తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు సీఎం వైఎస్ జగన్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పరివట్టం కట్టారు ఆలయ ప్రధాన అర్చకులు. సీఎం వెంట టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్ తదితరులు వున్నారు. అనంతరం జగన్‌కు వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్న జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 

ఇకపోతే.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్ర‌హ్మోత్స‌వాల కార‌ణంగా ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు ఉండ‌వని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల సందర్భంగా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయడంతోపాటు లాకర్లు ఏర్పాటు చేయనున్నట్లు వివ‌రించారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ధర్మారెడ్డి తెలిపారు. 

Also Read: తిరుమలలో యాత్రికుల కోసం మరో రెండు కొత్త వసతి సముదాయాలు..

భక్తులకు వైద్యం అందుబాటులో ఉండేలా రుయా ఆస్పత్రి నుంచి సిబ్బందిని రప్పిస్తామన్నారు. ఘాట్ రోడ్డులో 24 గంటల పాటు ఆర్టీసీ బస్సులు తిరుగుతాయని తెలిపారు. వన్యప్రాణుల సంచారం దృష్ట్యా పాదచారులు, ఘాట్ రోడ్లపై ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. అటవీశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం నడకదారిలో నిబంధనలు సడలించనున్నారు.

అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు ఉంటాయనీ, సెప్టెంబర్ 22న గరుడసేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజారోహణం నిర్వహించనున్నట్లు తెలిపారు. వేడుకల సమయంలో రద్దీని ఎదుర్కొనేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తామనీ , వారంలో ఎటువంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని ఆయన పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు.. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయని ధర్మారెడ్డి తెలిపారు. 

2023-09-18T14:54:30Z dg43tfdfdgfd