దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి

  • సజావుగా జరిగేలా కమిటీలు ఏర్పాటు చేశాం
  • జూన్‌ 2 నుంచి 22వ తేదీ వరకు కార్యక్రమాలు
  • అధికారులు సమన్వయంతో పనిచేయాలి
  • సంగారెడ్డి కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ కుమార్‌
  • కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమావేశం

– సంగారెడ్డి కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌

సంగారెడ్డి కలెక్టరేట్‌, మే 26: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అదనపు కలెక్టర్‌ వీరారెడ్డితో కలిసి ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉత్సవాల కార్యాచరణ మేరకు ఆయా కార్యక్రమాలు సజావుగా జరిగేలా కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. జూన్‌ 2న మంత్రి ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు, కలెక్టరేట్‌లో జాతీయ పతాకావిష్కరణ చేసి దశాబ్ది ఉత్సవ సందేశం ఇస్తారన్నారు. 3న వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రైతు దినోత్సవం నిర్వహించాలని, రైతు నివేదికలను మామిడి తోరణాలు, పువ్వులు, విద్యుత్‌ దీపాలంకరణ చేయాలని ఆదేశించారు. అన్ని రైతు వేదికల్లో క్లస్టర్‌ పరిధిలోని గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించి, పంట ముందస్తు సాగుపై చర్చ జరుపాలన్నారు. 4న సురక్షా దినోత్సవాన్ని ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారన్నారు. జిల్లా కేంద్రంలో ర్యాలీలు, ప్రదర్శనలు ఉంటాయన్నారు. 5న తెలంగాణ విద్యుత్‌ విజయోత్సవాన్ని ఆ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

రైతులు, వినియోగదారులు, విద్యుత్‌ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి విద్యుత్‌ రంగంలో సాధించిన గుణాత్మక మార్పును వివరించాలన్నారు. 6న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో భాగంగా పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్‌లో సభలు నిర్వహించాలన్నారు.  టీఎస్‌ ఐపాస్‌, పరిశ్రమల స్థాపన, అనుమతులు, సులభతరమైన విషయాలని వివరించాలన్నారు. 7న సాగునీటి దినోత్సవం జరుపాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో సభ నిర్వహించాలని, రైతులు, శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్‌ ఆధికారులు పాల్గొనాలన్నారు. సాగు నీటి రంగంలో సాధించిన ప్రగతిని వివరించాలని సూచించారు. 8న ఊరూరా చెరువుల పండగ నిర్వహించాలన్నారు. అన్ని పంచాయతీల్లో పెద్ద చెరువు వద్ద చెరువుల పండగలో భాగంగా కట్టపై ఉన్న మైసమ్మ గుడిని విద్యుత్‌ దీపాలతో అలంకరించాలని సూచించారు. మైసమ్మకు, చెరువు నీటికి ప్రత్యేక పూజలు చేయాలన్నారు. 9న తెలంగాణ సంక్షేమ సంబురాలు నిర్వహించాలని, నియోజకవర్గ స్థాయిలో సభలు ఏర్పాటుచేసి అమలైన సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారులకు వివరించాలన్నారు.

గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ

ఈ వేడుకల్లో భాగంగా అదే రోజు గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమం, గతంలో భూములు సేకరించిన చోట అందుబాటులో ఉన్న చోట అర్హులైన పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ, వివిధ గ్రామీణ వృత్తి పనుల వారికి ఆర్థిక ప్రేరణ కింద రూ.లక్ష పంపిణి పథకం ప్రారంభిస్తారని కలెక్టర్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి, జిల్లా అధికారులు, లబ్ధిదారులు పాల్గొంటారని స్పష్టం చేశారు. 10న జిల్లా కేంద్రంలో తెలంగాణ పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్ల వివరాలతో కరపత్రం తయారు చేసి పంపిణీ చేయాలన్నారు. 11న తెలంగాణ సాహిత్య దినోత్సవంలో భాగంగా జిల్లా స్థాయిలో కవి సమ్మేళనం ఏర్పాటుచేయాలన్నారు. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా కవితలు ఉండాలన్నారు. 12న తెలంగాణ రన్‌ను అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువత, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో నిర్వహించాలన్నారు. 13న తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవాన్ని, నియోజకవర్గ కేంద్రాల్లో మహిళా సదస్సు నిర్వహించాలన్నారు. 14న తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించి, ఆ రంగంలో సాధించిన ప్రగతిని పేర్కొనాలన్నారు.

జాతీయ జెండాను ఎగురవేయాలి

15న తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహించాలన్నారు. ప్రతి పంచాయతీ ఎదుట జాతీయ జెండా ఎగురవేయలన్నారు. 16న తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించి సఫాయి కార్మికులను సన్మానించాలన్నారు. మున్సిపాలిటీల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. 17న తెలంగాణ గిరిజన దినోత్సవాన్ని నిర్వహించి, జిల్లాలోని ఆయా గిరిజన గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి, గిరిజన సంక్షేమ శాఖ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని వివరించాలన్నారు. 18న తెలంగాణ మంచి నీళ్లు పండగ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పాత్రికేయులు వివిధ వర్గాల ప్రజలతో మిషన్‌ భగీరథ ఫిల్టర్‌ బెడ్స్‌, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల సందర్శన కార్యక్రమం నిర్వహించాలన్నారు. 19న తెలంగాణ హరితోత్సవం నిర్వహించిన జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

విద్యా, ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించాలి

20న తెలంగాణ విద్యా దినోత్సవాన్ని నిర్వహించి అన్ని విద్యా సంస్థల్లో ఉదయం పతాక వందనం చేయాలని, అనంతరం సభలో విద్యా రంగంలో తెలంగాణ సాధించిన విజయాలు వివరించాలని సూచించారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మన ఊరు – మనబడి పాఠశాలలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. 21న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించాలని, దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇతర మందిరాలకు అలంకరణ చేయాలని సూచించారు. ప్రముఖ క్షేత్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 22న అమర వీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఊరూరా సమావేశమై అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటించాలని కోరారు. ఆయా కమిటీల అధికారులందరూ సమన్వయంతో పని చేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, అదనపు ఎస్పీ ఉషా విశ్వనాథ్‌, డీఆర్వో నగేశ్‌, జిల్లా అధికారులు, ఆర్డీవోలు పాల్గొన్నారు.

2023-05-26T21:51:01Z dg43tfdfdgfd