ఓపెన్ ఏఐ నుంచి ఉద్వాసనకు గురైన సామ్ ఆల్ట్మాన్ మైక్రోసాప్ట్లో చేరుతున్నారు. ఆయన మళ్ళీ ఓపెన్ఏఐకే వచ్చేస్తారంటూ కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది.
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ, 'ఆల్ట్మాన్ మైక్రోసాఫ్ట్‌లో చేరుతున్నారు. అడ్వాన్స్డ్ ఏఐ రీసర్చ్ టీమ్‌కు ఆయన నాయకత్వం వహిస్తారు' అని ఎక్స్‌లో (గతంలో ట్విటర్) రాశారు.
ఇక, ట్విచ్ సంస్థ మాజీ సీఈఓ ఎమ్మెట్ షియర్ ఓపెన్ఏఐ కొత్త బాస్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎక్స్‌లో ఆయన, 'జీవితకాలంలో ఒకేసారి లభించే అవకాశం ఇది' అని అన్నారు.
ఓపెన్ ఏఐ బోర్డు సామ్ ఆల్ట్మాన్ పై విశ్వాసం కోల్పోయినట్టు ప్రకటించి, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మైరా మురాఠీని తాత్కాలిక సీఈఓగా ప్రకటించింది. తాజాగా, ఎమ్మెట్ షియర్ సీఈఓగా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోబోతున్నట్లు ఓపెన్ఏఐ ప్రకటించింది.
ఓపెన్ ఏఐ స్థాపనలో కీలక పాత్ర పోషించిన ఆల్ట్మాన్ ప్రసిద్ధ చాట్ జీపీటీ బాట్ సృష్టికర్త కూడా.
‘‘తమ నిర్ణయం పట్ల స్థిరంగా ఉన్నామని, ఓపెన్ ఏఐని ముందుకు తీసుకువెళ్ళడంపై దృష్టిసారిస్తున్నట్టు’’ ఆదివారం సాయంత్రం (నవంబరు 19) కంపెనీ జారీచేసిన ఓ అంతర్గత మెమో న్యూయార్క్ టైమ్స్‌లో కనిపించింది.
ఆల్ట్‌మాన్‌తో మైక్రోసాఫ్ట్‌లో చేరుతున్నారని, అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ టీమ్‌ను వీరు ముందుండి నడిపిస్తారని తెలిపిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ, ఓపెన్ ఏఐలో షియర్స్ నియమాకాన్ని కూడా ధ్రువీకరించారు. షియర్ బృందంతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా చూస్తున్నామని సత్యనాదెళ్ళ ట్వీట్ చేశారు.
వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ ట్విచ్‌కు సహవ్యవస్థాపకుడు, మాజీ బాస్ అయిన షియర్ ఓపెన్ ఏఐ సిబ్బందికి రాసిన లేఖలో ‘‘ నైపుణ్యాల కలబోత, అనుభవం, చక్కటి సంబంధాలతో ఓపెన్ ఏఐను ముందుకు నడుపుతామని’’ చెప్పారు.
ఆల్ట్‌మాన్‌ను తొలగిస్తున్నట్టు ఓపెన్ ఏఐ ప్రకటించాక.. ఆల్ట్మాన్ బోర్డుతో నిజాయితీగా వ్యవహరించకపోవడం వలన బోర్డు తన పని సరిగా చేయలేకపోతున్నట్టు తెలిపింది. అయితే ఆయన ఏ విషయంలో నిజాయితీగా లేరనే విషయాన్ని బోర్డు చెప్పలేదు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఓపెన్ ఏఐ రంగంలో ఆల్ట్మాన్ ప్రభావశీలమైన వ్యక్తి. ఈయన తొలగింపు టెక్నాలజీ రంగంలో ప్రకంపనలు సృష్టించింది.
సిలికాన్ వ్యాలీ నుంచి అనేకమంది ఆల్ట్మాన్ కు మద్దతుగా నిలిచారు. గూగూల్ మాజీ సీఈఓ ఎరిక్ ష్మిడ్ కూడా ఆల్ట్‌మాన్‌ను తన హీరోగా పేర్కొన్నారు.
ఓపెన్ ఏఐ కంపెనీ తాను తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రతిస్పందనలను జాగ్రత్తగా గమనిస్తోంది.
ఆల్ట్మాన్, ఓపెన్ ఏఐలోని ప్రతిభావంతులను తీసుకుని కొత్త కంపెనీ పెడతారేమోననే భయం కూడా ఉంది.
38 ఏళ్ళ ఆల్ట్మాన్ తనను తొలగించిన తరువాత ఓపెన్ ఏఐ ప్రధాన కార్యాలయం వద్ద ఓ ఫోటో దిగి పోస్టు చేశారు.
గెస్ట్ ఐడీ పాస్ని పట్టుకున్నట్టున్న ఆ పోటోను ఎక్స్‌లో షేర్ చేస్తూ, ‘‘నేనెప్పుడూ ఇలాంటివి ధరించలేదు. (గెస్ట్ ఐడీ గురించి ) ఇదే మొదటిది, చివరది’' అని కామెంట్ చేశారు.
టెక్ న్యూస్ సైట్ ‘ది ఇన్ఫర్మేషన్ ’ తెలిపినదాని ప్రకారం ఆల్ట్‌మెన్, బ్రాక్మెన్లను ఆదివారం నాడు శాన్ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయానికి చర్చల నిమిత్తం పిలిచారు.
ఈయన తొలగింపు త్వరలో జరగనున్న 86 బిలియన్ల షేర్ల విక్రయంపై ప్రభావం చూపుతుందని కంపెనీ ఉద్యోగులు భయపడుతున్నారు.
ఓపెన్ ఏఐలో మైక్రోసాఫ్ట్ సహా ప్రధాన పెట్టుబడుదారులందరూ కూడా ఈ నిర్ణయంపై అసహనంతో ఉన్నారని చెపుతున్నారు.
ఓపెన్ ఏఐ సాంకేతికతను మైక్రోసాఫ్ట్ తన అప్లికేషన్లలో వినియోగిస్తోంది.
కానీ, సత్యనాదెళ్ళ మాత్రం ఓపెన్ ఏఐతో తమ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.
ఓపెన్ ఏఐ కంపెనీలో పెట్టుబడుల వెల్లువ కారణంగా లాభాలు గరిష్ఠస్థాయికి చేరాయి.. పైగా గత ఏడాదే ఈ కంపెనీ ప్రవేశపెట్టిన చాట్‌జీపిటీని లక్షలమంది ఉపయోగిస్తున్నారు.
ఓపెన్ ఏఐ ఎదుగుదలకు ముఖ్య కారణం ఆల్ట్మాన్. ఆయనను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇండస్ట్రీకి ముఖచిత్రంగా చూస్తారు.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
2023-11-20T13:34:32Z dg43tfdfdgfd