స్వామివారి శేషవస్త్రం ధరించి కౌగిలి, చుంబనం దారుణం: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్

తిరుమల కొండపై ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం వంటి వికారమైన చేష్టలు చేయడం అత్యంత దారుణమని హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ అన్నారు. నిన్న తిరుమల శ్రీవారి ఆలయం బయట మహాద్వారం వద్ద ‘ఆదిపురుష్’ (Adipurush) హీరోయిన్ కృతి సనన్‌కు ఆ చిత్ర దర్శకుడు ముద్దు ఇవ్వడం, కౌగిలించుకోవడంపై రంగరాజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తిరుమల కొండపై నియమ నిబంధనలను ఎవ్వరైనా పాటించాల్సిందేనని ఆయన అన్నారు.

ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు. చిత్ర ప్రచారంలో భాగంగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఇక బుధవారం ఉదయం కృతి సనన్, ఓం రౌత్, ఇతర చిత్ర బృంద సభ్యులు తిరుమల వెళ్లి శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. దర్శనానంతరం కృతి సనన్ కారు ఎక్కడానికి వెళ్తూ దర్శకుడు ఓం రౌత్ వద్దకు వెళ్లారు. ఆమెకు సెండాఫ్ ఇస్తూ అలవాటులో పొరపాటుగా బుగ్గపై ఒక ముద్దు ఇచ్చారు. ఆ తరవాత ఆలింగనం చేసుకున్నారు. అయితే, ఆలయ ప్రాంగణంలో ఇలా చేయడంపై హిందూవాదులు మండిపడుతున్నారు.

ఇప్పటికే కృతి సనన్, ఓం రౌత్‌పై ఏపీ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కూడా స్పందించారు. ఓం రౌత్, కృతి సనన్ చర్యను తప్పుబట్టారు. స్వామివారి శేష వస్త్రాన్ని ధరించి కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం తన మనసుకు ఆందోళన కలిగించిందని రంగరాజన్ అన్నారు. తిరుమల కొండపైన ఇలాంటి వికారమైన చేష్టలు చేయకూడదని ఆయన సూచించారు. ఇది శాస్త్ర సమ్మతం కాదని.. తిరుమల కొండపైన కొన్ని నియమాలు పాటించాలని అన్నారు. భార్యాభర్తలు కలిసి వచ్చినా, వారు కళ్యాణోత్సవంలో పాల్గొన్నా ఆలోచనా విధానంలో వారు జాగ్రత్త పడతారని, వికారమైన ఆలోచనలు రాకుండా ఉండేలా చూసుకుంటారని ఆయన తెలిపారు. అలాంటి ప్రదేశంలో బహిరంగంగా కౌగిలించుకోవడం, చుంబనం చేసుకోవడం చాలా దారుణమని విమర్శించారు.

ఇదిలా ఉంటే, ‘ఆదిపురుష్’ సినిమా టీజర్ విడులైనప్పటి నుంచీ వివాదాస్పదమైంది. ఇప్పటి వరకు రామాయణంలో పాత్రలను చూసిన ప్రేక్షకులు.. ఈ సినిమాలోని పాత్రలను స్వీకరించలేకపోయారు. ముఖ్యంగా ఆంజనేయుడు, రావణాసురుడి పాత్రల చిత్రీకరణ హిందూవాదులకు ఆగ్రహం తెప్పించింది. సినిమాలో వీఎఫ్ఎక్స్ కూడా చవకబారుగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీంతో ఈ సినిమాను విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే, ఇటీవల విడుదలైన ట్రైలర్ పాత ఆలోచనలను పటాపంచలు చేసింది. సినిమాపై అంచనాలను పెంచింది. ఈ క్రమంలో తిరుమలలో కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన మరోసారి ఈ సినిమా వివాదంలో చిక్కుకునేలా చేసింది.

2023-06-08T02:49:19Z dg43tfdfdgfd