హైదరాబాద్ ‘మిస్సింగ్’ మహిళ మిస్టరీ: కట్టూబొట్టూ, ఐడెంటిటీ మార్చుకుని, రెండో పెళ్లి చేసుకొని గోవాలో జీవనం.. ఐదేళ్ల తర్వాత ఎలా గుర్తించారు?

భర్తతో వి‌‍భేదాల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయారు హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ. రాష్ట్రం దాటేశారు.

ఆమె తనకు సంబంధించిన ఏ చిన్న వివరమూ బయట పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తన ఐడెంటిటీని మార్చేసుకున్నారు. ఓ కొత్త జీవితాన్ని ప్రారం‌‍భించారు.

ఐదేళ్ల తర్వాత, ఆమె చేసిన చిన్న పనితో ఆమె ఎక్కడున్నారో తెలంగాణ విమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులకు తెలిసింది. ఏళ్లపాటు మిస్టరీగా మారిన ఆ మహిళ ఆచూకీ ఎట్టకేలకు తెలుసుకోగలిగారు. ఎవరా మహిళ? ఏమిటా కథ?

హైదరాబాద్‌కు చెందిన ఫాతిమా (పేరు మార్చాం) 2018 జూన్ 29న ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆమె నగరంలోని ఓ ప్రముఖ హోటల్ యజమాని కుమార్తె.

హుమాయున్ నగర్‌లో తన భర్తతో కలిసి ఉంటున్న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయారు.

ఫాతిమా అదృశ్యంపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె భర్తపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. తొలుత పోలీసుల దర్యాప్తు కూడా అదే కోణంలో కొనసాగింది.

‘‘ఆమె కనిపించకుండాపోడం అదే మొదటిసారి కాదు. అంతకుముందు 2014, 2015లోనూ రెండు సార్లు మిస్సింగ్ కావడంతో కేసు నమోదైంది. రెండుసార్లూ ఆమె ఇంటికి తిరిగి వచ్చేసింది. మూడోసారి తిరిగి రాలేదు. కుటుంబంలో కొన్ని విభేదాలున్నాయి. వాటివల్లనే ఆమె కనిపించకుండాపోయిందా? అనే కోణంలో దర్యాప్తు జరిగింది. ఆమె అదృశ్యం వెనుక కొత్త విషయం తెలిసింది’’ అని విమెన్ సేఫ్టీ వింగ్ ఎస్ఐ హరీష్ బీబీసీతో చెప్పారు.

కుటుంబ సభ్యులను ఇంట్లో పెట్టి, తాళం వేసి...

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించారు. 2018 జూన్ 29న కుటుంబ సభ్యులను ఇంట్లో పెట్టి, బయట తాళం వేసి ఆమె వెళ్లిపోయారు. ఫాతిమా తనంతట తానుగా ఇంటి నుంచి వెళుతున్నట్లు సీసీ కెమెరా ఫుటేజీలో కనిపించింది.

కుమార్తె జాడ ఎంతకూ తెలియకపోవడంతో 2019లో ఆమె తండ్రి తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు.

న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ కేసు తెలంగాణ విమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ అయింది. విమెన్ సేఫ్టీ వి‌‍భాగానికి చెందిన ఎస్ఐ పి.హరీష్ దర్యాప్తు చేపట్టారు.

ఫాతిమా స్నేహితులను విచారించినప్పుడు ఓ మొబైల్ ఫోన్ సాయంతో క్యాబ్ బుక్ చేసుకున్నట్లు తేలింది. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు క్యాబ్ కంపెనీ నుంచి ఆమె వాయిస్ రికార్డింగ్ తెచ్చుకుని విన్నారు. క్యాబ్ బుకింగ్ వివరాలను పోలీసులు పరిశీలించారు.

‘‘క్యాబ్ బుకింగ్‌తో ఆమె పుణె వెళ్లినట్లు గుర్తించాం. కానీ, అక్కడ ఎక్కడ ఉందో తెలుసుకోవడం కష్టమైంది. ఆమె క్యాబ్ బుక్ చేసిన ఫోన్ కూడా ఆమె వద్ద లేదు. దీనివల్ల దర్యాప్తులో ఓ చిన్న క్లూ దొరికిందని భావించినా, తర్వాత ఆ దారి మూసుకుపోయింది. అదే సమయంలో కోవిడ్ ప్రబలడంతో దర్యాప్తు నిలిచిపోయింది’’ అని ఎస్ఐ హరీష్ బీబీసీతో చెప్పారు.

పేరు, మతం, ఐడెంటిటీ మార్చుకుని..

ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ పుణె నుంచి ముంబయి వెళ్లారు. అక్కడ తన ఐడెంటిటీని పూర్తిగా మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

పేరు, మతం, వేషధారణ.. ‌ఇలా అన్నింటినీ మార్చుకున్నారు. అక్కడ పరిచయమైన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అనంతరం భర్తతో కలిసి స్వచ్ఛంద సంస్థ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

‘‘ఆమె వెళ్లిపోయినప్పుడు ఉన్న ఫోటో.. ఇప్పుడు లేటెస్ట్‌గా ఉన్న వేషధారణకు ఏ మాత్రం సంబంధం లేదు. గతంలో తప్పిపోయింది ఆమెనేనా అన్నట్లుగా పూర్తిగా మారిపోయింది. జుట్టుకు వేరే రంగు వేసుకుంది. కొత్త జీవితం ప్రారంభించి.. పెళ్లి చేసుకుని ‌భర్తతో ఉంటోంది. ఎన్జీవో తరఫున కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఒక్కసారిగా ఆమెను చూస్తే గుర్తుపట్టలేకపోయాం’’ అని ఎస్‌ఐ హరీష్ చెప్పారు.

ఎలా గుర్తించారు?

ఈ ఏడాది జులైలో ఫాతిమా తన ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకున్నారు. అప్పుడే ఆమెను పోలీసులు గుర్తించారు.

‘‘ఆధార్ అప్‌డేట్ చేసుకున్నప్పుడు డిజిటల్ ఇన్వెస్టిగేటివ్ టూల్స్ వాడి ఫాతిమా అని గుర్తించాం. ఆమె మార్చుకున్న కొత్త పేరును తెలుసుకున్నాం. తెలుగు నుంచి మరాఠీగా మార్చుకుంది. ఆధార్‌తో లింక్ అయిన బ్యాంకు అకౌంట్ వివరాలు తెలుసుకున్నాం.

ఆమె పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ కనిపించింది. అందులో పోస్టుల ఆధారంగా గోవాలో ఉందని గుర్తించాం. అక్కడికి వెళ్లి ఆమెను గుర్తించి, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ సాయంతో ఫాతిమాగా నిర్ధరించుకున్నాం’’ అని ఒక పోలీస్ అధికారి చెప్పారు.

ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీలో ‌భాగంగా ఐరిష్ వివరాలు తీసుకుని ఫాతిమాగా గుర్తించారు పోలీసులు.

ముంబయిలో ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తికి కూడా ఫాతిమా గత ఐడెంటిటీ గురించి తెలియదని పోలీసులు చెప్పారు.

హైకోర్టు ఏం చెప్పింది?

జులై 26న ఫాతిమాను గుర్తించి గోవా నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. ఆ తర్వాత హైకోర్టులో హాజరుపరిచారు.

‘‘ఆమె బాలిక కాదు మేజర్. విచారణ సందర్భంగా ఆమెకు ఇష్టమైన జీవితం గడిపేందుకు న్యాయస్థానం ఆమెకు అనుమతించింది’’ అని రాష్ట్ర అదనపు డీజీ శిఖా గోయల్ బీబీసీతో చెప్పారు.

‘‘ఇదొక ప్రత్యేకమైన కేసు. డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో తప్పిపోయిన మహిళను గుర్తించగలిగాం.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విమెన్ సేఫ్టీ వింగ్ పేరుతో ప్రత్యేక వి‌‍భాగం పనిచేస్తోంది. కనిపించకుండా పోతున్న మహిళలు, పిల్లల ఆచూకీ గుర్తించే విషయంలో మా వి‌‍‌‍‌‍భాగం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీలను వాడుకుంటున్నాం’’ అని ఆమె చెప్పారు.

‘‘మహిళలు, చిన్న పిల్లల అక్రమ ట్రాఫికింగ్ నిరోధానికి యాంటీ హ్యూమన్ ట్రా‌‍‌‍ఫికింగ్ యూనిట్ పనిచేస్తోంది. మిస్సింగ్ పర్సన్ మానిటరింగ్ సెల్ ప్రత్యేకంగా ఉంది. తెలంగాణలో మిస్సింగ్ కేసులను ఛేదించడంలో మంచి పురోగతి ఉంది. ముఖ్యంగా మ‌హిళల మిస్సింగ్ కేసులు ఛేదించే విషయంలో జాతీయ సగటు కంటే ఎంతో ముందున్నాం’’ అని శిఖా గోయల్ బీబీసీతో చెప్పారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం- 2021లో మిస్సింగ్ మహి‌‍ళల రికవరీ జాతీయ సగటు 56.2 శాతంగా ఉండగా, తెలంగాణలో 87.8 శాతంగా ఉంది.

తెరపైకి డాటా ప్రైవసీ

ఫాతిమా కేసు వి‌షయంలో పోలీసుల విచారణ వి‌షయంలో డాటా ప్రైవసీ అంశం కీలకంగా మారింది.

ఆధార్ వివరాలు ఇతర శాఖల చేతుల్లో ఉంటే కొంత ఇబ్బందికరమేనని అ‌‍భిప్రాయపడ్డారు ఎండ్ నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనిల్ రాచమళ్ల.

‘‘ఆధార్, పాన్ వంటి వ్యక్తి గత వివరాలు వేరొక వ్యక్తి లేదా వి‌‍భాగానికి తెలిసేందుకు వీలుండకూడదు. ఆధార్ వివరాల ఆధారంగా కేసును ‌ఛేదించారంటే డాటా ప్రైవసీ అంశం తెరపైకి వస్తుంది. ఈ ప్రత్యేకమైన కేసు విచారణలో న్యాయస్థానం ఇచ్చిన ఆదే‌‍శాలు కీలకమవుతాయని గుర్తించాలి’’ అని అనిల్ బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2023-09-19T07:40:07Z dg43tfdfdgfd