మిరాకిల్.. బిడ్డకు జన్మనిచ్చిన ఇద్దరు మహిళలు.. ఇరువురి కడుపులోనూ పెరిగిన పిండం

Same Sex Couple: వైద్య శాస్త్రంలో ఇదో అద్భుతం. ఈ డైలాగ్‌ను సినిమాల్లో తరచుగా వింటూ ఉంటాం. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లను నిర్వహించి.. డాక్టర్లు అరుదైన వ్యాధులను నయం చేయడం చూస్తూనే ఉంటాం. టెక్నాలజీ మారుతున్న కొద్దీ వైద్య రంగంలో కూడా ఎన్నో కొత్త రకాల ట్రీట్‌మెంట్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే అరుదైన సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇద్దరు మహిళలు కలిసి ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఆ మగబిడ్డ ఇద్దరి కడుపులోనూ పెరగడం విశేషం. ఇద్దరు మహిళలు కలిసి ఒక మగ బిడ్డకు జన్మనివ్వడమే విశేషం అనుకుంటే వారిద్దరూ ఆ బిడ్డను మోయడం మరో విశేషం.

ఈ అత్యంత అరుదైన ఘటన స్పెయిన్‌లో జరిగింది. మజోర్కాలోని పాల్మాలో 30 ఏళ్ల ఎస్టీఫానియా, 27 ఏళ్ల అజహారా ఇద్దరు మహిళలు కలిసి అక్టోబర్‌ 30 వ తేదీన ఒక మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇద్దరు మహిళలు స్వలింగ సంపర్కులు కాగా.. పిల్లలను కనాలని వారు ఆశపడ్డారు. అయితే తమ కడుపులోనే ఆ బిడ్డను మోయాలని నిర్ణయించుకున్నారు. దానికోసం ఓ ఫెర్టిలిటి సెంటర్‌ను సంప్రదించారు. ముందుగా ఎస్టీఫానియా అనే మహిళ గర్భంలో వీర్యాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆమె గర్భంలో అండం, వీర్యం ఫలదీకరణం చెందేలా చేసి.. 5 రోజుల తర్వాత ఆ పిండాన్ని అజహారా అనే మహిళ గర్భంలోకి మార్చారు. దీంతో ఒకే బిడ్డను ఇద్దరు మహిళలు తమ కడుపులో మోశారు.

అయితే ఈ మొత్తం ప్రక్రియ కోసం వారిద్దరికీ సుమారు రూ. 4 లక్షలు ఖర్చు వచ్చింది. అంత ఖర్చు అయినా సరే తాము మాతృత్వపు అనుభవాన్ని పొందడంతోపాటు తమ కలను సాకారం చేసుకున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే కడుపులో బిడ్డ ఉండగా.. ఒకరిపై ఒకరు తీసుకున్న శ్రద్ధ తమ మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపడేలా చేసిందని తెలిపారు. దానికి ప్రతిరూపమే ఆ మగబిడ్డ అని తెలిపారు.

ఈ వైద్య విధానాన్ని ఇన్వోసెల్‌ అనే సంతానోత్పత్తి చికిత్సగా పిలుస్తారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇది రెండో సంఘటన. వీరికి ముందు 2018 లో అమెరికాలోని టెక్సాస్‌లో ఇద్దరు మహిళలు కూడా ఇలాగే చేశారు. ఒకే బిడ్డను ఇద్దరు తమ కడుపులో మోసి.. ప్రపంచంలోనే తొలి స్వలింగ జంటగా నిలిచారు.

2023-11-21T09:58:26Z dg43tfdfdgfd