సీబీఐ కొత్త డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్ కు మయాంక్ అగర్వాల్ ఉన్న రిలేషన్ ఇదే...

సీబీఐ కొత్త డైరెక్టర్ గా ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో క్రికెటర్ మయాంక్ అగర్వాల్ పేరు వైరల్ అవుతోంది. దీనికి కారణం ఏంటంటే.. 

ఢిల్లీ : సిబిఐకి కొత్త డైరెక్టర్ వచ్చారు. ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్ కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఈ వార్త కంటే ఎక్కువగా టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ పేరు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ కి.. మయాంక్ అగర్వాల్ కి ఉన్న లింక్ ఏంటి అని చాలామందిలో ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఆ రిలేషన్ ఏంటంటే.. వారిద్దరూ మామా అల్లుళ్లు.. మయాంక్ అగర్వాల్ కు పిల్లనిచ్చిన మామ ప్రవీణ్ సూద్.

కర్ణాటక మాజీ డీజీపీ ప్రవీణ్ సూద్.. ఆయన కూతురు ఆషితా సూద్..క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా అయిన పరిచయం.. ప్రేమగా మారింది. వీరి పెళ్లి 2018, జూన్ 4వ తేదీన జరిగింది. అలా.. ప్రవీణ్ సూద్ కు.. మయాంక్ అగర్వాల్ కు చాలా దగ్గర సంబంధం ఉంది.  పిల్లనిచ్చిన మామ సిబిఐ డైరెక్టర్ కావడంతో  మయాంక్ అభిమానులు.. అతని పేరు తెరమీదికి తీసుకువచ్చి వైరల్ చేస్తున్నారు.

క్రికెటర్ మయాంక్ అగర్వాల్ కు ఆషితా సూద్ తో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడింది. చాలా కాలం వీరిద్దరూ స్నేహితులుగా ఉన్నారు. అదే వారి మధ్య ప్రేమకు దారి తీసింది. తన మనసులోని మాటను కూడా రొమాంటిక్ స్టైల్లో లండన్ లో ఆమె ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు మయాంక్ అగర్వాల్. దీనికి ఆషితా సూద్ సానుకూలంగా స్పందించింది. 

దీంతో వీరిద్దరి ఇళ్లల్లో పెద్దల అంగీకారంతో 2018 జనవరిలో ఎంగేజ్మెంట్ అయ్యింది. ఆరు నెలల తర్వాత ఇద్దరూ పెళ్లితో ఒకటయ్యారు. ఆషితా సూద్ వృత్తి రీత్యా లాయర్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా లో మాస్టర్స్ చేసింది.  వీరిద్దరికి ఓ కూతురు ఉంది. 

ఇక మయాంక్ కెరీర్ విషయానికి వస్తే.. 2011లో ఆర్సిబి తరపున ఐపిఎల్ లో అడుగు పెట్టాడు. ప్రస్తుత సీజన్ ఐపిఎల్ 2023లో సన్రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు. సన్రైజర్స్ మినీ వేలంలో రూ.8.25 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. అయితే, ఈ కర్ణాటక బ్యాటర్ అంచనాలను ఈ ఎడిషన్ లో అందుకోలేకపోయాడు మయాంక్. 10 మ్యాచ్ ల్లో కేవలం 270 పరుగులే చేశాడు.

మయాంక్ అగర్వాల్ ది కర్ణాటక. ఆస్ట్రేలియాతో టెస్ట్ సందర్భంగా 2018లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. 2020లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. మయాంక్ అగర్వాల్ రైట్ హ్యాండ్ బ్యాటర్.. టీమిండియా ఓపెనర్ గా మంచి గుర్తింపు పొందాడు. 

కెరీర్ లో ఇప్పటివరకు మొత్తం 21 టెస్ట్ లు ఆడాడు. 36 ఇన్నింగ్స్ లు ఆడి, 1488 పరుగులు సాధించాడు. అతని పరుగుల ఖాతాలో… నాలుగు సెంచరీలు, రెండు ద్విశతకాలు ఉంటాయి. ఇక ఐదు వన్డేలు మాత్రమే ఆడే అవకాశం ఉన్న మయాంక్ 86 పరుగులకే పరిమితమయ్యాడు.

2023-05-26T03:16:23Z dg43tfdfdgfd