చదువుతోనే బంగారు భవిష్యత్‌

  • ‘బస్తీ బతుకుల్లో మార్పుకోసం’ గబ్బిలాల్‌పేటలో అవగాహన సదస్సు
  • రాచకొండ క్రైం డీసీపీ మధుకర్‌స్వామి

జవహర్‌నగర్‌, మే 26: బస్తీ బతుకుల్లో మార్పు కోసం రాచకొండ పోలీసులు కార్యాచరణ చేపట్టారు. లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌- గ్రీన్‌ల్యాండ్‌, స్థానిక క్రై స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చిన్నారులు, వారి తల్లిదండ్రుల్లో మెరుగైన జీవనానికి భరోసానిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించి మనోధైర్యం నింపారు. చదువుతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని, చిన్నారులు చదువును మధ్యలోనే ఆపేయకుండా పట్టుదలతో చదువునభ్యసిస్తేనే సమాజంలో మంచి గుర్తింపు లభించి ఆత్మగౌరవంతో బతుకుతారని రాచకొండ క్రైం డీసీపీ మధుకర్‌స్వామి అన్నారు. రాచకొండ పోలీస్‌, లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ గ్రీన్‌ల్యాండ్‌, స్థానిక క్రై స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గబ్బిలాల్‌పేటలో బస్తీ పిల్లలకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ మధుకర్‌ స్వామి హాజరై మాట్లాడుతూ.. కలలు కనాలి… వాటిని సొంతం చేసుకునే వరకు వెనుతిరుగొద్దన్నారు. మనస్సును పెట్టుబడిగా మలుచుకుని ముందుకు సాగితే సాధించలేనిది ఏది ఉండదన్నారు. పేదరికంతో ఎంతో మంది చిన్నారులు కార్మికులుగా మారుతున్నారని, సరైన పోషణలేక బాల్యంలోనే బతుకులు బారమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం చదువుకు అడ్డు కాదని… చదువే మనిషి ప్రవర్తనకు మూలమని తెలిపారు. పిల్లలు ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువును అభ్యసించాలన్నారు. త్వరలోనే క్రై సంస్థతో కలిసి మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషినల్‌ డీసీపీ (క్రైం) లక్ష్మి, ఇన్‌స్పెక్టర్‌ సైదులు, దేవేందర్‌, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు రఘునాథ్‌రెడ్డి, విద్యాభూషణ్‌, క్రై ఫెలోస్‌ హిమబిందు, మంజుల, సునీల్‌, బస్తీవాసులు పాల్గొన్నారు.

2023-05-27T00:30:59Z dg43tfdfdgfd