వీజే సన్నీ ‘సౌండ్ పార్టీ’ ఎన్ని రోజుల్లో షూట్ చేశారంటే.. బిజినెస్ విషయాలు చెప్పిన నిర్మాతలు

బిగ్ బాస్ ఐదో సీజన్ విన్నర్ సన్నీ హీరోగా ప్రస్తుతం దూకుడు మీదున్నాడు. సన్నీ హీరోగా సౌండ్ పార్టీ అనే చిత్రం రాబోతోంది. జయ శంకర్ సమర్పించగా.. సంజ‌య్ శేరి దర్శకత్వం వహించాడు. ఈ మూవీని రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఈ చిత్రంలో సన్నీ సరసన హ్రితిక శ్రీనివాస్ నటించింది. ఈ సినిమా నవంబర్ 24న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా గురించి నిర్మాతలు చెప్పిన విశేషాలివే..

అమెరికాలో ఎన్నో ఏళ్ల నుంచి ఐటీ, రియల్ ఎస్టేట్ బిజినెస్ కలిసి చేశారట. అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలైందని చెప్పుకొచ్చారు. తాము ఎంతో మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. ఇక ఏ వ్యాపారంలో అయినా సరే కామన్ సెన్స్, తెలివి ఉంటే నెట్టుకురావచ్చని అంటున్నారు. సినిమా ఫీల్డ్‌లోనూ అంతే అని చెప్పుకొచ్చారు. సినిమాల మీదున్న ఇష్టంతోనే ఇండస్ట్రీలోకి వచ్చినట్టుగా తెలిపారు.

గత ఆరేళ్లుగా ఎన్నో ప్రాజెక్టులను తెరకెక్కించామని, షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్‌ వంటివి తీశామని చెప్పుకొచ్చారు. పది ప్రాజెక్టుల వరకు చేశామని రవి పొలిశెట్టి తెలిపాడు. కరోనా టైంలో అమెజాన్‌లో విటమిన్ షీ విడుదలైందన్నాడు. 25 స్క్రిప్ట్‌లు విని చివరకు సౌండ్ పార్టీకి ఓకే చెప్పామని తెలిపాడు. డైరెక్టర్ సంజయ్, జయ శంకర్ కలిసి సన్నీని హీరోగా నిర్ణయించారని అన్నాడు. సన్నీ అయితేనే కరెక్ట్‌గా ఉంటుందని తాము కూడా అనుకున్నట్టుగా చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాకు 26 రోజుల పాటు షూటింగ్ చేశామని, వందల మందికి ఉపాధి కల్పించామని, అదే తమకు ఎంతో సంతృప్తినిచ్చిందంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాను ఇక్కడ వంద థియేటర్లు, యూఎస్‌లో 150 థియేటర్లలో విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు. ఇంకా తమ వద్ద పది స్టోరీలున్నాయ్ అని, అంతా కొత్తవారితోనే తీస్తామని తెలిపాడు. రవి మీదున్న నమ్మకంతోనే ఈ ఇండస్ట్రీలోకి వచ్చానని మహేంద్ర అన్నాడు. సౌండ్ పార్టీ చూశాక తానే నిర్మాతగా వస్తానని చెప్పాడట. రిచ్ పీపుల్స్‌ని మనం సౌండ్ పార్టీ అని అంటుంటాం.. ఇదేమీ ప్రయోగాత్మక చిత్రం కాదు.. అందరినీ నవ్విస్తుంది.. కంటెంటే మాట్లాడుతుందని అన్నాడు.

2023-11-20T09:13:12Z dg43tfdfdgfd