ఠీవీగా..

  • రాజ్యమేలుతున్న ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీలు
  • మూలనపడ్డ సీఆర్‌టీ టీవీలు
  • అత్యాధునిక టెక్నాలజీతో తయారు
  • అదిరే డిజైన్‌, నాణ్యతలో మేటి
  • ఆఫర్లతో ఆకర్షిస్తున్న కంపెనీలు
  • పట్టణాల నుంచి పల్లెల దాకా నయా ట్రెండ్‌
  • ప్రతి ఇంట్లో దర్శనం
  • ధర ఎక్కువైనా కొనుగోలుకు మొగ్గు
  • నచ్చిన కార్యక్రమాలు వీక్షిస్తూ ఎంజాయ్‌ చేస్తున్న ప్రజలు

మీలో ఎవరైనా సీఆర్‌టీ టీవీలు చూశారా.. నలభై ఏండ్ల క్రితం ఊర్లో ఒకటి, రెండు ఇండ్లల్లో మాత్రమే ఉండేవి. ఒక పెద్ద డబ్బా సైజులో ఓ టేబుల్‌ మీదనో.. ఒక స్టూల్‌పైనో సెల్ఫ్‌లోనో పెట్టుకుని కార్యక్రమాలు వీక్షించేవారు. కాలక్రమేణా సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పుల కారణంగా అవి మూలనపడుతున్నాయి. వాటి స్థానాన్ని ఫ్లాట్‌ టీవీలు అంటే ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీలు ఆక్రమించేస్తున్నాయి. డిజైన్‌, పిక్చర్‌, సౌండ్‌ సిస్టం అత్యంత నాణ్యతగా ఉండటంతో ప్రజలు సైతం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ కంపెనీలు ఆండ్రాయిడ్‌, వైఫై, బ్లూ టూత్‌ వంటి ఫీచర్లతో రోజుకో మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. వీటిని గోడలకు అమర్చుకునే సౌకర్యం ఉండడంతో ఇంటికి తెచ్చిన వెంటనే వాల్‌ మౌటింగ్‌ చేసుకుంటున్నారు. ఖాళీ సమయంలో నచ్చిన చానల్‌ పెట్టుకుని చూస్తూ ఆనందిస్తున్నారు.

– మునిపల్లి, మే 27

మునిపల్లి, మే 27: ప్రస్తుతం పల్లెల నుంచి పట్టణాల దాకా అన్ని ఇండ్లల్లో గోడ టీవీలే దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు పెద్ద పెద్ద డబ్బాల ఆకారంలో ఉండే సీఆర్‌టీ (క్యాథోడె రే ట్యూబ్‌) టీవీలు ఊరిలో ఏదో ఒక్కరో ఇద్దరి వద్ద మాత్రమే ఉండేవి. వీటిని టేబుల్‌, స్టూల్‌ మీద లేదా అరలోనో పెట్టుకుని ఆ ఇంటివారితో పాటు చుట్టుపక్కల వారు సైతం అక్కడే చేరి కార్యక్రమాలు వీక్షించేవారు. వీటికి స్థలం కూడా ఎక్కువగానే కేటాయించాల్సి వచ్చేది. రోజురోజుకూ టెక్నాలజీ పెరుగుతుండడంతో వాటి స్థానంలో ఎల్‌సీడీ(లిక్విడ్‌ క్లిస్టర్‌ డిస్‌ప్లే), ఎల్‌ఈడీ (లైట్‌ ఇమ్మిటింగ్‌ డియోడిస్‌) టీవీలు అందుబాటులోకి వచ్చాయి.

అతితక్కువ బరువు, మందం, ఎంతో ఆకర్షణీయంగా, బొమ్మ మరింత స్పష్టంగా కనిపించేలా వీటిని కంపెనీలు మార్కెట్‌లోకి తెచ్చాయి. మరో ఆసక్తికర విషయమేమిటంటే ఇవి స్థలం తక్కువ ఆక్రమించడంతో పాటు గోడకు ఫిక్స్‌ చేసుకుని నచ్చిన చానల్‌ను చూసుకోవచ్చు. దీంతో టీవీలను కొనుగోలు చేసిన అనంతరం హాల్‌లోనో, బెడ్‌ రూమ్‌లోనో వాల్‌ మౌంట్‌ చేసుకుంటున్నారు. అలా పాప్‌కార్న్‌ తింటూ.. కూల్‌ డ్రింగ్‌ తాగుతూ సోఫానో, మంచం మీదనో కూర్చొని టీవీ చూస్తుంటే ఆ మాజానే వేరంటున్నారు ప్రజలు. ప్రస్తుతం ఐపీల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు నడుస్తుండడంతో క్రికెట్‌ అభిమానులంతా టీవీల ముందే కూర్చుని ఎంజాయ్‌ చేస్తున్నారు.

మూలనపడ్డ టేబుల్‌ టీవీలు

మారుతున్న కాలానికనుగుణంగా సాంకేతికపరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవడంతో గ్రామాల్లో టేబుల్‌ (సీఆర్‌టీ)టీవీలు మూలనపడ్డాయి. ప్రస్తుతం గోడ టీవీలు మార్కెట్‌ను ఏలుతుండడంతో టేబుల్‌ టీవీలు అటకెక్కుతున్నాయి. గతంలో టీవీలు పాడైతే సైకిల్‌ మీదో రిక్షాలోలో తీసుకెళ్లి రిపేర్‌ చేయించుకునేవారు.. కానీ ఇప్పుడు సీఆర్‌టీ టీవీలు రిపేర్‌ చేసే వాళ్లు సైతం మార్కెట్‌లో లేకపోవడంతో వాటిని పక్కన పడేసి కొత్త ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీలను కొనుగోలు చేస్తున్నారు. మారుమూల పల్లెల్లో సైతం ప్రతి ఇంట్లో గోడ టీవీలు దర్శనమిస్తున్నాయి.

ధర ఎంతైనా సరే..

ప్రస్తుతం గోడ టీవీల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ధర ఎంతైనా పర్వాలేదు ఇంట్లో మాత్రం ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీ ఉండాల్సిందే అంటున్నారు ప్రజలు. సీఆర్‌టీ టీవీల్లో బొమ్మ స్పష్టంగా కనిపించడకపోవడం, సౌండ్‌ కూడా సరిగా వినిపించకపోవడం తదితర కారణాలతో టీవీ చూడాలంటే అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. నేడు వివిధ కంపెనీలు అత్యాధునిక టెక్నాలజీతో ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీలను తయారుచేసి అందుబాటులోకి తేవడంతో ధరకు ఎవరూ వెనుకాడడం లేదు. రూ.20వేల నుంచి రూ.లక్షలు వెచ్చించి పెద్ద పెద్ద టీవీలను కొనుగోలు చేస్తున్నారు.

బొమ్మ మంచిగ వస్తున్నది…

ఇంట్లో టేబుల్‌ టీవీలో వచ్చే బొమ్మ కంటే ఎల్‌సీడీ, ఎల్‌ఈడీల్లో వచ్చే బొమ్మ మంచిగా కనిపిస్తుంది. మా పిల్లల కోరిక మేరకు టేబుల్‌ టీవీని పక్కన బెట్టి గోడ టీవీ కొన్నాం. టేబుల్‌ టీవీ ఉన్నప్పుడు మా పిల్లలు పక్క ఇంట్లో ఉన్న గోడటీవీలో చూసేందుకు వెళ్లేవాళ్లు. పిల్లల కోరిక మేరకు రూ.35వేలు పెట్టి టీవి తెచ్చుకున్నాం. ఇప్పుడు అందరం సంతోశంగా ఇంట్లో కూర్చొని టీవీలో వచ్చే కార్యక్రమాలు చూస్తున్నాం. – ప్రశాంత్‌, మునిపల్లి

గోడటీవీ బాగుంది..

మా ఇంట్లో టేబుల్‌ టీవీ మంచిగా ఉన్నప్పటికీ దాన్ని అమ్మకుండా సంచిలో కట్టి పక్కన పెట్టినం. దాని స్థానంలో గోడ టీవీ తెచ్చుకున్నం. టేబుల్‌ టీవీలో కంటే గోడటీవీలో బొమ్మ మంచిగ వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను ఎంతో ఎంజాయ్‌ చేస్తూ చూస్తున్నం. సినిమాలు, సీరియళ్లు వచ్చినప్పుడు కుటుంబసభ్యులందరం ఒకే దగ్గర కూర్చుని చూస్తాం.

– మల్లేశం, టీ వరల్డ్‌ షాప్‌, బుధేరా

ఎల్‌సీడీ, ఎల్‌ఈడీలకే మొగ్గు చూపుతున్నారు

ప్రస్తుతం ప్రజలు ఎక్కువ గోడటీవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం గోడ టీవీలు రాజ్యమేలుతుండడంతో వివిధ కంపెనీలు పెద్ద పెద్ద ఆఫర్లు ఇస్తుండడంతో ప్రజలు టేబుల్‌ టీవీలు పక్కన పెట్టి గోడ టీవీలను కొనుగోలు చేస్తున్నారు. మా దుకాణంలో ముందుగానే ఆర్డర్‌ ఇచ్చి కొంటున్నారు. గోడటీవీలు పాడైతే మా దగ్గరకు వచ్చిన వారు చాలామంది పాత టీవీని మార్చి కొత్త గోడటీవీని తీసుకుని పోతున్నారు. గ్రామాల్లో సైతం అందరూ గోడ టీవీలనే ఇష్టపడుతున్నారు.

– నిజామొద్దీన్‌, వ్యాపారి, బుధేరా

2023-05-27T21:36:30Z dg43tfdfdgfd