AMBATI RAYUDU: 8 రోజుల్లోనే వైసీపీని వదిలేసిన రాయుడు.. అసలు కారణం చెప్పేశాడు

Ambati rayudu in Janasena Election Campaign: ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రచార గడువు ముగస్తుండటంతో పార్టీలన్నీ ప్రచారంలో స్పీడు పెంచాయి. ఈ క్రమంలోనే జనసేన తరుపున టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. జనసేన అభ్యర్థుల తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో అంబటి రాయుడు పర్యటించారు. జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ తరుఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ విధానాల మీద, వైఎస్ జగన్ తీరుపైనా అంబటి రాయుడు విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ మధ్య పోలిక తెచ్చారు.

"గత ఆరు, ఏడు నెలల కాలంలో నేను వైసీపీలో పనిచేశా. రాష్ట్రమంతా తిరిగా. వైసీపీలో ఎంపీ, ఎమ్మెల్యేలకు పనిలేదు. ప్రజాసేవ పట్ల శ్రద్ధ లేదు. వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీలకు పనిచేయలేని పరిస్థితి. అది నాకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్‌ను కలిసిన తర్వాత ఆయన విజన్ నచ్చింది. యువత కోసం ఆయన ఆలోచనలు నచ్చాయి. రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన తపన నచ్చింది. దీంతో జనసేనకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నా. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే ఏపీ అభివృద్ధి చెందుతుందనే నమ్మకం నాకుంది" అని అంబటి రాయుడు అభిప్రాయపడ్డారు.

మరోవైపు అంబటి రాయుడు.. క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం సందర్బంగా వైసీపీకి మరింత దగ్గరైన అంబటి రాయుడు.. పలుచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు అంబటి రాయుడు. దీంతో ఎన్నికల బరిలో అంబటి రాయుడు కూడా ఉంటారని వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్లే గుంటూరు లోక్ సభ పరిధిలో అంబటి రాయుడు విస్తృతంగా పర్యటించారు. దీంతో గుంటూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానంలో ఆయన వైసీపీ తరుఫున పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే పదిరోజులకే అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు.

వైసీపీలో చేరిన పది రోజుల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసిన అంబటి రాయుడు.. జనసేనానికి మద్దతు పలికారు. ఇక ప్రస్తుతం జనసేన తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే వైసీపీ నేతలతో తిరిగిన ఆరు ఏడు నెలల కాలంలోనే అక్కడి పరిస్థితులు తనకు తెలిసివచ్చాయంటున్నారు రాయుడు. వైసీపీలో బానిసత్వం భరించలేకే బయటకు వచ్చి జనసేనకు మద్దతు పలికినట్లు చెప్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-02T12:16:50Z dg43tfdfdgfd