అనసూయకు ఉత్తమ సహాయ నటి అవార్డు

టెలివిజన్ యాంకర్ నుంచి సినిమా నటిగా మారిన అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj).. ఏ పాత్రలు పడితే ఆ పాత్రలు చేయకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలన్నీ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్నవే. ముఖ్యంగా ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్రతో అనసూయకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత లాక్‌డౌన్ సమయంలో చేసిన వెబ్ మూవీ ‘థాంక్ యు బ్రదర్’ కూడా అనసూయకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ‘పుష్ప’ సినిమాతో అనసూయ ప్రతిభ ఇతర చిత్ర పరిశ్రమల వారికీ తెలిసింది. ప్రస్తుతం మలయాళ, తమిళ సినీ పరిశ్రమల నుంచి కూడా అనసూయకు పిలుపు వస్తోంది.

ఇదిలా ఉంటే, అనసూయ ఈ ఏడాది ఐదు తెలుగు సినిమాల్లో నటించారు. వాటిలో ‘ప్రేమ విమానం’ ఒకటి. ఇది ఓటీటీ సినిమా. జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలైంది. ఈ సినిమాలో అనసూయ పేదింటి గృహిణిగా, ఇద్దరు చిన్న పిల్లలకు తల్లిగా నటించారు. అనసూయ పోషించిన శాంత పాత్ర సినిమాకు కీలకమైంది. ఈ పాత్రలో అనసూయ నటన చాలా నేచురల్‌గా అనిపించింది. విమర్శకులు సైతం అనసూయ నటనపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఈ పాత్రే అనసూయకు అవార్డు తెచ్చిపెట్టింది. ‘ప్రేమ విమానం’లో నటనకు గాను సంతోషం ఓటీటీ అవార్డ్స్‌లో ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్నారు. సీనియర్ నటి జయసుధ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అనసూయ అందుకున్నారు.

అనసూయ భరద్వాజ్‌కు అభినందనలు తెలుపుతూ ఆమె అభిమానులు తమ ఎక్స్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. నాలుగు ఫొటోలను కూడా పొందుపరిచారు. ఈ పోస్ట్‌కు అనసూయ స్పందించారు. ‘థాంక్యూ సో మచ్’ అంటూ రిప్లై ఇచ్చారు.

కాగా, ‘ప్రేమ విమానం’ సినిమా అక్టోబర్ 13న జీ5లో ప్రీమియర్ అయ్యింది. ఈ వెబ్ మూవీని అభిషేక్ పిక్చర్స్, జీ5 సంయుక్తంగా నిర్మించాయి. విమానం ఎక్కాలని కలలు కనే ఇద్దరు చిన్న పిల్లలు .. కొత్త జీవితం కోసం విమానం ఎక్కి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకునే ప్రేమ జంట.. వీరితో ముడిపడిన జీవితాల్లో జరిగిన ఘటనలు.. వారి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్ని అంశాలతో కూడిన సినిమానే ‘ప్రేమ విమానం’. అప్పులపాలై బలవన్మరణానికి పాల్పడిన రైతుకు భార్యగా.. భర్త చేసిన అప్పు తీర్చడానికి కష్టపడే గృహిణిగా అనసూయ చాలా బాగా నటించారు. ఇక సంగీత్ శోభన్, శాన్వీ మేఘన ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో.. నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా కీలక పాత్రలు పోషించారు. సంతోష్ కటా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. జగదీష్ చీకటి కెమెరామేన్‌గా పని చేశారు.

2023-11-21T08:29:51Z dg43tfdfdgfd