సంగం డెయిరీ డైరెక్టర్ అరెస్ట్‌.. ధూళిపాళ్లపైనా హత్యాయత్నం కేసు

సంగం డెయిరీ వ్యవహారంలో అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. డెయిరీ దగ్గర రైతులకు, ఉద్యోగులకు మధ్య ఇటీవల జరిగిన వాగ్వాదంపై నమోదు చేసిన కేసులో పోలీసులు వరుసగా అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ డెయిరీ డైరెక్టర్‌ శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల హార్ట్ సర్జరీ చేయించుకున్న ఆయన పెదనందిపాడు మండలం నాగులుపాడులోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆదివారం ఉదయం మఫ్టీలో ఉన్న పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. విచారణ నిమిత్తం తమతో రావాలని తెలిపారు.

తానుమందులు వేసుకున్న తరువాత విచారణకు హాజరవుతానని ఆయన చెప్పినా వారు వినిపించుకోలేదు. గుండె శస్త్రచికిత్స చేయించుకుని.. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను బలవంతంగా తీసుకెళ్లడంపై శ్రీనివాసరావు భార్య శైలజ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె మాటలను లెక్క చేయకుండా చేబ్రోలు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ఈ నెల 15న సంగం డెయిరీ దగ్గర ఉద్యోగులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. అదే రోజు ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురంనకు చెందిన రైతులపై దాడి చేశారని 15 మందిపై కేసు నమోదు చేశారు. అయితే ఆ వివాదంతో తనకు సంబంధం లేదని డైరెక్టర్‌ శ్రీనివాసరావు అంటున్నారు. మరో ఇద్దరు డెయిరీ ఉద్యోగులకు సంబంధం లేకపోయినా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నేతలు, డెయిరీకి చెందిన పలువురు పాలకవర్గ సభ్యులు చేబ్రోలు స్టేషన్‌ దగ్గర ఆందోళనకు దిగారు.

కేవలం విచారణ కోసమే తీసుకొచ్చామని, వదిలేస్తామని చేబ్రోలు ఎస్సై అన్నారు. ఆ తర్వాత తెనాలి డీఎస్పీ జనార్దనరావు ఆధ్వర్యంలో శ్రీనివాసరావును కొంతసేపు ప్రశ్నించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఇదే కేసులో శనివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న డెయిరీ ఉద్యోగులు కొనంకి రాజ్‌కుమార్‌, నేలటూరి రవిలను ఆదివారం రాత్రి వరకూ విడిచిపెట్టలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను 14వ నిందితునిగా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం వాసి ముసునూరి రాము ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 15వ తేదీన సంగం డెయిరీ వద్ద తమపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. పాల విక్రయానికి సంబంధించి బోనస్ 14 శాతం ఇవ్వలేదని రాము ఆందోళన వ్యక్తం చేశాడు. డెయిరీ వద్దకు మాట్లాడదామని పిలిచి దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాడిలో తమ మూడు కార్లు ధ్వంసం అయ్యాయని ఫిర్యాదు చేశారు. కర్రలు, హాకీ స్టిక్స్‌తో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాము ఫిర్యాదు మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2023-11-20T02:21:50Z dg43tfdfdgfd