హ్యాట్సాప్ పిల్లలు : నాలాలోని కుక్కను సాహసంతో కాపాడిన చిన్నారులు..

హ్యాట్సాప్ పిల్లలు : నాలాలోని కుక్కను సాహసంతో కాపాడిన చిన్నారులు..

కుక్కల దాడిలో చిన్నారులు చనిపోతున్నారు.. వీధి కుక్కలు చంపేస్తున్నాయి అంటూ రోజూ వార్తలు వింటూనే ఉన్నాం.. అందుకు భిన్నంగా ఉంది ఈ చిత్రం.. ప్రాణాలకు తెగించి మరీ.. హైదరాబాద్ లోని నాలాలో దిగి.. ఇద్దరు పిల్లలు కుక్కను కాపాడిన వీడియో వైరల్ అయ్యింది. ఉధృతంగా ప్రవహిస్తున్న మురుగు నీటిలో.. మోకాళ్లలోతులో దిగిన ఇద్దరు పిల్లలు.. నాలాలో గోడలో ఇరుక్కుపోయి.. బిక్కుబిక్కుమంటున్న కుక్కను.. ఎత్తుకుని బయటకు తీసుకురావటం విశేషం.. ఈ పిల్లల తెగువ, కుక్కపై ప్రేమకు నెటిజన్లు హ్యాట్సాప్ పిల్లలు అంటున్నారు.. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ సిటీ నాచారం ప్రాంతంలో పెద్ద నాలా ఉంది. 10 అడుగుల లోతులో మురుగునీరు ప్రవహిస్తుంది. నాలాలోని రక్షణ గోడకు ఉన్న  ఓ గ్యాప్ లో కుక్క చిక్కుకుపోయింది. అది అక్కడికి ఎలా వెళ్లిందో కానీ.. బయటకు రావటానికి మాత్రం మార్గం లేకుండాపోయింది. నాలాలో చిక్కుకుపోయిన కుక్కను రక్షించటానికి.. ఈ ప్రాంతంలో నివసించే ఇద్దరు చిన్నారులు పెద్ద సాహసం చేశారు. ప్రణీత్, నాగరాజు అనే ఇద్దరు పిల్లలు.. ఎంతో దైర్యం చేసి నాలాలోకి దిగారు. మోకాలు లోతు నీటిలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ.. కుక్కను బయటకు తీశారు. దాన్ని ఎత్తుకుని సురక్షితంగా పైకి తీసుకొచ్చారు. ఈ ఇద్దరు పిల్లల దైర్యానికి, సాహసానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. నాలాలో అప్పటికే ఉధృతంగా మురుగునీరు ప్రవహరిస్తుంది. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా కొట్టుకుపోతారు. అలా కాకుండా ఇద్దరు చిన్నారులు ఒకరికి ఒకరు చేతులు పట్టుకుని.. ఎంతో జాగ్రత్తగా కుక్కను బయటకు తీసుకురావటం విశేషం..

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజన్లు ఫిదా అయ్యారు. జంతువులపై ఆ పిల్లలకు ఉన్న ప్రేమకు హ్యాట్సాప్ అంటున్నారు. రోజూ కుక్కల దాడులు అనే వార్తలకు భిన్నంగా.. ఓ వీధి కుక్కను పిల్లలు కాపాడిన తీరును నిజంగా మెచ్చుకోవాల్సిందే కదా.. ఈ చిన్నారుల సాహసానికి మెచ్చిన జంతు సంరక్షణ పౌండేషన్ ప్రతినిధులు.. ఆ ఇద్దరు పిల్లలకు సైకిళ్లు, స్కూల్ బ్యాగ్స్, బట్టలు, స్టేషనరీ కొనిచ్చారు. 

©️ VIL Media Pvt Ltd.

2023-05-26T07:59:04Z dg43tfdfdgfd