మేమ్ ఫేమస్

ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో తెలంగాణ నేప‌థ్యంలో సినిమాలు రావ‌టం ఎక్కువ‌య్యాయి. అదే ట్రెండ్‌ను ఫాలో అవుతూ రూపొందిన సినిమా ‘మేమ్ ఫేమస్’. యూ ట్యూబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియో సాంగ్స్‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమంత్ ప్ర‌భాస్ హీరోగా న‌టించాడు. రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ సినిమాను నిర్మించిన అనురాగ్ రెడ్డి, శ‌ర‌త్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌హా ప‌లువురు స్టార్స్ ఈ సినిమాకు త‌మ వంతు మ‌ద్ద‌తుని తెలియ‌జేశారు. ప్ర‌మోష‌న్స్ పీక్స్‌లో జ‌రిగాయి. మ‌రి టైటిల్‌కు త‌గ్గ‌ట్టు మేమ్ ఫేమ‌స్ సినిమా నిజంగానే ఫేమ‌స్ అయ్యేంత కంటెంట్‌తో తెర‌కెక్కిందా? లేదా? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం..

క‌థ‌:

మ‌హేష్ అలియాస్ మ‌యి (సుమంత్ ప్ర‌భాస్‌), దుర్గ (మ‌ణి ఏగుర్ల‌), బాల‌కృష్ణ అలియాస్ బాలి (మౌర్య‌) చిన్న‌ప్ప‌టి నుంచి మంచి స్నేహితులు. ఏ ప‌నీ పాటా లేకుండా తిరుగుతూ అంద‌రినీ చిన్న‌పాటి ఇబ్బందుల‌కు గురి చేస్తుంటారు. దాని వ‌ల్ల వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా పంచాయ‌తీల్లో నిల‌బ‌డాల్సి వ‌స్తుంటుంది. అయితే పంచాయ‌తీ ప్రెసిడెంట్ వేణు (కిర‌ణ్ మ‌చ్చ‌), అంజి మామ(అంజి మామ మిల్కూరి) మాత్రం వీరికి స‌పోర్ట్ చేస్తుంటారు. మ‌హేష్ త‌న మ‌ర‌ద‌లు మౌనిక (సార్య ల‌క్ష్మ‌ణ్‌)నే ప్రేమిస్తాడు. ఆమెకి కూడా బావ అంటే చాలా ఇష్టం. బాలి కూడా అదే ఊరికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. అంద‌రితో తిట్లు తింటూ ఉండే వాళ్ల‌లో కొన్ని కార‌ణాల‌తో మార్పు వ‌స్తుంది. దాంతో వాళ్లు టెంట్ హౌస్ పెడ‌తారు. త‌ర్వాత యూ ట్యూబ్‌లో వీడియోలు చేస్తారు. ఈ క్ర‌మంలో వారు చేసే ప‌నుల వ‌ల్ల ఊరికి జ‌రిగే మంచి ఏంటి? వారి ప్రేమ‌లు ఎలాంటి మ‌లుపులు తిరుగుతాయి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:

ట్రెండ్‌ను ఫాలో అయ్యి సినిమాలు తీయ‌టం త‌ప్పేమీ కాదు. అయితే సినిమాను ఎంత ఎంగేజింగ్‌గా, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా తెర‌కెక్కించామ‌నేది చాలా ముఖ్యం. క‌థప‌రంగా చూస్తే మేమ్ ఫేమ‌స్‌లో ఎలాంటి కొత్త‌ద‌నం లేదు. ఎలాంటి ప‌నీ పాట లేని ముగ్గురు యువ‌కులు ప్ర‌యోజ‌కులుగా మార‌టం, వారి వ‌ల్ల ఊరికి మేలు జ‌ర‌గ‌టం అనేదే. ముగ్గురు స్నేహితులు ఊర్లో చేసే చెత్త ప‌నులు, దాని వ‌ల్ల పుట్టే కామెడీ సీన్స్ చూస్తే కొన్ని సినిమాలు మ‌న‌కు గుర్తుకు రాక మాన‌వు. సినిమాను కామెడీ చుట్టూ న‌డ‌ప‌టానికి డైరెక్ట‌ర్ సుమంత్ ప్ర‌భాస్ ఆస‌క్తి చూపించాడు. దీనివ‌ల్ల సినిమాలో ఎమోష‌న్స్ క‌నెక్ట్ కావు.

ముగ్గ‌రు ఫ్రెండ్స్ త‌ప్పులు చేయ‌టం పంచాయ‌తీలో నిల‌వ‌టం అనేది ఫ‌స్టాఫ్ అంతా క‌నిపిస్తూనే ఉంటుంది. అది బోరింగ్‌గా ఉంటుంది. ఎంటి సినిమా అంతా ఇక్క‌డే తిరుగుతుంది. అస‌లు క‌థేమైనా ఉందా? లేదా? అనే ఫీలింగ్‌ను క్రియేట్ చేస్తుంది. త‌ర్వాత క‌థ‌లో హీరోలు బాధ్య‌త‌గా టెంట్ హౌస్ పెట్టుకునే స‌న్నివేశాలు.. అక్క‌డి నుంచి వారి లైఫ్స్‌లో నెక్ట్స్ లెవ‌ల్‌కు చేరుకుంటారా? అని అనుకుంటున్న స‌మ‌యంలో చిన్న బ్రేకుల్లా ల‌వ్‌లో ఇష్యూస్‌, టెంట్ హౌస్ కాలిపోవ‌టం వంటి సీన్స్‌తో నెక్ట్స్ ఏంటి అనే దానిపై ఫ‌స్టాఫ్‌ను పూర్తి చేశారు.

సెకండాఫ్ అంతా యూ ట్యూబ్ వీడియోస్‌పై ర‌న్ చేశారు. ఇందులో ఈ వీడియోస్ చేసే క్ర‌మంలో వ‌చ్చే కామెడీ ఆడియెన్స్‌ను బాగా న‌వ్విస్తాయి. అలాగే సుమంత్ ప్ర‌భాస్‌, సార్య ల‌క్ష్మ‌ణ్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ యూత్‌కి క‌నెక్ట్ అవుతుంది. అయితే సినిమా సాగ‌దీత‌గా అనిపిస్తుంది. కాస్త ఎడిట్ చేస్తే బావుంటుంద‌నే ఫీలింగ్ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అవుతుంది. సుమంత్ ప్ర‌భాస్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఇక మ‌ణి, సార్య ల‌క్ష్మ‌ణ్‌, మ‌ణి ఏగుర్ల, ముర‌ళీధ‌ర్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల మేర‌కు న‌టించారు. సాంకేతికంగా చూస్తే శ్యామ్ దూపాటి కెమెరా వ‌ర్క్ బావుంది. క‌ళ్యాణ్ నాయ‌క్ పాట‌ల కంటే నేప‌థ్య సంగీత బావుంది.

చివ‌ర‌గా.. ‘మేమ్ ఫేమస్’... టైటిల్‌లో ఉన్నంత సినిమాలో లేదు

2023-05-26T02:29:23Z dg43tfdfdgfd