RAJAMOULI | రాజమౌళి సర్‌.. బయోపిక్‌ పేరును మేడ్‌ ఇన్‌ భారత్‌గా మార్చండి.. జక్కన్నకు ఫ్యాన్స్‌ సలహా

Rajamouli | టాలీవుడ్‌ దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli ).. మరో భారీ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్న విషయం తెలిసిందే. భారతీయ సినిమా రంగంపై వస్తున్న బయోపిక్‌ను ఆయన సమర్పించనున్నారు. ఇండియన్‌ సినిమా (Indian cinema) ఎక్కడ పుట్టింది, దానికి మూలం ఏంటి అనే కథతో ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ (Made in India) పేరుతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు అనౌన్స్‌మెంట్‌ వీడియోను విడుదల చేశారు.

అయితే, ఈ బయోపిక్‌ పేరును మార్చండి అంటూ రాజమౌళికి ఫ్యాన్స్‌ సలహా ఇస్తున్నారు. ఇండియా పేరు మార్పుపై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దేశం పేరును ‘ఇండియా’కు బదులు ‘భారత్‌’ గా మారుస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బయోపిక్‌ పేరును ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’కు బదులుగా ‘మేడ్‌ ఇన్‌ భారత్‌’ (Made in Bharat)గా మార్చండి అంటూ ట్వీట్స్‌ చేస్తున్నారు. ‘రాజమౌళి సర్‌.. బయోపిక్‌ పేరును ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ కాకుండా ‘మేడ్‌ ఇన్‌ భారత్‌’గా మార్చండి’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

కాగా, ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’కు నితిన్‌ కక్కర్‌ (Nitin Kakkar) దర్శకత్వం వహించనున్నారు. ఎస్‌ఎస్‌ కార్తికేయ, వరుణ్‌ గుప్తా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన చిత్రం రాజమౌళి సమర్పణలో రానుంది. ఈ మేరకు రాజమౌళి మంగళవారం ఓ ట్వీట్‌ చేశారు. ‘మొదట ఈ కథ గురించి విన్నప్పుడు నేను చాలా భావోద్వేగాయానికి గురయ్యాను. బయోపిక్‌లను రూపొందించడం చాలా కష్టం. అలాంటిది భారతీయ సినిమాపై బయోపిక్‌ అంటే అది సవాళ్లతో కూడుకున్నది. ఇలాంటి సినిమాను సమర్పిస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు.

ఇండియా పేరు మార్పు వివాదం..

ఇండియా పేరును (renaming India) భారత్‌గా మారుస్తారన్న ప్రచారం గతకొన్ని రోజులుగా జరుగుతోంది. ఈ అంశం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు (G20 Summit) సందర్భంగా ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’ (President of India)కు బదులుగా ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ (President of Bharat) అని ఉండటంతో ఈ అంశం కాస్తా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రప‌తి భ‌వ‌న్ నుంచి జీ20 ప్రతినిధుల‌కు అధికారిక స‌మాచారంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్ అని రాసిఉండ‌టం పేరు మార్పు ప్రతిపాద‌న‌కు బ‌లం చేకూరుస్తోంది. అదేవిధంగా ఇటీవలే ముగిసిన జీ20 సదస్సులోనూ ప్రధాని మోదీ కూర్చున్న కుర్చీ ముందు టేబుల్‌పై దేశం నేమ్‌ ప్లేట్‌పై ఇండియాకు బదులు భారత్‌ అని కనిపించింది.

మరోవైపు సెప్టెంబర్ 18వ తేదీన ప్రారంభమైన పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో న‌రేంద్ర మోదీ స‌ర్కార్ ‘ఇండియా’ పేరును మార్చే ప్రతిపాద‌న‌ను స‌భ్యుల ముందుంచ‌నుంద‌ని ప్రచారం కూడా నడుస్తోంది. రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా ఇండియా పేరును భార‌త్‌ (Bharat)గా మార్చే ప్రక్రియ‌ను కేంద్ర ప్రభుత్వం చేప‌డుతోందని.. ఇండియా పేరు మార్చుతూ స‌భ‌లో తాజా తీర్మానం ఆమోదించేందుకు మోదీ స‌ర్కార్ పావులు క‌దుపుతోంద‌ని వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 22వ తేదీకి ముగుస్తాయి. రెండో రోజైన మంగళవారం ఉభయ సభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిపై రేపు లోక్‌సభలో, ఎల్లుండి రాజ్యసభలో చర్చ జరగనుంది.

Also Read..

Rajamouli | రాజమౌళి సమర్పణలో ఇండియా బయోపిక్‌.. వీడియో రిలీజ్‌ చేసిన జక్కన్న

Naga Chaitanya | త్వరలో తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేయనున్న నాగచైతన్య – శోభిత..!

Jawan Movie | షారుఖ్‌ సర్‌తో మాట్లాడి.. జవాన్‌ చిత్రాన్ని ఆస్కార్‌కి తీసుకెళ్తా : దర్శకుడు అట్లీ

2023-09-19T11:39:26Z dg43tfdfdgfd