అలాంటి ఉద్దేశం నాకు లేదు.. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు: వైష్ణవ్ తేజ్

తనకు మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశం తనకు లేదని.. తనకు తెలిసినదల్లా కష్టపడి నిజాయతీగా పనిచేయడమేనని అంటున్నారు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej). ‘ఆదికేశవ’ (Aadikeshava) సినిమా కథ నచ్చి చేశానని.. ఫలితం గురించి ఆలోచించి తాను ఏ సినిమా చేయనని అన్నారు. తనకు ముందు కథ నచ్చాలని.. తన మొదటి సినిమా ‘ఉప్పెన’ కూడా కథ నచ్చే చేశానని చెప్పారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆదికేశవ’. శ్రీలీల హీరోయిన్‌గా నటించారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే, చిత్ర ప్రచారంలో భాగంగా ఈరోజు వైష్ణవ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు.

‘ఆదికేశవ’ సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశం తనకు లేదని వైష్ణవ్ తేజ్ అన్నారు. అసలు ఎవరైనా తనను హీరో అని అంటే.. తాను హీరోని కాదు, నటుడిని అని చెబుతానని వెల్లడించారు. నిజానికి తన చిన మావయ్య పవన్ కళ్యాణ్ కూడా తనతో.. ‘నటుడు అనిపించుకుంటేనే విభిన్న పాత్రలు చేసే అవకాశం ఉంటుంది’ అని చెప్పారని వైష్ణవ్ తెలిపారు.

‘రంగ రంగ వైభవంగా’ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉన్నప్పుడు నిర్మాత నాగవంశీ ‘ఆదికేశవ’ కథ వినమని చెప్పారని.. కథ వినగానే తనకు ఎంతగానో నచ్చిందని వైష్ణవ్ తేజ్ చెప్పారు. ఆ తర్వాత కథ ఇంకా ఎన్నో మెరుగులు దిద్దుకుని అద్భుతంగా వచ్చిందన్నారు. ఇది పూర్తిస్థాయి మాస్ సినిమా అయినప్పటికీ కథలో కొత్తదనం ఉంటుందన్నారు. కథ విన్నప్పుడే ఇలాంటి పాయింట్ ఎవరూ టచ్ చేయలేదని అనిపించిందని.. ఇందులో కామెడీ, సాంగ్స్, విజువల్స్, ఫైట్స్ అన్నీ బాగుంటాయని వెల్లడించారు. ప్రేక్షకులు సినిమా చూసి థియేటర్ల నుంచి ఆనందంగా బయటకు వస్తారని వైష్ణవ్ తేజ్ భరోసా ఇచ్చారు.

యాక్షన్ సన్నివేశాలు కథలో భాగంగానే ఉంటాయని.. వాటిని సాధ్యమైనంత మేర సహజంగానే చిత్రీకరించామని వైష్ణవ్ తేజ్ చెప్పారు. ఫైట్స్ ఎక్కడా అతిగా అనిపించవని.. కొడితే పది మంది గాలిలో ఎగరడం లాంటివి ఉండవని అన్నారు. తన వయసుకి తగ్గట్టుగానే ఫైట్లు ఉంటాయన్నారు. తాను మంచి డాన్సర్‌ను కాకపోయినా చాలా కష్టపడి ఈ సినిమాలో డాన్సులు చేశానని.. డాన్స్ మాస్టర్, శ్రీలీల మద్దతుతో పూర్తి న్యాయం చేయగలిగానని వైష్ణవ్ చెప్పారు.

దర్శకుడు శ్రీకాంత్ కథ చెప్పినప్పుడు ఎంత బాగుందో.. దాన్ని అంతే అద్భుతంగా ఆయన తెరకెక్కించారని వైష్ణవ్ తేజ్ కొనియాడారు. తనకు, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు క్యూట్‌గా ఉంటాయని.. సంభాషణలు సహజంగా సరదాగా ఉంటాయని అన్నారు. ఇక ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమవుతోన్న మలయాళ నటుడు జోజు జార్జ్ గురించి కూడా వైష్ణవ్ తేజ్ మాట్లాడారు. ఆయన చాలా స్వీట్ పర్సన్ అని చెప్పారు. ఆయనతో సెట్స్‌లో ఉన్నప్పుడు విజయ్ సేతుపతిని చూసినట్టే అనిపించేదన్నారు. ఆయన భోజన ప్రియుడని.. ఎప్పుడూ ఎక్కడ ఫుడ్ బాగుంటుందనే ఆరా తీసేవారని చెప్పారు. పెద్ద నటుడు, జాతీయ పురస్కార గ్రహీత అయినప్పటికీ చాలా సింపుల్‌గా ఉండేవారని తెలిపారు.

2023-11-21T15:30:22Z dg43tfdfdgfd