మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న తొలి పాకిస్తానీపై ప్రశంసల జల్లు ఎందుకు?

మిస్ యూనివర్స్ పోటీల్లో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన మొదటి మహిళ ఎరికా రాబిన్.

ఆమె పాకిస్తానీ మోడల్, ఫ్యాషన్ ఐకాన్.

పాకిస్తాన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా మహిళలకు సమాన అవకాశాలు, మెరుగైన విద్య అందించాలనే డిమాండ్‌కు ఆమె మద్దతుగా నిలుస్తున్నారు.

ఇరవై ఐదేళ్ల ఎరికాకు సంగీతం, ట్రావెలింగ్‌పై ఆసక్తి. మిస్ యూనివర్స్ పోటీల వేదిక అయిన ఎల్ సాల్వడార్‌ సంస్కృతిని, అక్కడి ఆహారాన్ని, ప్రకృతిని ఆమె ఆస్వాదించారు.

'మిస్ యూనివర్స్' వేదికపై ఆత్మస్థైర్యంతో, ముగ్ధమనోహరంగా నడిచినందుకు ఎరికా రాబిన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో 90 మంది అందగత్తెలు పోటీ పడ్డారు. ఈ పోటీల్లో వివిధ విభాగాలు దాటిన తర్వాత ఎల్ సాల్వడార్‌లో నవంబర్ 18న, సాయంత్రం మిస్ యూనివర్స్ ఫైనల్ పోటీ జరిగింది.

కాలమానంలో తేడాల కారణంగా పాకిస్తాన్, భారత్ ప్రేక్షకులు నవంబర్ 19 ఉదయం ఈ పోటీలను చూడగలిగారు. మిస్ యూనివర్స్ 2023 కిరీటాన్ని నికరాగ్వాకు చెందిన షెనిస్ పలాసియో దక్కించుకున్నారు.

మిస్ యూనివర్స్ పోటీల్లో భాగంగా 'ఫుల్ ఈవెనింగ్ గౌన్' విభాగంలో జరిగిన పోటీల్లో ఎరికా రాబిన్, తెలుపు, సిల్వర్ రంగు గౌన్, తలపై మెరుస్తున్న నెట్ దుపట్టాను ధరించారు.

ఫుల్ ఈవెనింగ్ గౌన్ విభాగంలో ఎరికా దుస్తులకు 'నంబర్ వన్' స్థానం దక్కింది. ఇదే తన ఐడెంటిటీ అని ఎరికా చెప్పారు.

''నా జీవితంలో నంబర్ వన్ చాలా ముఖ్యమైనది. నా దేశ జెండాలోని తెలుగు రంగు మాదిరిగా ఒక్క శాతం మైనార్టీకి చెందిన వ్యక్తిని నేను'' అని ఆమె తన డ్రెస్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టులో రాశారు.

''నేను తొలి మిస్ యూనివర్స్‌ పాకిస్తాన్‌గా నిలిచాను. నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ నేను ఇక్కడ నిలబడడం చాలా గర్వంగా ఉంది. ఇది నాకు గౌరవం'' అని ఆమె రాశారు.

'ఏదీ అసాధ్యం కాదు'

క్రైస్తవ మతానికి చెందిన ఎరికా రాబిన్, మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని మిస్ యూనివర్స్ పాకిస్తాన్ టైటిల్ గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. ఆమె దీని గురించి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో రాశారు.

''నేను చిన్నప్పటి నుంచి మిస్ యూనివర్స్ పోటీలను చూసేదాన్ని. నాలాంటి పాకిస్తానీ మహిళలు ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ పోటీల్లో ఎందుకు పాల్గొనడం లేదని ఆశ్చర్యపోయేదాన్ని. కానీ, ఏదీ అసాధ్యం కాదని మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఇప్పుడు మిస్ యూనివర్స్ పాకిస్తాన్ టైటిల్‌ను గెలుచుకున్నా. సానుకూల మార్పులను తీసుకొచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని, కలలు నిజమవుతాయని దృఢంగా విశ్వసిస్తున్నాను’’ అని ఆమె చెప్పారు.

మిస్ యూనివర్స్- 2023 పోటీల సందర్భంగా ఎరికా రాబిన్ పలు వేదికలపై పాకిస్తాన్ సంస్కృతిని ఎలుగెత్తి చాటారు.

పాకిస్తానీ సంస్కృతిని తెలియజేసే ఆకర్షణీయమైన దుస్తులు

మిస్ యూనివర్స్ పోటీల్లో నేషనల్ కల్చరల్ షోలో ఎరికా రాబిన్ చోళీ గాగ్రాతో కనిపించారు. అలాగే, నలుపు, గులాబీ రంగు దుస్తుల్లో, పొడవైన సంప్రదాయ స్కార్ఫ్‌ను కూడా ధరించారు.

ఆమె వేదికపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక అభిమాని పైకి లేచి నిల్చున్నారు.

ఆమె జుట్టులో అలంకరించిన ఆభరణాలు పాకిస్తాన్‌లోని విభిన్న సంస్కృతులకు చెందిన రంగులు, ఆకర్షణీయమైన శైలిని ప్రపంచం ముందు ఆవిష్కరించాయి.

అందమైన ఎరికా హుందాతనం, ఆకర్షణీయమైన దుస్తులు సోషల్ మీడియాలో కూడా పాపులర్ అయ్యాయి.

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ (గతంలో ట్విటర్)లో ముష్క్ అనే యూజర్, ఆమె తెల్లని గౌన్‌‌పై ప్రశంసలు కురిపించడం మాత్రమే కాకుండా, ప్రోత్సాహకరంగా మాట్లాడారు.

''అన్ని రకాల దుస్తుల్లోనూ ఎరికా అందంగా ఉంటారు. కానీ ఈ తెల్ల గౌనులో ఆమె ఇంకా అందంగా ఉన్నారు. ఇది అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది'' అని రాశారు.

దేశానికి ఎరికా ప్రాతినిధ్యం వహించడం పాకిస్తాన్‌కు గర్వకారణమని ఆయేషా ముఘల్ అనే యూజర్ రాశారు.

''మిస్ యూనివర్స్ పోటీల్లో మన మొదటి మిస్ పాకిస్తాన్, దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం సంతోషకరమైన విషయం. అంతర్జాతీయ పోటీల్లో మన పురుషులకు మద్దతిస్తున్న విధంగానే మన అమ్మాయిలకు కూడా మద్దతు ఇవ్వగలమని, సాయం చేయగలమని ఆశిస్తున్నా.''

కఫ్తాన్‌ లాంటి స్విమ్‌సూట్‌ ధరించి..

పాకిస్తాన్ లాంటి సంప్రదాయ దేశంలో పుట్టిన ఎరికా అందాల పోటీల్లో పాల్గొనడంపై ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఆమె పాకిస్తాన్‌ నుంచి వచ్చారన్నది ఒక్కటే కాదు, అన్ని విభాగాల్లోనూ ఆమె ధరించిన దుస్తులు కూడా ఆశ్చర్యపరిచాయని నిపుణులు చెబుతున్నారు.

ఒక విభాగంలో అందగత్తెలందరూ స్విమ్ సూట్లు ధరిస్తే, ఎరికా మాత్రం కఫ్తాన్‌ (భుజాల దగ్గరి నుంచి కాళ్ల వరకూ ఉండే డ్రెస్) లాంటి లేత గులాబీ రంగు స్విమ్‌సూట్ ధరించారు. అది ఆమె శరీరం మొత్తాన్ని కప్పేలా కూడా ఉంది.

ఆమె ధరించిన స్విమ్ సూట్ అందాల పోటీల్లో పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తున్న వారికి సమాధానం చెప్పేలా ఉందని ఎరికా మద్దతుదారులు అంటున్నారు.

పోటీకి ముందు ఎరికా రాబిన్ బీబీసీతో మాట్లాడుతూ ఇలా అన్నారు. ''నేను మగాళ్లందరి ముందు స్విమ్‌సూట్‌తో పరేడ్ చేస్తానని అనుకుని ఉంటారని నేను అనుకుంటున్నా.'' అన్నారు.

ఎరికా తన దేశంలోనే వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది.

పాకిస్తాన్ సంప్రదాయ సమాజం నుంచి ఒక మహిళ ఇలాంటి అంతర్జాతీయ స్థాయి అందాల పోటీల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి.

మిస్ యూనివర్స్ పోటీల వరకూ ఎరికా ప్రయాణం అంత తేలిగ్గా ఏమీ సాగలేదు. అందాల పోటీలకు ఎంపికైనప్పటి నుంచే ఆమెపై విమర్శలు మొదలయ్యాయి.

ఎరికా రాబిన్ మాల్దీవుల్లో జరిగిన ఫైనల్ లెవెల్ ప్రిలిమినరీ పోటీల్లో ఎంపికైన ఐదుగురు అందగత్తెల్లో ఒకరిగా ఎంపికయ్యారు. అయితే, ఆ వార్త బయటికి వచ్చిన తర్వాత సొంత దేశంలోనే వ్యతిరేకతను ఎదుర్కొంది.

ఎరికాను ఉద్దేశించి మాట్లాడుతూ- పాకిస్తాన్‌‌కు చెందిన మతవాద రాజకీయ పార్టీ అయిన జమాతె-ఇ-ఇస్లామీకి చెందిన సెనేటర్ ముస్తాక్ అహ్మద్ 'సిగ్గుచేటు' అని అన్నారు. ఇన్‌చార్జి ప్రధాన మంత్రి అన్వర్ ఉల్ హక్ కాకర్ కూడా దీనిపై విచారణకు ఆదేశించారు.

అవే కాకుండా బహిరంగ విమర్శలు, ఆన్‌లైన్ గాసిప్‌లు, ముఖ్యంగా పాకిస్తాన్ పురుషుల నుంచి చాలా ఇబ్బందికరమైన విమర్శలు ఎరికాపై వచ్చాయి.

పాకిస్తాన్ కోసం ఏం చేస్తారు?

పోటీలకు ఎంపికవడాన్ని ఎరికా రాబిన్ తనకు దక్కిన గౌరవంగా భావించారు. అయితే, పాకిస్తాన్‌లో దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆమె కొద్దినెలల ముందు బీబీసీతో మాట్లాడుతూ- ''నేను పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉంది. కానీ ఇంత వ్యతిరేకత ఎందుకో అర్థం కావడం లేదు'' అన్నారు.

కరాచీలోని సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్లో ఎరికా చదువుకున్నారు. ప్రభుత్వ కామర్స్, ఎకనమిక్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

తాను ఎలాంటి తప్పూ చేయలేదని ఆమె మొండిగా ఉన్నారు.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ, జూమ్‌లో రెండో రౌండ్ ఎంపిక ప్రక్రియ జరుగుతున్నప్పుడు మీ దేశం కోసం చేయాలనుకుంటున్న ఒక విషయం గురించి చెప్పాలని అడిగారని ఎరికా అన్నారు.

''వారికి నా సమాధానం ఏంటంటే, పాకిస్తాన్ వెనకబడిన దేశం అనే ఆలోచనను మార్చేయాలని అనుకుంటున్నా.''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2023-11-21T07:35:51Z dg43tfdfdgfd