నా డబ్బులు నాకిచ్చేయాలి.. రాజస్తాన్ మినిస్టర్‌ను డిమాండ్ చేస్తూ వ్యక్తి నిరసన.. ‘మీ పేరు చెప్పే తీసుకున్నాడు’

జైపూర్: రాజస్తాన్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రాజస్తాన్ మంత్రి మహేష్ జోషి పేరు చెప్పి.. ఓ పని చేసి పెడతానని ఒకరు డబ్బు తీసుకున్నారని, కానీ, ఆ పనీ చేయలేదనీ, డబ్బూ తిరిగి ఇవ్వలేదని ఓ వ్యక్తి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ధర్నాకు దిగాడు. తన డబ్బు తనకు ఇచ్చేయాలని మంత్రి మహేష్ జోషిని డిమాండ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సికార్ జిల్లా ఫతేహ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి రాజస్తాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆఫీసు ముందు ఓ పేపర్ చేతిలో పట్టుకుని ధర్నాకు దిగాడు. 10 నుంచి 15 నిమిషాల పాటు అతను ధర్నాకు కూర్చున్నాడు. మంత్రి మహేష్ జోషి పేరు చెప్పి తన వద్ద నుంచి ఓ వ్యక్తి డబ్బులు తీసుకున్నాడని ఆరోపించాడు. మంత్రి మహేష్ జోషి.. సీఎం అశోక్ గెహ్లాట్‌కు సన్నిహితుడని పేరుంది.

ఈ విషయం మంత్రి మహేష్ జోషికి తెలియగానే.. ఆయన స్పందించినట్టు సమాచారం. ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తి తనకు తెలియదని, కాబట్టి, ఇక్కడ నిరసన చేయడానికి బదులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టడం మంచిదని సూచించారని తెలిసింది. 

Also Read: UPSC: నకిలీ డాక్యుమెంట్లు తయారు చేశారు.. ఇద్దరు అభ్యర్థులపై యూపీఎస్సీ క్రిమినల్ చర్యలు

కాంగ్రెస్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన వ్యక్తితో అక్కడ కొద్ది సేపు గందరగోళం నెలకొంది. ఎట్టకేలకు ఆయనతో ధర్నాను ముగించారు. డబ్బులు తీసుకున్న వ్యక్తి మంత్రి మహేష్ జోషికి తెలియదని ఓ కాంగ్రెస్ నేత తెలిపారు. అందుకే ఆ వ్యక్తి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించుకోవాలని మంత్రి మహేష్ జోషి సూచించినట్టు ఆ కాంగ్రెస్ నేత వివరించారు.

2023-05-26T16:45:46Z dg43tfdfdgfd