ఫుట్‌బాల్‌ వైద్యురాలు

మనీషా షా.. వృత్తిరీత్యా వైద్యురాలు. ప్రవృత్తి రీత్యా ఫుట్‌బాల్‌ ప్రేమికురాలు. వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి మైదానాన్ని మించిన మార్గం లేదని ఆమె బలంగా నమ్మారు. అందుకే, అహ్మదాబాద్‌ బస్తీ పిల్లలకోసం ‘కహానీ ఫుట్‌బాల్‌ క్లబ్‌’ ఏర్పాటు చేశారు. అప్పట్లో అమెరికా, హాంకాంగ్‌లో ఉండేవారామె. నలుగురికీ ఉపయోగ పడని సంపాదన ఎందుకు అనిపించిందేమో.. ఇండియాకు తిరిగొచ్చారు. ఫుట్‌బాల్‌ను ఓ సామాజిక ఉద్యమంగా తీసుకెళ్లారు. ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి. బంతి చేత్తో పట్టుకోవడం కూడా తెలియని ఆడపిల్లలే ఇప్పుడు ఇండియన్‌ ఉమెన్స్‌ లీగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫుట్‌బాల్‌ నేర్చుకోవడానికి వచ్చే బాలికలకు భోజనం, శిక్షణ, రవాణా, దుస్తులు.. ఇలా సమస్తం సమకూరుస్తారు మనీషా. అందులో చాలామంది రిక్షా కార్మికులు, పారిశుధ్య సిబ్బంది, అడ్డా కూలీల పిల్లలే. ఇందుకు ఏటా యాభై లక్షలు ఖర్చు చేస్తున్నారు. ‘ఒకరిద్దరు స్పాన్సర్లు కనుక దొరికితే మరింత నాణ్యమైన శిక్షణ అందించగలం’ అంటారామె. ఆటలు ఆ అమ్మాయిల జీవితాల్ని చాలా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒంట్లో సత్తువ వచ్చింది. చదువుల పట్ల శ్రద్ధ పెడుతున్నారు. జీవితానికి కూడా ఓ గోల్‌ సిద్ధం చేసుకుంటున్నారు.

2023-05-25T20:07:19Z dg43tfdfdgfd