హీరో సుశాంత్ తల్లి నాగసుశీలపై పోలీసు కేసు.. మళ్లీ మొదలైన గొడవ

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) సోదరి, హీరో సుశాంత్ (Sushanth) తల్లి నాగసుశీలపై (Naga Susheela) పోలీస్ కేసు నమోదైంది. దౌర్జన్యం, దాడి ఆరోపణలతో హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాను భూమిని విరాళంగా ఇచ్చిన శ్రీజ ప్రకృతి ధర్మ పీఠం ఆశ్రమంపై నాగసుశీల, ఆమె కుమారుడు సుశాంత్‌తో పాటు మరికొందరు దాడి చేశారని, సీసీటీవీ కెమెరా వైర్లు కత్తిరించారని నిర్మాత చింతలపూడి శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. నాగసుశీల, శ్రీనివాసరావు కలిసి గతంలో సుశాంత్ హీరోగా పలు చిత్రాలను నిర్మించారు. అలాగే, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ భాగస్వాములుగా ఉన్నారు. వీరి మధ్య కొన్నేళ్లుగా భూవివాదం నడుస్తోంది.

శ్రీనాగ్ కార్పొరేషన్ మేనేజింగ్ పార్ట్‌నర్‌గా ఉన్న చింతలపూడి శ్రీనివాసరావు.. అదే బ్యానర్‌పై నాగసుశీలతో కలిసి సుశాంత్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘కాళిదాసు’ సినిమా తీశారు. ఆ తరవాత ‘కరెంట్’, ‘అడ్డా’, ‘ఆటాడుకుందాం రా..’ సినిమాలను సుశాంత్ హీరోగా నిర్మించారు. కానీ, ఈ సినిమాలేవీ వాళ్లకు లాభాలు తెచ్చిపెట్టకపోగా నష్టాలు మిగిల్చాయి. దీంతో 2017లో నాగసుశీల, శ్రీనివాసరావు మధ్య విబేధాలు మొదలయ్యాయి. మరోవైపు వీరిద్దరు భాగస్వాములుగా కొనుగోలు చేసిన భూముల విషయంలోనూ గొడవలు జరిగాయి. దీంతో 2017లో తొలిసారి చింతలపూడి శ్రీనివాసరావుపై నాగసుశీల నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు.

తన అనుమతి లేకుండా కంపెనీ ఆస్తులను అమ్ముకున్నారని నాగసుశీల కోర్టుకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావు భార్యతో పాటు మరో 12 మందిపై నాగసుశీల ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే, నాగసుశీల తనపై తప్పుడు కేసులు పెట్టారని శ్రీనివాసరావు మీడియా ముందుకు వచ్చారు. మరోవైపు, శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ఆధారాలు ఏవీ చూపించలేకపోవడంతో ఈ కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఆ తరవాత మళ్లీ నాగసుశీల, శ్రీనివాసరావు వివాదం బయటకు రాలేదు. ఇప్పుడు నాగసుశీలపై శ్రీనివాసరావు కేసు పెట్టడంతో మళ్లీ వివాదం బయటికి వచ్చింది.

శ్రీనివాసరావు, నాగసుశీల కలిసి గతంలో చాలా భూములు కొనుగోలు చేశారు. అయితే, అవన్నీ పంపకాలు జరిగిపోయానని శ్రీనివాసరావు చెబుతున్నారు. తన వాటా కింద వచ్చిన భూమిని శ్రీజ ప్రకృతి ధర్మ పీఠం ఆశ్రమానికి విరాళంగా ఇచ్చానని.. అయితే, ఇప్పుడు ఆ భూమి తనదేనని నాగసుశీల గొడవ చేస్తున్నారని పోలీసులకు తెలిపినట్టు సమాచారం. ప్రస్తుతం ఆ స్థలంలో ఆశ్రమం నిర్మాణం జరుగుతుండగా.. నాగసుశీల తన కొడుకు సుశాంత్, బౌన్సర్లు, మరికొంత మంది బయటి వ్యక్తులతో వచ్చి గొడవ చేశారని, దౌర్జన్యం చేశారని శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు.

2023-09-18T11:42:09Z dg43tfdfdgfd