాయి. అయితే, ఇది పెద్ద విషయం కాదు. 100 ఏళ్ల వయస్సులో కూడా పిల్లల్ని కన్న పురుషులు ఉన్నారు.

కానీ, వృద్ధాప్యంలో పిల్లలు పుట్టినప్పుడు వారికి మానసిక, శారీరక వైకల్యాలు వచ్చే అవకాశం 30-40 శాతం ఉంటుంది. స్పెర్మ్‌లోని జన్యువులు వయస్సు కారణంగా ప్రభావితం అవుతాయి. అందుకే 45 ఏళ్ల కంటే ముందుగా పిల్లల్ని కనడం చాలా ఉత్తమం’’ అని కామరాజ్ వివరించారు.

కొంతమందికి పెద్ద వయస్సులో పిల్లల్ని కనాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. అలాంటివారు గర్భం దాల్చినప్పటి నుంచి తరచుగా బిడ్డ ఆరోగ్యాన్ని నిర్ధారించేందుకు క్రమం తప్పకుండా వైద్యున్ని సంప్రదించాలని కామరాజ్ సూచించారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2023-06-08T02:36:08Z dg43tfdfdgfd