హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. చిత్ర పరిశ్రమకు చంద్రబాబు ఎంతో చేశారని, కానీ, ఆయన అరెస్టు అయినప్పుడు చిత్ర పరిశ్రమ స్పందించలేదనే వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. చంద్రబాబు నాయుడి అరెస్టు చాలా సున్నితమైన విషయమని వివరించారు. చిత్ర పరిశ్రమ రాజకీయ, మతపరమైన అంశాలపై ఎలాంటి ప్రకటనలు చేయదని స్పష్టం చేశారు. అందుకే చంద్రబాబు అరెస్టుపై కూడా ఎటువంటి ప్రకటన ఇవ్వలేదని వివరించారు.
చిత్ర పరిశ్రమ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలనే తాను అనుకుంటానని సురేష్ బాబు అన్నారు. రాజకీయంగా ప్రకటనలు ఇవ్వడం మంచిది కాదని తెలిపారు. తాము రాజకీయ నాయకులం కాదని, లేదా మీడియా వాళ్లం కాదని చెప్పారు. తాము సినిమాలు నిర్మిస్తామని అన్నారు. కాబట్టి, చిత్రపరిశ్రమ రాజకీయ ప్రకటనలు ఇవ్వడం మంచిది కాదనే అనుకుంటానని వివరించారు.
ముఖ్యమంత్రులు చాలా మంది చిత్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదపడ్డారని సురేష్ బాబు అన్నారు. చెన్నారెడ్డి గారు చాలా హెల్ప్ చేశారని, ఆ తర్వత ఎన్టీఆర్ చేశారని వివరించారు. చంద్రబాబు కూడా చిత్ర పరిశ్రమకు చాలానే చేశారని తెలిపారు. అలాగని, చిత్ర పరిశ్రమ స్పందించడం లేదని కామెంట్ చేయడం సరికాదని వివరించారు. చంద్రబాబు అరెస్టు చాలా సున్నితమైన ఇష్యూ అని, ఆంధ్రా, తెలంగాణ గొడవలప్పుడు కూడా చిత్ర పరిశ్రమ స్పందించలేదని గుర్తు చేశారు.
Also Read : అసత్యాలు చెప్పడం చంద్రబాబుకు పుట్టుకతోనే వచ్చింది.. ఆ ఘటనకు ప్రత్యక్ష సాక్షిని: మోహన్‌బాబు
ఎవరైనా వ్యక్తిగతంగా స్పందిస్తే అభ్యంతరమేమీ ఉండదని సురేష్ బాబు చెప్పారు. తమ తండ్రి రామానాయుడు టీడీపీ సభ్యుడని, తాను కూడా పార్టీ కోసం పని చేశానని వివరించారు. అది తమ వ్యక్తిగతం అని తెలిపారు. కానీ, ఇక చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే.. తాను ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ అని వివరించారు. తామంతా చిత్ర పరిశ్రమకు చెందిన వారిమని, అందుకే చంద్రబాబు అరెస్టు గురించి స్పందించలేదని తెలిపారు.
2023-09-19T09:25:32Z dg43tfdfdgfd