“ మొన్నటి వరకు నీరా తాగాలని ఉన్నా దొరికేది కాదు. దాని కోసం ఊళ్లో.. ఒక రోజు సెలవు పెట్టి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏడాది కెప్పుడో ఓసారి ఊరెళ్లి నీరా తాగేవాళ్లం. కానీ ఇప్పుడు నీరా తాగాలనుకుంటే నిమిషాల్లో పని. నీరా కేఫ్‌కు వచ్చేసి తాగొచ్చు. స్వచ్ఛమైన నీరాను తాగే అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి థ్యాంక్స్.” ఇది ఐటీ ఉద్యోగి భవ్య మాట.
“నీరా తాగితే ఆరోగ్యం బాగుంటుంది. అనేక పోషక విలువలతో కూడిన పానియం ఇది. చాలా రుచిగా ఉండటంతో ఇంటిల్ల్లి పాది కూడా నీరా తాగుదామని అడుగుతుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచి మెడిసిన్ అని నమ్ముతాం.” ఇది ఈస్ట్‌మారేడుపల్లికి చెందిన సౌమ్య అనే గృహిణి అభిప్రాయం.
సిటీబ్యూరో, మే 25 ( నమస్తే తెలంగాణ) : ‘నీరా’పై నగర వాసులు మనసుపడ్డరు. రుచితో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి పానియం వారిని ఎంతగానో ఉత్సాహపరిచి, ఉల్లాసాన్ని పంచుతున్నది. రోజూ రాలేకపోయినా.. ఇంట్లో వారితో పార్సిల్స్ తెప్పించుకుని మరీ నీరా తాగుతున్నారు. ప్రకృతి అందించిన ఈ పానియం వారిని అమితంగా ఆకట్టుకుంటోందనడానికి హుస్సేన్ సాగర్ సమీపంలో వెలిసిన నీరా కేఫ్‌లో రోజూ కనిపించే సందడే ఇందుకు నిదర్శనం. కాగా, ప్రతి రోజు 1300(300ఎంఎల్) నీరా బాటిల్స్ విక్రయిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఒక్కో బాటిల్ ధర రూ.90 ఉంది. ఈ లెక్కన రోజుకూ కేవలం నీరా మీదనే 1.17లక్షల ఆదాయం సమకూరుతున్నది. అయితే ప్రతి రోజు ఉదయం 11 గంటలకు నీరా కేఫ్ తెరుస్తుండగా మూడు, నాలుగు గంటల్లోనే బాటిల్స్ అమ్ముడుపోగా, వీకెండ్‌లో రెండు గంటల్లోనే మొత్తం నీరా అమ్ముడుపోవడం విశేషం. నీరా ఉత్పత్తిని మరింత పెంచాల్సినవసరం ఏర్పడిందంటే నగరవాసులను ఎంతగా ఆకట్టుకుందో చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం నీరా కేఫ్‌ను అత్యాధునికంగా ఏర్పాటు చేయడంతో నీరా ప్రియుల నుంచి అనూహ్య ఆదరణ వస్తున్నది.
ఐటీ కారిడార్‌లో ఏర్పాటు చేయాలి
నీరాకేఫ్‌కు రావడం ఇది పదోసారి. ఇక్కడే ఫస్ట్‌టైం నీరా తాగాను. చాలా బాగా నచ్చింది. ఎలాంటి కెమికల్స్ లేకుండా స్వచ్ఛమైన పానీయం దొరకడం మా అదృష్టమనే చెప్పాలి. మా వాళ్లు నీరా ఎలా తాగేవారో చెప్పేవాళ్లు. స్వచ్ఛమైన నీరా కోసం పల్లెల్లోకి వెళ్లాల్సి వచ్చేదంట. అట్లాంటిది ఎంతో జవాబుదారీతనంతో నగరంలో నీరా కేఫ్ ఏర్పాటు చేసి అందరికి అందుబాటులో పెట్టడం గొప్ప విషయం. నీరా కేఫ్‌ను ఐటీ కంపెనీలున్న ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
– అక్షయ, ఐటీ ఉద్యోగి
ఆరోగ్యానికి మేలు
మాది రాజస్తాన్. నేను ఎప్పుడు హైదరాబాద్‌కు వచ్చినా బిర్యానీ తినడానికి ఆసక్తి చూపిస్తాను. కానీ, నీరా కేఫ్ ప్రారంభమైనప్పటి నుంచి నీరా తాగడానికే ఇష్టపడుతున్నాను. నీరా రుచితో పాటు హెల్త్‌కు కూడా చాలా బెటర్.
– ప్రశాంతి, ఎంట్రప్రెన్యూర్
నీరా నచ్చింది..
నీరా నాకు బాగా నచ్చింది. నీరా తాగడం ఇదే మొదటిసారి. ఇకపై మళ్లీ మళ్లీ రావాలనిపించేల నీరా టేస్ట్ అదిరింది. నగరంలో నీరా కేఫ్‌లు మరిన్ని ఏర్పాటు చేస్తే బాగుంటదనేది నా అభిప్రాయం. ఆరోగ్యాన్ని పంచే పానీయానికి డిమాండ్ ఉండటం సహజమే.ప్రకృతి ప్రసాదించిన ఈ నీరాను సేవించడం ఉత్తమం.
– రవీనా, బంజారాహిల్స్
2023-05-25T20:50:48Z dg43tfdfdgfd