ఫైనల్‌లో ఇండియా ఓటమి.. తల్లిని పట్టుకుని ఏడ్చేసిన చిన్నారి.. వీడియో వైరల్

మనదేశంలో క్రికెట్‌ను ఓ మతంలా భావిస్తుంటారు. ప్రాంతాలు, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటిది ఇక ప్రపంచకప్ అంటే చెప్పేదేముంది. పిల్లాపెద్దా అంతా కలిసి ఒక్కచోట చేరి అభిమాన క్రికెటర్ల ఆటతీరు చూసి సంబరపడుతుంటారు. గెలిస్తే ఉత్సాహం.. ఓడిపోతే నిరాశ.. మామూలు టోర్నీలలో అయితే ఆ ఎమోషన్ ఓ మోస్తారు వరకూ ఉంటుంది.

అదే ప్రపంచకప్ లాంటి మెగాటోర్నీ సమయంలో అయితే ఆ ఎమోషన్ ఇంకే రేంజులో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పుడీ సంగతి ఎందుకంటే టీమిండియా ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయిన తర్వాత ఓ చిన్నారి భోరుమని ఏడ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఓ కుటుంబం అంతా కలిసి టీమిండియా జెర్సీలు ధరించి టీవీల ముందు కూర్చుంది. బంతి, బంతికీ ప్లేయర్లను ప్రోత్సహిస్తూ టీమిండియా కప్ గెలవాలని ఆ కుటుంబం మొత్తం ప్రార్థించింది. మ్యాచ్ మనవైపు నుంచి ఆస్ట్రేలియా వైపు మొగ్గుతుంటే కంగారు పడిపోయింది. అయినా అద్భుతం జరగకపోకుందా అనే ఆశతో మ్యాచ్ చివరకూ అలా చూస్తూ ఉండిపోయింది. అయితే ఎలాంటి అద్భుతం జరగలేదు. టీమిండియా మీద ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఎగరేసుకుపోయింది.

దీంతో అప్పటి వరకూ టీమిండియా కప్ గెలుస్తుందని ఆశతో చూస్తున్న ఆ కుటుంబంలో ఓ చిన్నారి.. ఇండియా ఓడిపోవటాన్ని తట్టుకోలేకపోయాడు. భోరుమంటూ వెక్కివెక్కి ఏడ్చాడు. తల్లిని హత్తుకుని మరీ పాపం బాధపడిపోయాడు. దీంతో కొడుకు ఆవేదన చూడలేక ఆ తల్లి సైతం దగ్గరకు తీసుకుని ఓదార్చే ప్రయత్నం చేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజట్లు ఇండియాలో క్రికెట్ అంటే ఓ స్పోర్ట్స్ కాదు.. అది ఒక ఎమోషన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరికొంతమందేమో ఈసారికి ఓడిపోయినా తర్వాత గెలుస్తామని, ఏడవొద్దంటూ ఆ బుడ్డోడికి ధైర్యం చెబుతున్నారు. ఇంకొంతమంది మాత్రం ఆ చిన్నారి మాత్రమే కాదు యావత్ దేశం మొత్తం ఏడుస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

105349491

2023-11-20T08:13:35Z dg43tfdfdgfd