భార్య కాపురానికి రాలేదని భర్త దారుణం.. పోలీస్‌ స్టేషన్‌లో షాకింగ్ సీన్

తిరుపతి.. చంద్రగిరి పోలీస్ స్టేషన్‌ ముందు.. ఓ వ్యక్తి తనకు తాను పెట్రోల్ పోసుకొని, తగలబెట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది. తన ఈ చర్యకు కారణం ఓ కానిస్టేబుల్ అని అతను ఆరోపిస్తున్నాడు. దాంతో ఈ కేసును పోలీసులు ఎలా డీల్ చేస్తారన్నది చర్చగా మారింది. బాధితుడు చెప్పిన దాని ప్రకారం.. విజయవాడకు చెందిన మణికంఠ భార్య దుర్గ... సోను అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిసింది. మూడు నెలల కిందట మణికంఠను వదిలి.. సోనూతో ఇల్లు వదిలి పారిపోయింది. ఆమె కోసం గాలించిన మణికంఠ.. ఆమె బాకరాపేటలో ఉన్నట్లు గుర్తించాడు. సోమవారం చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. ఐతే.. పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు.. "నీ భార్య రాదు. ఆమెకు నీతో కాపురం చేయడం ఇష్టం లేదు. మరోసారి ఆమెని బలవంతం పెడితే నీపై తప్పుడు కేసులు పెట్టి.. సెల్‌లో పెట్టి.. జీవితం నాశనం చేస్తాను" అని బెదిరించాడని మణికంఠ ఆరోపించాడు. తీవ్ర మనస్తాపం చెందిన మణికంఠ.. పోలీస్ స్టేషన్ ముందు శరీరంపై పెట్రోల్ పోసుకొని, నిప్పంటించుకున్నాడు. తర్వాత కేకలు వేస్తూ.. పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి తనకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశాడు. కానిస్టేబుల్ శ్రీనివాసులు తీరువల్లే తాను ఇలా చేసుకున్నట్లు తెలిపాడు. ఒక్కసారిగా అతను అలా వచ్చేసరికి షాకైన పోలీసులు.. మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. ఐతే.. అప్పటికే అతని శరీరం సుమారు 80 శాతం కాలిపోయింది. పోలీసులు హడావుడిగా అతన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ మొత్తం ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

2023-11-20T07:40:52Z dg43tfdfdgfd