GRUHALAKSHMI TODAY మే 27 ఎపిసోడ్: ‘మీకు తోడుగా నేనున్నానండీ’.. నందుతో లైన్ కలిపేసిన తులసి.. ‘మళ్లీ పెళ్లి’?

Intinti Gruhalakshmi May 27 Today Episode: అసలు తులసి, నందు, లాస్య.. ఈ ముగ్గురి మధ్య ట్రై యాంగిల్ లవ్ స్టోరీ రోజుకో మలుపు తిరుగుతుంది. లాస్యని ఎలాగూ బయటకు గెంటేశారుకాబట్టి.. ఇప్పుడు తులసి, నందులను దగ్గర చేసేలా కథనం సాగుతుంది. కొంపతీసి ఈ ఇద్దరూ మళ్లీ పెళ్లి పీటలు ఎక్కించేస్తారా? అనేట్టుగా నడిచింది నేటి ఎపిసోడ్. 

యాక్సిడెంట్ డ్రామాతో రాజ్యలక్ష్మి రక్తికట్టిస్తే.. గడుసరి కోడలు దివ్య తిప్పికొట్టింది. ఇక కోర్టులో లాస్య దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ.. నందుని తన వైపు తిప్పుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేసింది. అయితే నందు మాత్రం చావనైనా చస్తాను కానీ.. ఆ లాస్యతో మాత్రం కాపురం చేసేది లేదని తెగేసి చెప్తున్నాడు. ఇక ఈరోజు (మే 27) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. తులసి అండ్ కో బ్యాచ్ అంతా మీట్ అవుతారు. ‘న్యాయం మనవైపు ఉండి కూడా.. ఏమీ చేయలేకపోతున్నాం.. అన్యాయం వైపు ఉండి లాస్య మనల్ని ఆడిస్తుంది.. ఒప్పు చేసే వాళ్లకంటే తప్పు చేసేవాళ్లు చాలా అలర్ట్‌గా ఉంటారు.. మనం సాక్ష్యాలుగా ఎవర్ని తీసుకుని వెళ్తున్నామో వాళ్ల గురించి చాలా రహస్యంగా ఉంచాం.. కానీ లాస్యకి ఎలా తెలిసింది..? వాళ్లపై ఛీటింగ్ కేసు ఉన్నదని? జడ్జీ ముందే రుజువు చేసింది. ఆ విషయం నాకు కూడా తెలియదు. తెలిస్తే ఇంతవరకూ రానిచ్చేవాడిని కాదు’ అని బాధపడతాడు లాయర్ తమ్ముడు మోహన్. ఆ మాటతో తులసి.. ‘అంటే లాస్యకి మన ప్రతి అడుగు తెలిసిపోతుందని అంటారా?’ అని అడుగుతుంది. అంతేకదా మరి.. అని అంటాడు మోహన్.

ఆ సాక్ష్యం కోర్టులో ఎందుకు చూపించలేదు..

ఆ మాటతో తులసి.. ‘ఈ కేసులో ఓడిపోతే తనకి జీవితం లేదని లాస్యకి బాగా తెలుసు.. అందుకే ఇంతలా పోరాడుతుంది.. తన చావు తెలివి మొత్తం ఉపయోగిస్తుంది’ అని అంటుంది. అవును అక్కాయ్.. లేకపోతే కేఫ్‌లో బావగారు తనని కొట్టిన వీడియోను పక్కాగా రికార్డ్ చేసిందిగా’ అని అంటాడు. చేసింది సరే.. దాన్ని కోర్టులో ఎందుకు చూపించలేదు.. అని అంటాడు పరంధామయ్య. ఎందుకంటే.. కోర్టు బయటే కేసుని సెటిల్ చేసుకోవాలని ట్రై చేస్తుంది.. అది జరగని పని లాస్యకి తెలియదు. మీరంతా ఓడిపోయే యుద్ధం చేస్తున్నారు. అనవసరంగా నన్ను సేవ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అది జరగని పని’ అని అంటాడు నందు.

ఏ.. మీరు మారలేదా? లాస్య ఎందుకు మారదు??

ఆ మాటతో అనసూయ.. ‘నీకు ఆశలేకపోవచ్చురా.. చూస్తూ చూస్తూ జైలుకి పంపలేము కదా’ అని అంటుంది. ఇక తులసి అయితే.. ‘నేను ఇప్పటికీ నమ్ముతున్నానండీ.. లాస్య రెచ్చగొట్టి నష్టపోయే కంటే.. మనం లాస్య దారిలోకి వెళ్లి.. ఆ తరువాత లాస్యని దెబ్బకొట్టాలి.. ఇదే మంచిదనిపిస్తుంది’ అని అంటుంది తులసి. ‘ఇన్నాళ్లూ మారనిది ఇప్పుడు మారుతుందా?’ అని నందు అంటే.. ‘ఏ మీరు మారలేదా? తప్పులు తెలుసుకోలేదా? లాస్య విషయంలో అలా ఎందుకు జరగకూడదు’ అని అంటుంది తులసి.

లాస్యతో నందుకి పోలికా..?? స్సి.. స్సి

ఆ మాటతో నందు.. అంటే లాస్య నేనూ ఒక్కటేనా? ఇద్దర్నీ ఒకే కట్టెకి కట్టేస్తున్నావా? అని అంటాడు. ఇతనేదో సుద్దపూస అన్నట్టుగా. నిజమే లాస్యతో నందుకి పోలిక ఏంటిలే. లాస్య మొదటి నుంచి నందు కావాలంటే కావాలి అని అన్నట్టుగానే ఉంది. ఎన్ని తప్పుడు పనులు చేసి అయినా నందునే జీవితం అనుకుంది.. అతని కోసం అన్నీ వదిలేసి వచ్చేసింది. కానీ నందు అలా కాదు కదా.. కాసేపు తులసి అంటాడు.. కాసేపు లాస్య అంటాడు. కాసేపు కుటుంబం అంటాడు.. ఇంకాసేపు ఎవరూ వద్దని రంకెలేస్తాడు. ఇలాంటి జిత్తులమారి నక్కతో లాస్యను పోల్చడం తప్పే సుమీ. అందుకే తులసి నందుకి గట్టిగానే గడ్డిపెడుతుంది.

‘నా కోసం కాదు.. అత్తమామల కోసం.. మీకు తోడుగా ఉంటాను’.. మళ్లీ అదే డైలాగ్

లాస్య పరాయిది కాదు.. మీరు తాళి కట్టిన భార్య.. రాత్రి మీరు నన్ను కూడా లాస్యతో పోల్చారు.. ఇద్దరూ ఒకేలాంటి మొండివాళ్లు అన్నారు.. దానికి నేనేం ఫీల్ కాలేదు.. మీరు నాకు శత్రువు కాదు.. మీకు నష్టం జరగకూడదని ప్రయత్నం చేస్తున్నాను.. అది కూడా నా కోసం కాదు.. అత్తయ్య మామయ్యల కోసం.. మీ కష్టంలో తోడు ఉంటాను’ అని అంటుంది తులసి. అదేదో సినిమాలో ‘పెళ్లి కొడుకు వీడేనండీ.. కానీ వాడు వేసుకున్న బట్టలు మాత్రం నావే’ అని అన్నట్టుగా.. నందుకోసం చేయాల్సిందంతా చేస్తుంది. చివర్లో మాత్రం.. ‘అత్తయ్య మామయ్యల కోసమే.. నాకోసం కాదు’ అని రొటీన్ డైలాగ్ కొడుతూనే ఉంది తులసి.

వీడో దరిద్రుడు నాన్నా.. నీఛుడ్ని నాన్నా.. కరస్టే నందూ!!

ఇక మన ఆవేశం స్టార్.. తాను ఎంత దరిద్రుడో.. నీఛుడో.. తనని తానే తిట్టుకుంటాడు. నందు తన ఫొటో ముందుకు వెళ్లి నిలబడి.. తనని తానే ఛీ కొట్టుకుంటాడు. కాఫీ కప్పు తీసి ఫొటోకేసి కొడతాడు. ఇంతలో తులసి, పరంధామయ్య, అనసూయలు వస్తారు. ‘రేయ్ నందూ.. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? అని అంటాడు పరంధామయ్య. ‘అవును నాన్నా.. అవును... పిచ్చి ఎక్కింది.. ఇన్ని సంవత్సరాలుగా నేను మీ పట్ల చేసిన తప్పులు గుర్తొస్తుంటే నిజంగానే పిచ్చి ఎక్కుతుంది.. ఎలా భరించారు నాన్నా.. ఎందుకు భరించారు నాన్నా.. అప్పుడే నన్ను మెడపట్టి గెంటేయాల్సింది.. మీరు ఇచ్చిన అలుసు వల్లే వీడు ఇలా తయారయ్యాడు (నందు ఫొటో చూస్తూ). వీడో నీఛుడు నాన్నా.. దరిద్రుడు నాన్నా.. తన ఫొటోని తానే కొట్టేస్తూ పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తాడు నందు.

అమ్మనాన్నల భారం నీదే తులసీ..

వీడికి ప్రేమాభిమానాలు తెలియవు.. బంధాల విలువ తెలియదు.. వీడో బండరాయి నాన్నా.. నేను ద్రోహినని చేతిపై పచ్చబొట్టు పొడిపించుకుంటా.. ఎవరైనా జీవితంలో ఒకేసారి మరణిస్తాను.. నేను తప్పుచేసిన ప్రతిసారి చచ్చినట్టే లెక్క. ఈ కొడుకు మీకు ఉన్నా లేనట్టే.. మీ బరువు మోయాల్సిన టైంలో భారంగా ఉన్నాను.. జరగబోయేది ఏంటో నాకు తెలుసు అమ్మా.. జైలుకి వెళ్తున్నందుకు నాకు బాధలేదు.. మీ సంగతి తలుచుకుంటే బాధగా ఉంది. తులసి నా మీద ఉన్న కోపాన్ని చంపుకుని.. నాకు అండగా నిలబడింది. కారణం ఏంటో నేను అడగను కూడా.. నేను ఎలాగూ జైలుకిపోతాను. అమ్మ నాన్నల భారం నీదే తులసీ.. ఓ చేతకాని కొడుకుగా నిన్ను అడుగుతున్నా.. నా జీవితం ముగిసిపోయింది.. జీవితాంతం ఆ లాస్యతో యుద్దం తప్పదు. ఈ నందుగాడిపై ఆశ వదిలేయడం.. వీడొక పనికిమాలిన వాడు’ అంటూ పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తాడు నందు.

అది కేవలం నువ్వే చేయగలవ్ తులసీ..

దీంతో అనసూయ, పరంధామయ్యలు.. బోరు బోరున ఏడుస్తూ.. ‘చూశావా తులసీ.. వాడు మా చేయి జారిపోయినట్టే.. వాడికి ధైర్యం చెప్పడం.. కష్టాలను తట్టుకుని నిలబడేట్టు చేయడం.. కేవలం నీ చేతుల్లోనే ఉందమ్మా.. అని అంటారు. దీంతో తులసి.. కాఫీ పట్టుకుని రంగంలోకి దిగుతుంది. కూల్ అయ్యారా? ఆవేశం తగ్గిందా? తప్పు చేశానని బాధపడుతున్నారా? అని అడుగుతుంది తులసి. ఆ మాటతో నందు.. ‘నేను జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు.. నిన్ను దూరం చేసుకోవడమే’.. పులిహోర కలపడం స్టార్ట్ చేస్తాడు. ‘విలువ తెలుసుకోలేని వాళ్లకే విలువైన వస్తువులు బంధాలను ఇస్తాడు దేవుడు.. వాటిని దాచుకోవాలని అనుకునేలోపే జరగాల్సింది జరిగిపోతుంది’ అని అంటాడు నందు.

మీ ఆవిడ లేదు కదా.. అందుకే నేను! ‘సరిపోయారు ఇద్దరికిద్దరూ’

ఇక తులసి.. కాఫీ తీసుకోండి.. చల్లారిపోతుంది అని అంటుంది. ‘నువ్వు నాకోసం కాఫీ తీసుకుని రావడం ఏంటి? అని నందు అడిగితే.. ‘మీ ఆవిడ లేదు కదా.. అందుకే తీసుకొచ్చా’ అని అంటుంది తులసి. ‘హో నిన్ను ఇబ్బంది పెడుతున్నానా? అని నందు అంటే.. ‘పాతికేళ్ల క్రితం మీరు ఇలా ఆలోచించి ఉంటే.. మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు.. అహంకారంతో అప్పుడు అలా చేశారు.. ఇప్పుడు అది చేతకాని తనంగా మారింది. అందుకే కదా.. మీ ఫొటోని మీరే పాడుచేసుకుంటున్నారు అంటూ ప్రవచనం స్టార్ట్ చేసేస్తుంది తులసి. ఆ ప్రవచనం మన వల్ల కాదయ్యో.. సాగ్గొట్టి చావదొబ్బుడే అనేట్టుగా ఉంటాయి తులసి మాటలు.

నువ్ నాతో ఉండటం కంటే సంతోషం ఏముంటుంది తులసీ.. వార్నీ!!

మనం మన సంతోషాన్ని మాత్రమే మన వాళ్లకి పంచాలి.. బాధను గుండెల్లోనే దాచుకోవాలి.. ముందు అది తెలుసుకోండి. జీవితానికి ముగింపు చావు మాత్రమే.. ఎదురుదెబ్బలు.. వెన్నుపోట్లు.. మోసాలు తాత్కాలికం. వీటిని ఎదుర్కొని నిలబడగలితేనే జీవితం.. అని హితబోధ చేస్తుంది. సర్లే స్నానం చేసి రెడీ అవ్వండి కేఫ్‌కి వెళ్దాం అని అంటుంది తులసి. ఆ మాటతో నందు.. ముఖం తెగ వెలిగిపోతూ.. నవ్వు కూడా కేఫ్‌కి వస్తావా? అని అంటాడు. ‘ఏ రావొద్దా’? అని తులసి అంటుంది. నువ్వు రావడం కంటే నాకు సంతోషం ఏముంటుంది తులసీ.. థాంక్స్ అని అంటాడు నందగోపాలుడు. థాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు.. ఈ నిర్ణయం అత్తయ్య మాయ్యలది అని అంటుంది. మళ్లీ సేమ్ డైలాగ్.. ‘ఇది నాకోసం కాదు.. అత్తయ్య మామయ్యల కోసం ’అని అంటుంది తులసి. మొత్తానికి ఈ మాజీ మొగుడు పెళ్లాలు యవ్వారం మాత్రం బుర్రపాడు అనేట్టుగానే సాగింది నేటి ఎపిసోడ్‌లో.

2023-05-27T03:54:57Z dg43tfdfdgfd